- చర్చకు పట్టుబడితే బయటకు పంపుతారా
- ప్రభుత్వ తీరును తప్పుపట్టిన మల్లికార్జున ఖర్గే
న్యూ దిల్లీ, జూలై 27 : ధరల పెరుగుదలపై గళమెత్తిన ఎంపీలను సస్పెండ్ చేయడాన్ని రాజ్యసభలో ప్రతిపక్ష నాయకుడు మల్లికార్జున్ ఖర్గే ఆక్షేపించారు. ఎంపీలపై సస్పెన్షన్‌ను ఎత్తివేయాలని లోక్‌సభ స్పీకర్,రాజ్యసభ చైర్మన్లను కోరతామన్నారు. ఈ మేరకు విజ్ఞాపనా పత్రాన్ని అందజేయ నున్నామని వెల్లడించారు. కాగా ఎంపీలను సస్పెండ్ చేయడంపై ప్రతిపక్ష పార్టీలు బుధవారం సమావేశమయ్యాయి. సభలో వ్యవహరించాల్సిన వ్యూహంపై పార్టీల ప్రతినిధులు చర్చించారు. అనంతరం మల్లికార్జున్ ఖర్గే మాట్లాడుతూ..ద్రవ్యోల్బణం, నిత్యావసరాలపై జీఎస్టీ అంశాలపై చర్చించాలని గత 7 రోజుల నుంచి కోరుతున్నాం. సామాన్యులు ఆందోళన చెందుతున్న ఈ అంశాలపైనే ఈ రోజు కూడా మా గొంతు వినిపిస్తాం.
నిరంతరాయంగా మా వాణిని వినిపిస్తాం. కానీ ప్రభుత్వం మాత్రం ఈ అంశాలపై చర్చించేందుకు సిద్ధంగా లేదు. ఈ అంశంపై ఈ రోజు చైర్మన్‌ను వ్యక్తిగతంగా కలుస్తాను. చర్చ తేదీ, సమయం చెప్పాలని అడుగుతా. మేము చర్చకు సిద్ధం. స్పీకర్, రాజ్యసభ చైర్మన్‌కు ఈ మేరకు లేఖ అందజేస్తాం. ధరల పెరుగుదలకు వ్యవరేతికంగా మాట్లాడుతాం. కానీ ప్రభుత్వం అందుకు సుముఖంగా లేదని చెప్పారు. ఇదిలావుంటే రాజ్యసభలో మరో ప్రతిపక్ష ఎంపీపై సస్పెన్షన్వేటు పడింది. ఆమ్ ఆద్మీ పార్టీ ఎంపీ సంజయ్ సింగ్‌ను డిప్యూటీ చైర్మన్ హరివంశ్ నారాయణ్ సింగ్ సస్పెండ్ చేశారు. పార్లమెంటరీ వ్యవహారాల సహాయమంత్రి వీ మురళీధరన్ ప్రవేశపెట్టిన మోషన్‌పై సభాపతి ఈ నిర్ణయం తీసుకున్నారు.
ఎంపీ సంజయ్ సింగ్ మంగళవారం నిబంధనలకు విరుద్ధంగా సభలో పేపర్లు చింపి సభాపతిపై విసిరిన కారణంగా రూల్ 256 కింద సస్పెండ్ చేస్తున్నట్టు వెల్లడించారు. ఈ వారమంతా ఆయనపై సస్పెన్షన్ వేటు పడింది. గుజరాత్లో కల్తీమద్యం-మరణాలపై ఆప్ ఎంపీ సంజయ్ సింగ్ మంగళవారం సాయంత్రం రాజ్యసభలో గళమెత్తారు. 40 మంది చనిపోయారని, కారణం ఏంటో చెప్పాలంటూ సభలో పెద్దఎత్తున నినాదాలు చేశారు. వెళ్లి సీట్లో కూర్చోవాలని చైర్మన్ విజ్ఞప్తి చేసినా ఆయన పట్టించుకోలేదు. పేపర్లు చింపి కుర్చిపై చైర్మన్‌పై విసిరారని చైర్మన్ పేర్కొన్నారు. దీంతో ఇప్పటివరకు సస్పెండ్ అయిన ప్రతిపక్ష ఎంపీల సంఖ్య 24కు పెరిగింది.
రాజ్యసభ ఎంపీలు 20 మంది కాగా, లోక్‌సభ సభ్యుల సంఖ్య 4గా ఉంది. ఇక్కడే ఉంటే.. నిరసన తెలియజేస్తా.. తన సస్పెన్షన్‌పై ఎంపీ సంజయ్ సింగ్ స్పందించారు. సభాలోనే ఉంటానని, గుజరాత్లో కల్తీ మద్యానికి మరణాలపై కారణాలను డిమాండ్ చేస్తానని ఆయన చెప్పారు. సస్పెన్సన్‌కు గురయిన మొత్తం 20 మంది రాజ్యసభ ఎంపీలు 50 గంటలపాటు పార్లమెంట్ కాంప్లెక్స్‌లో రిలే నిరసన తెలపనున్నట్టు తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ దోలా సెన్ చెప్పారు. కాగా ప్రతిపక్ష ఎంపీ నినాదాల మధ్య సభ వాయిదా పడుతూ కొనసాగుతోంది. విపక్షాలు సహకరిస్తే అన్ని అంశాలపైనా చర్చించేందుకు సిద్ధంగా ఉన్నామని మంత్రులు చెబుతున్నారు.