ఎంపీల మూకుమ్మడి సస్పెన్షన్లపై ధర్నా

జంతర్‌మంతర్‌ వద్ద ‘ఇండియా’ కూటమి నిరసన
ప్రజాస్వామ్యం ప్రమాదంలో ఉందన్న నేతలు
భద్రతా వైఫల్యంపై  ప్రభుత్వంపై విమర్శలు
భాజపా ఎంపీలు పారిపోయారు : రాహుల్‌ గాంధీ
రాజ్యాంగ విధులను నిర్వర్తించడంలో వారు విఫలం
ఎంపీల సస్పెన్షన్‌పై ఖర్గే తీవ్ర విమర్శలు

న్యూఢిల్లీ, డిసెంబర్‌22 : పార్లమెంటులోకి దుండగులు చొరబడిన ఘటనపై ప్రశ్నించిన లోక్‌సభ, రాజ్యసభ సభ్యులను పెద్ద సంఖ్యలో సస్పెండ్‌ చేయడాన్ని నిరసిస్తూ.. ‘ఇండియా’ కూటమి దేశవ్యాప్త ఆందోళనలకు పిలుపునిచ్చింది. దీనిలో భాగంగా శుక్రవారం దిల్లీలోని జంతర్‌మంతర్‌ వేదికగా విపక్ష నేతలు నిరసనలో పాల్గొన్నారు. సేవ్‌ డెమోక్రసీ పేరిట ఈ కార్యక్రమం చేపట్టారు. భద్రతా వైఫల్యంపై కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్‌లో ప్రకటన చేయాలని విపక్ష ఎంపీలు డిమాండ్‌ చేశారు. దాంతో ఉభయ సభల కార్యకలాపాలకు అంతరాయం కలిగిస్తున్నారంటూ సభాపతులు విపక్ష ఎంపీలపై వేటువేశారు. మొత్తం 146 మంది ఎంపీలు సస్పెండ్‌ అయ్యారు. ఈ మూకుమ్మడి సస్పెన్షన్లపై తీవ్ర నిరసన వ్యక్తమైంది. ఈ క్రమంలోనే జంతర్‌మంతర్‌ వద్ద విపక్ష పార్టీలకు చెందిన నేతలు ఆందోళన చేపట్టారు. కాంగ్రెస్‌ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గే, ఆ పార్టీ అగ్రనేత రాహుల్‌ గాంధీ, ఎన్‌సీపీ అధినేత శరద్‌ పవార్‌ సహా పలువురు నేతలు ఈ ఆందోళనలో భాగమయ్యారు. ప్రజాస్వామ్య చరిత్రలో ఎక్కడా కూడా 146 మంది ఎంపీలు సస్పెండ్‌ అయిన పరిస్థితులు లేవు. ప్రజాస్వామ్యం ప్రమాదంలో ఉందని ప్రజలు తెలుసుకోవాలి. దీనికి ఒక్కటే పరిష్కారం. ఈ ప్రభుత్వాన్ని గద్దె దించి, ఇండియా కూటమిని అధికారంలోకి తేవాలి’ అని కాంగ్రెస్‌ ఎంపీ శశిథరూర్‌ అన్నారు. కార్యక్రమంలో కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాంధీమాట్లాడారు. ఈ సందర్భంగా లోక్‌సభలో చోటుచేసుకున్న భద్రతా వైఫల్యంపై ప్రభుత్వాన్ని విమర్శించారు. అలాగే ఆ ఘటన జరిగిన వెంటనే భాజపా ఎంపీలు సభ నుంచి పారిపోయారని ఎద్దేవా చేశారు.

కొందరు యువత పార్లమెంట్‌లో ప్రవేశించి, పొగ వెదజల్లారు. ఆ వెంటనే సభ నుంచి పలువురు భాజపా ఎంపీలు బయటకు పరుగులు తీశారు. ఈ ఘటనలో భద్రతా వైఫల్యం ప్రధాన అంశం. అదే సమయంలో ఆ యువకులు అలా ఎందుకు నిరసన చేశారనేది మనం గమనించాల్సిన మరో అంశం. దేశంలోని నిరుద్యోగమే అందుకు కారణం. ఈ నిరుద్యోగం గురించి మీడియా మాట్లాడదు. కానీ రాహుల్‌ గాంధీ వీడియో రికార్డు చేస్తున్నారని మాత్రం చర్చిస్తుంది’ అని రాహుల్‌ అసహనం వ్యక్తం చేశారు. ఈ భద్రతా వైఫల్యంపై కేంద్రం సమాధానం చెప్పాలని డిమాండ్‌ చేసిన విపక్ష ఎంపీలు సస్పెండ్‌ అయిన సంగతి తెలిసిందే. అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు నుంచి పాఠాలు నేర్చుకున్నామని చెప్పారు కాంగ్రెస్‌ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గే. కాంగ్రెస్‌ వర్కింగ్‌ కమిటీ సమావేశంలో పార్టీ నేతలను ఉద్దేశించి ఆయన మాట్లాడారు. ఎంపీ సస్పెన్షన్‌ విషయమై లోక్‌సభ స్పీకర్‌, రాజ్యసభ ఛైర్మన్‌పై పరోక్ష విమర్శలు గుప్పించారు ఖర్గే. ఎంపీలను రక్షించే బాధ్యతల్లో ఉన్నవారే రాజ్యాంగ విధులను నిర్వర్తించడంలో విఫలమయ్యారని ఆరోపించారు కాంగ్రెస్‌ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గే. పార్లమెంట్‌ ఉభయ సభల నుంచి విపక్ష ఎంపీలను సస్పెండ్‌ చేసిన నేపథ్యంలో స్పీకర్‌, రాజ్యసభ ఛైర్మన్‌పై ఆయన పరోక్ష విమర్శలు చేశారు.

దిల్లీలో గురువారం జరిగిన కాంగ్రెస్‌ వర్కింగ్‌ కమిటీ సమావేశంలో పార్టీ నేతలను ఉద్దేశించి ఆయన మాట్లాడారు. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు నుంచి పాఠాలు నేర్చుకున్నామని చెప్పారు. త్వరలో జరగబోయే 2024 సార్వత్రిక ఎన్నికలకు సిద్ధం కావాలని కార్యకర్తలకు సూచించారు. ఫలితాలు ప్రతికూలంగా వచ్చినా, ఓటు షేర్‌ పెరగడం లాంటివి కొన్ని సానుకూలంగా జరిగాయని తెలిపారు. ‘‘ప్రజాస్వామ్యాన్ని బీజేపీ ఎలా ధ్వంసం చేస్తుందో దేశం మొత్తం చూస్తోంది. కీలకమైన బిల్లులను ఎలాంటి చర్చలు లేకుండానే ఆమోదించుకుంటోంది. పార్లమెంట్‌ను అధికార పార్టీ వేదికగా మార్చుకునేందుకు కుట్రలు పన్నుతున్నారు. రాజ్యాంగ పదవులు పొందిన వారు కుల, ప్రాంత రాజకీయాలు చేస్తున్నారు. ఇటీవల వచ్చిన అసెంబ్లీ ఫలితాలు నిరాశకు గురిచేశాయి. వాటిని విశ్లేషించుకుంటాం. మళ్లీ అవి జరగకుండా చూసుకుంటాం. లోక్‌?సభ ఎన్నికలు ఎంతో దూరంలో లేవు. కార్యకర్తలు, నేతలందరూ కార్యాచరణ ప్రారంభించాలి. రాహుల్‌ గాంధీ మరో విడత భారత్‌ జోడో యాత్ర తూర్పు నుంచి పశ్చిమానికి చేయాలని అనేక మంది నేతలు కోరారు.

దీనిపై అంతిమ నిర్ణయం ఆయన చేతుల్లోనే ఉందని అన్నారు. సీట్ల సర్దుబాటుపై వెంటనే చర్చలు ప్రారంభించాలని విపక్ష కూటమి ఇండియా నాలుగో సమావేశంలో ఏకగ్రీవ నిర్ణయం తీసుకున్నామని మల్లిఖార్జున ఖర్గే చెప్పారు. ఇందుకోసం కాంగ్రెస్‌? ఐదుగురు సభ్యులతో కూడిన కమిటీని ఏర్పాటు చేసిందని వెల్లడిరచారు. ఈ కమిటీ వివిధ రాష్ట్రాల్లోని పార్టీలను కలిసి సీట్ల సర్దుబాటుపై చర్చిస్తుందని వివరించారు. సార్వత్రిక ఎన్నికల వ్యూహాలు, సీట్ల సర్దుబాటుపై చర్చలోక్‌సభ ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలు, ఇండియా కూటమి పార్టీలతో సీట్ల సర్దుబాటు తదితర విషయాలపై చర్చించేందుకు కాంగ్రెస్‌ వర్కింగ్‌ కమిటీ   దిల్లీలో సమావేశమైంది. పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే అధ్యక్షతన  ప్రధాన కార్యాలయంలో ఈ భేటీ జరిగింది. కాంగ్రెస్‌ పార్లమెంటరీ పార్టీ ఛైర్‌పర్సన్‌ సోనియా గాంధీ, మాజీ అధ్యక్షుడు రాహుల్‌ గాంధీ, కాంగ్రెస్‌ ముఖ్య నాయకురాలు ప్రియాంక గాంధీ,  సభ్యులు సమావేశానికి హాజరయ్యారు. ఇటీవల వెలువడిన మూడు రాష్ట్రాల ఎన్నికల ఫలితాల్లో కాంగ్రెస్‌కు నిరాశ ఎదురుకావడం వల్ల అక్కడ తాము కీలక అస్త్రాలుగా భావించి ప్రచారానికి వెళ్లిన అంశాలపై మరోసారి విశ్లేషించుకున్నారు. కుల గణన, అదానీ వ్యవహారం వంటి అంశాలతో మధ్యప్రదేశ్‌, ఛత్తీస్‌గఢ్‌, రాజస్థాన్‌లో ఎన్నికల బరిలోకి దిగినప్పటికీ అవి అంతగా పనిచేయలేదని కాంగ్రెస్‌ అధిష్ఠానం భావిస్తున్నట్టు సమాచారం. దీంతో రానున్న లోక్‌సభ ఎన్నికల్లో అధికార బీజేపీని ఢీకొట్టేందుకు కొత్త అజెండాతో కాంగ్రెస్‌ ముందుకు వెళ్లనుందని సంబంధిత వర్గాల ద్వారా తెలుస్తోంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page