ఎన్నికల వేళ డిఫెన్స్‌లో బిఆర్‌ఎస్‌..

పార్లమెంటు ఎన్నికలు సమీపిస్తున్నకొద్ది బిఆర్‌ఎస్‌ పార్టీకి నీటి ప్రాజెక్టుల ఉచ్చు బిగుస్తున్నది. ఇదే అంశంపైన బిఆర్‌ఎస్‌ను ప్రజలముందు నగ్నంగా నిలబెట్టాలని కాంగ్రెస్‌ యత్నిస్తున్నది. అయితే ఇదేఅంశాన్ని తిప్పికొట్టడంద్వారా అంతామంచే చేశామని బిఆర్‌ఎస్‌ చెప్పుకునే ప్రయత్నం చేస్తున్నప్పటికీ, ఆ పార్టీకి ఈ ప్రాజెక్టుల వ్యవహారం ఇప్పుడు జీవన్మరణ సమస్యగామారింది. ప్రపంచంలోని అద్భుతాల్లో కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణం ఒకటంటూ నాడు అధికారంలోఉన్న బిఆర్‌ఎస్‌ ప్రభుత్వం విస్తృతంగా ప్రచారం చేసుకుంది. దేశంలోని వివిధ రాష్ట్రాలకు చెందిన రాజకీయ నాయకులతోపాటు, కేంద్రంలో అధికారంలోఉన్న బిజెపి మంత్రులు పలువురు ఈ ప్రాజెక్టు నిర్మాణానికి కితాబు ఇచ్చిన సంఘటనలు లేకపోలేదు. అయినా రాష్ట్రంలో నాడు ప్రతిపక్ష పార్టీలైన కాంగ్రెస్‌, బిజెపి పార్టీలు మాత్రం ఈ ప్రాజెక్టుపై మొదటినుండీ తీవ్రంగా విమర్షనాస్త్రాలను సంధిస్తూనే ఉన్నాయి. బిఆర్‌ఎస్‌ నేతలకు ఇది ఏటిఎంగా మారిందంటూ, ఇందులో కోట్లాది రూపాయల అవినీతి జరిగిందంటూ దేశ ప్రధాని నరేంద్రమోదీతో సహా  కోడై కూసూవొచ్చారు.

అయితే రాష్ట్రంలో ఇటీవల జరిగిన శాసనసభ ఎన్నికల వరకు కేవలం అవినీతి ఆరోపణలకే పరిమితమైన ఈ ఆరోపణలు మేడిగడ్డ బ్యారేజీ కూలటంతో ఎంత నాసిరకంగా ఈ ప్రాజెక్టుల నిర్మాణాలు జరిగాయన్నది బహిర్ఘతమైంది. సరిగ్గా ఎన్నికలకు కొద్ది రోజుల ముందే బ్యారేజీ కుంగటం ప్రారంభించింది. ఆ బ్యారేజీ కుంగటం బిఆర్‌ఎస్‌ పార్టీ ఎన్నికల ఓటమికి మరో కారణంగా మారింది. ఒక విధంగా ఆ పార్టీని కోలుకోకుండా దెబ్బతీసింది. దానిపై ఎలాంటి సంజాయిషీని చెప్పుకోలేని పరిస్థితి ఏర్పడిరది. ఆ ఎన్నికలు ముగిసి మూడు నెలలైనా కాలేదు, ఇప్పుడు మరో విషమ పరీక్షను బిఆర్‌ఎస్‌ ఎదుర్కోవాల్సి వొచ్చింది. త్వరలో జరుగనున్న  పార్లమెంటు ఎన్నికలు ఆ పార్టీకి సవాల్‌గా మారాయి.  ఈ ఎన్నికల్లోనైన మెజార్టీ స్థానాలను గెలుచుకోవడం ద్వారా పోయిన ప్రతిష్టను నిలుపుకోవాలని ఆ పార్టీ చేస్తున్న ప్రయత్నాలకు మళ్ళీ కాళేశ్వరం అడ్డుపడుతోంది. రాష్ట్రంలోని అధికార కాంగ్రెస్‌ దాన్ని నిజంగానే బూతద్దంలో చూపే ప్రయత్నం చేస్తున్నది. ఒక్క కాళేశ్వరంలోని మేడిగడ్డనే కాకుండా ఇతర ప్రాజెక్టుల నాణ్యతలను కూడా ఎత్తిచూపడం ద్వారా ప్రజాక్షేత్రంలో బిఆర్‌ఎస్‌ను దోషిగా నిలబెట్టే విషయంలో ఏ ఒక్క అవకాశాన్ని కూడా వొదులుకునేట్లులేదు.

ప్రపంచంలోనే అద్భుతం అన్న ఈ ప్రాజెక్టులు అవినీతిలో కూడా అద్భుతమన్న విషయాన్ని దేశప్రజలందరికీ తెలిపే ప్రయత్నం చేసే ప్రయత్నంలో ఉంది కాంగ్రెస్‌ సర్కార్‌. అందులో భాగంగా ఈ నెల13న కుంగిపోయిన మేడిగడ్డ బ్యారేజీని ప్రత్యక్షంగా పర్యవేక్షించే క్రమంలో విపక్షాలన్నిటినీ ఆహ్వానించడం ద్వారా రాజకీయ చతురతను చాటుకుంది. ఇది ఒక విధంగా బిఆర్‌ఎస్‌కు పెద్ద దెబ్బే. రానున్న లోకసభ ఎన్నికల్లో ప్రజలముందుకు వెళ్ళేందుకు ఇప్పుడు బిఆర్‌ఎస్‌కు ఈ ఆరోపణలను ఎదుర్కోవడంకన్నా మరే పెద్ద ఎజండాలేదు. దాంతో కాంగ్రెస్‌ ఆరోపణలను తిప్పి కొట్టడమే లక్ష్యంగా కార్యాచరణను సిద్ధం  చేసుకుంటున్నది. ఎక్కడ పోయిందో అక్కడే వెతుక్కోవాలన్నట్లు తమను ఇరుకున పెట్టేందుకు కారణమైన మేడిగడ్డనుండే కాంగ్రెస్‌పై ఎదురుదాడికి సిద్ధమైంది. అందులో భాగంగా మే ఒకటిన తన ఎమ్మెల్యేలు,ఎమ్మెల్సీలు,  ఎంపీలందరితో మేడిగడ్డ సందర్శనా కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. కాంగ్రెస్‌ ఆరోపిస్తున్నట్లు బాగుచేయరానంతంగా బ్యారేజీ కుంగిపోలేదని, సమర్దులైన ఇంజనీర్ల సహకారంతో త్వరలోనే దాన్ని మరమ్మతు చేయవొచ్చంటూ ప్రకటించింది.

కాంగ్రెస్‌ బ్యారేజీకి సంబంధించిన  ఏడు పిల్లర్లు కుంగాయనటం సరికాదని, మూడు మాత్రమే దెబ్బతిన్నాయని పర్యటనకు నాయకత్వం వహించిన కెటిఆర్‌ పేర్కొన్నారు. కాంగ్రెస్‌ చిన్న సమస్యను పెద్దదిగాచేసి చూపిస్తున్నదంటున్న  కెసిఆర్‌ ఈ విషయాన్ని రాజకీయ ప్రయోజనాలకు వాడుకోవాలని చూస్తున్నారేగాని, ఆలస్యం చేస్తే ప్రజల ప్రయోజనాలు దెబ్బతింటాయన్న ఆలోచన చేయకపోవడంపైన విచారం వ్యక్తంచేశారు. ఆలస్యంచేస్తే వర్షాకాలంలో వొచ్చే వరదలకు ప్రాజెక్టే కొట్టుకుపోయే ప్రమాదముందంటారాయన. కాంగ్రెస్‌ కూడా దానికోసమే జాప్యం చేస్తున్నట్లు కనిపిస్తున్నదంటూ ఆయన తీవ్రమైన ఆరోపణకూడా చేశారు. కాళేశ్వరం అంటే మేడిగడ్డ ఒకటేకాదు. ఈ ప్రాజెక్టుకింద అనేక బ్యారేజీలున్నాయి. అన్ని బ్యారేజీలను సందర్శించి, వాటి నిర్మాణంవల్ల ఏ  ప్రాంతానికి, ఎన్ని వేల ఎకరాలకు సాగునీరు లభిస్తున్నది, తాగునీటి లభ్యత తదితర విషయాలన్నిటినీ ప్రాజెక్టుల వద్దే పవర్‌పాయింట్‌ ప్రజంటేషన్‌ చేయడంద్వారా కాంగ్రెస్‌ ఆరోపణలపై ఎదురుదాడికి బిఆర్‌ఎస్‌ సిద్ధమైంది. అంతేగాక గత కాంగ్రెస్‌ ప్రభుత్వ కాలంలో తెలంగాణ ప్రాంతానికి జరిగిన అన్యాయాన్ని, జరిగిన నష్టాన్ని, ఆ కాలంలో వారు నిర్మించిన ప్రాజెక్టులు ఎంతకాలానికి ఎన్ని ఎకరాలకు నీరందించింది, ఏఏ ప్రాజెక్టులను  మేడిగడ్డలా మరమ్మతుచేయాల్సి వొచ్చిందన్న విషయాలను ప్రజలముందు పెట్టే ప్రయత్నం చేస్తోంది. మొత్తానికి వొచ్చే పార్లమెంటు ఎన్నికల్లో నీటి ప్రాజెక్టులే అన్ని పార్టీలకు ప్రధాన ఎజండాగా మారనున్నాయన్నది దీనివల్ల స్పష్టమవుతున్నది.
మండువ రవీందర్‌రావు,
సీనియర్‌ జర్నలిస్ట్‌

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page