ఐచ్చిక సెలవు రద్దుతో గందరగోళం

  • హజరు కావడానికి బయలుదేరి టీచర్‌ ‌దుర్మరణం…భర్తకు తీవ్రగాయాలు
  • నిద్రమత్తు వీడని విద్యాశాఖ ఉన్నతాధికారులు
  • ఆకస్మిక నిర్ణయాలతో అయోమయం….ఉదయం 8 తర్వాతే సెలవులపై ప్రకటన
  • అయోమయంలో ఉపాధ్యాయులు, విద్యార్థులు

వరంగల్‌, ‌ప్రజాతంత్ర, సెప్టెంబర్‌ 6 : ‌రాష్ట్ర ప్రభుత్వం ఆకస్మికంగా ఐచ్చిక సెలవు రద్దు చేసిన ఫలితంగా ఓ ప్రభుత్వ ఉపాధ్యాయురాలు దుర్మరణం పాలుకాగా…మరో ఉపాధ్యాయుడు తీవ్ర గాయాలతో చావుబతుకుల్లో కొట్టుమిట్టాడుతున్నాడు. ప్రభుత్వ ఉన్నతాధికారులు ఆకస్మికంగా తీసుకుంటున్న నిర్ణయాలు ప్రభుత్వ కార్యాలయాలు, పాఠశాలలు, కళాశాలలకు చేరడం లేదు. ఫలితంగా రాష్ట్రంలో సెలవుల ప్రకటనపై తీవ్ర అయోమయం నెలకొంది. దీనికి సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. ప్రభుత్వం ప్రకటించిన 2023 సెలవుల క్యాలెండర్‌ ‌ప్రకారం బుధవారం 6వ తేదీ ఐచ్చిక సెలవు ఉంది. దీని ప్రకారం రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ పాఠశాలలతో పాటు వివిధ కార్యాలయాలు ఐచ్చిక సెలవును తీసుకున్నాయి. విద్యార్థులు కూడా సమాచారాన్ని మంగళవారమే తెలియజేశారు. బుధవారం రాష్ట్ర వ్యాప్తంగా పాఠశాలలలోని ఉపాధ్యాయులందరూ ఐచ్చిక సెలవు తీసుకున్నారు.

బుధవారం ఉదయం విద్యార్థులు, ఉపాధ్యాయులు ఎవరి పనుల్లో వారు ఉన్నారు. అయితే ఉదయం 8 గంటల ప్రాంతంలో ఆకస్మికంగా విద్యాశాఖ అధికారుల నుంచి ఉపాధ్యాయుల మొబైల్‌ ‌వాట్సప్‌లకు ఐచ్చిక సెలవు రద్దు చేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని సమాచారం అందించారు. ఈ సమాచారం అందుకున్న ఉపాధ్యాయులు తీవ్ర అయోమయానికి గురయ్యారు. ఉదయం 9.30 గంటలకు పాఠశాలలు ప్రారంభం కానుండగా సెలవు రద్దు చేస్తూ 8 గంటలకే సమాచారం ఇస్తే ఎలా వెళ్లాలని ఉపాధ్యాయులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు. అయినప్పటికీ ఉన్నతాధికారుల ఆదేశాలను అమలు చేయాలనే ఉద్దేశ్యంతో రాష్ట్ర వ్యాప్తంగా ఉపాధ్యాయులు పాఠశాలలకు హడావిడిగా బయలుదేరి వెళ్లారు. అయితే ఈ క్రమంలో సూర్యాపేట జిల్లా పెన్‌పహాడ్‌ ‌మండలం సింగిరెడ్డిపాలెం ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు జె.కవిత, ఉపాధ్యాయుడైన తన భర్తతో కలిసి హడావిడిగా పాఠశాలకు తన ఇంటి నుండి బయలుదేరింది. ఈ క్రమంలో ఇంటి నుండి పాఠశాలకు వెళ్లే రోడ్డు మార్గంలో కవిత దంపతులు రోడ్డు ప్రమాదానికి గురయ్యారు. ఈ ప్రమాదంలో కవిత అక్కడికక్కడే మృతి చెందగా ఆమె భర్త లింగయ్య తీవ్రంగా గాయపడి సూర్యాపేట ప్రభుత్వ హాస్పిటల్‌లో ప్రాణాలతో కొట్టుమిట్టాడుతున్నారు.

నిద్రమత్తు వీడని ఉన్నతాధికారులు
విద్యాశాఖ ఉన్నతాధికారులపై ఎవరెన్ని ఆక్షింతలు వేసినప్పటికీ ఉదయం నిద్రమత్తు వీడడం లేదు. సెలవులపై ఒకటి రెండ్రోజులు ముందు తీసుకోవాల్సిన నిర్ణయాలను ఆలస్యంగా తీసుకుంటున్నారు. గత  జులైలో భారీ వర్షాల కారణంగా ఉపాధ్యాయులు, విద్యార్థులు ఇబ్బందులు పడుతూ పాఠశాలలకు వెళ్లిన తర్వాత ఉదయం 8గంటల ప్రాంతంలో సెలవు ప్రకటిస్తూ నిర్ణయం తీసుకున్నారు. దీనిపై తీవ్ర విమర్శలను విద్యాశాఖ మంత్రితో పాటు ఉన్నతాధికారులు ఎదుర్కుంటున్నారు. రెండు రోజుల క్రితం హైదరాబాద్‌ ‌జంట నగరాల్లో కూడా భారీ వర్షాల కారణంగా సెలవులను ఉదయం 8 తర్వాతే ప్రకటించారు. అయితే ఆలస్యంగా అనాలోచితంగా నిర్ణయాలు తీసుకొని సెలవులపై నిర్ణయాలు తీసుకోవడం వల్ల ఉపాధ్యాయులు, విద్యార్థులు, తల్లిదండ్రులు తీవ్ర గందరగోళానికి గురైతున్నారు. బుధవారం నాడు ఆలస్యంగానైనా రాష్ట్ర వ్యాప్తంగా ఉపాధ్యాయులు తమ విధులకు హాజరయ్యారు. అయితే విద్యార్థులకు సరైన సమాచారం సకాలంలో అందకపోవడంతో హాజరు శాతం తక్కువగా ఉంది.

ఉపాధ్యాయుల ఆగ్రహం
ప్రభుత్వ ఆకస్మిక నిర్ణయాల వల్ల సూర్యాపేట జిల్లాలో ఒక ఉపాధ్యాయురాలు దుర్మరణం పాలై మరొకరు తీవ్రంగా గాయపడ్డారని ఉపాధ్యాయులు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సంఘటనకు ప్రభుత్వమే పూర్తి బాధ్యత వహించాలని ఉపాధ్యాయ సంఘాల నేతలు డిమాండ్‌ ‌చేస్తున్నారు. విద్యాశాఖ ఉన్నతాధికారులు సెలవులపై ఆకస్మికంగా నిర్ణయాలు తీసుకుని ఉపాధ్యాయులను, విద్యార్థులను, తల్లిదండ్రులను అనేక ఇబ్బందులు పెడుతున్నారని వాపోయారు. ఇప్పటికైనా సెలవులపై ఒకరోజు ముందుగానే స్పష్టమైన సమాచారం అందించాలని ఉపాధ్యాయులు కోరుతున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page