ఆమనగల్లు, ప్రజాతంత్ర సెప్టెంబర్ 12 : కల్వకుర్తి నియోజకవర్గ అభివృద్ధికి తన శక్తి మేర కృషి చేస్తానని ఎమ్మెల్యే జైపాల్ యాదవ్ అన్నారు. ఆమనగల్లు పట్టణంలోని రైతు వేదికలో మండలం, మున్సిపాలిటీలకు చెందిన 29 మంది లబ్ధిదారులకు కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులను ఎమ్మెల్యే అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి అన్ని వర్గాల సంక్షేమమే ధ్యేయంగా అనేక అభివృద్ధి సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టి ముందుకు సాగుతున్నారని అన్నారు. ఆమనగల్లు అభివృద్ధికి కృషి చేస్తానని ఆయన అన్నారు. ఆమనగల్లులో ప్రభుత్వ డిగ్రీ కాలేజ్, ఇంటిగ్రేట్ మార్కెట్ భవన నిర్మాణం, జూనియర్ కళాశాల భవన నిర్మాణం, గ్రంథాలయ భవన నిర్మాణం పనులు వేగవంతంగా పూర్తి చేయడం జరుగుతుందన్నారు. అదేవిధంగా ప్రభుత్వ ఆసుపత్రిని రూ.17, 50 కోట్లతో నూతన భవనాన్ని అన్ని హంగులతో నిర్మించేందుకు కృషి చేయడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో ఆమనగల్ మార్కెట్ కమిటీ చైర్మన్ నాలాపురం శ్రీనివాస్ రెడ్డి, వైస్ ఎంపీపీ అనంత్ రెడ్డి, రైతు సమన్వయ సమితి అధ్యక్షులు నిట్ట నారాయణ, కౌన్సిలర్లు కమటం రాధమ్మ వెంకటయ్య, సోనీ జయరాం, మార్కెట్ కమిటీ డైరెక్టర్ రమేష్ నాయక్ తదితరులు పాల్గొన్నారు.