‌కాంగ్రెస్‌లో కదలిక

తెలంగాణ కాంగ్రెస్‌లో కదలిక మొదలైంది. ఇంతకాలంగా ఎవరికి వారుగాఉన్న నేతలంతా ఇప్పుడిప్పుడే సంఘటితంగా పార్టీ కార్యక్రమాల్లో పాల్గొనేందుకు ఉత్సాహం చూపిస్తున్నారు. నిన్నటివరకు ఒకరిపై ఒ••రు బహిరంగంగా చేసుకున్న ఆరోపణలకు ఒక విధంగా ఫుల్‌ ‌స్టాప్‌ ‌పడినట్లేననుకుంటున్నారు. ఈ పరిణామానికి సూత్ర ధారి ఆ పార్టీ నాయకుడు రాహుల్‌ ‌గాంధీయేనని చెప్పక తప్పదు. ముఖ్యంగా పార్టీ రాష్ట్ర అధ్యక్షపదవిని రేవంత్‌రెడ్డికి అప్పగించినప్పటినుండి ఈ విభేదాలు మరింత పెరిగాయి. ఇటీవల కాలంలో రేవంత్‌రెడ్డిపై కినుక వహించిన సీనియర్లు రహస్య సమావేశాలు నిర్వహించడంతో పార్టీవర్గాల్లో ఆయోమయం చోటుచేసుకుంది. జగ్గారెడ్డి, కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి, వి. హనుమంతరావు లాంటివారు సమావేశమవడం ఎటుదారి తీస్తుందోనని కార్యకర్తలు, అభిమానులు ఆందోళన చెందారు. జగ్గారెడ్డి అయితే మీడియా సమావేశాలు ఏర్పాటు చేసి రేవంత్‌పై విరుచుకుపడటం, నేరుగా అధిష్టానంతోనే తేల్చుకుంటానంటూ చేసిన హడావిడితో ఆయన పార్టీ వీడేందుకు సిద్దమవుతున్నట్లుగా ప్రచారం జరిగింది. ఏమైతేనేమి ఈ పంచాయితీ చివరకు రాహుల్‌ ‌దృష్టికి వెళ్ళటం, ఆయన సామరస్య పరిష్కారం చేయడంతో నిన్నటివరకు ఉన్న వేడి చల్లారినట్లు అయింది. ఒకటికి రెండు సార్లు తెలంగాణ నేతలతో రాహుల్‌ ‌సమావేశమవ డంతో తీవ్ర అసంతృప్తితో రగిలిపోతున్న జగ్గారెడ్డి లాంటి నేతలు తమ స్వరాన్ని ఇప్పుడు తగ్గించారు.

తెలంగాణ నేతలు కలిసిన సందర్భంగా కాంగ్రెస్‌ ‌పార్టీ ఎలాంటి గడ్డు పరిస్థితిని ఎదురుకుంటున్నది రాహుల్‌ ‌వారి దృష్టికి తీసుకువొచ్చినట్ల్లు తెలుస్తున్నది. అలాంటి పరిస్థితిలో పార్టీ నాయకులు పరస్పరం విమర్శించుకోవడం ద్వారా పార్టీ పరిస్థితి మరింత అధ్వాన్న స్థితికి దిగజారుతుందంటూ రాహుల్‌ ‌చేసిన హితబోధ బాగానే పనిచేసినట్లు కనిపిస్తున్నది. మరో పక్కన దేశ పరిస్థితి కూడా ఏమంత బాగాలేదు. దేశం క్లిష్టపరిస్థితిని ఎదుర్కుంటున్నది. విద్వేషాలు కొనసాగుతున్నాయి. ఇలాంటి పరిస్థితిలో జాతిని ఒక తాటిపైన నడిపించాల్సిన అవసరం ఎంత్తైనా ఉంది. క్రిందిస్థాయి నుంచి పార్టీ పటిష్టంగా ఉంటేనే దేనినైనా ఎదుర్కోవడం సాధ్యపడుతుందంటూ ఆయన వెలిబుచ్చిన ఆవేదన పార్టీలోని ఘర్షణ వాతావరణానికి ఫుల్‌ ‌స్టాప్‌ ‌పడ్డట్లు అయింది. ఇదే క్రమంలో పార్టీ శ్రేణుల్లో నూతనోత్సాహాన్ని కలిగించేందుకు రాష్ట్రంలో పర్యటించాల్సిందిగా రాష్ట్ర నాయకత్వం కోరిన మేరకు రాహుల్‌ అం‌గీకరించారు. తెలంగాణలో రెండు రోజుల రాహుల్‌ ‌పర్యటనను అత్యంత ఘనంగా నిర్వహించేందుకు రాష్ట్ర కాంగ్రెస్‌ ‌భారీ ఏర్పాట్లు చేస్తోంది. ఆయన పర్యటనకు మే ఆరు, ఏడు తేదీ)ను ఖరారు చేసినట్లు ఆ పార్టీ అధికార వర్గాల ద్వారా తెలుస్తున్నది. మే ఆరవ తేదీన దిల్లీ నుండి నేరుగా హైదరాబాద్‌ ‌చేరుకుని, అక్కడినుండి వరంగల్‌ ఆర్టస్ అం‌డ్‌ ‌సైన్స్ ‌కళాశాల మైదానంలో నిర్వహించే పార్టీ బహిరంగ సభలో పాల్గొని ప్రసంగిస్తాడని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. మే ఏడవ తేదీన హైదరాబాద్‌లోని బోయినపల్లిలో జరిగే సభలో పాల్గొంటారని ఈ సందర్బంగా అమర వీరుల కుటుంబ సభ్యులతో, నిరుద్యోగం కారణంగా ఆత్మహత్య చేసుకున్న యువకుల కుటుంబాలతో, రైతు కుటుంబాలతో సమావేశం కానున్నట్లు ఆ వర్గాల ద్వారా తెలుస్తున్నది.

రానున్న శాసనసభ ఎన్నికలను దృష్టిలో పెట్టుకునే రాహుల్‌ ఈ ‌పర్యటన చేస్తున్నట్లుగా భావిస్తున్నారు. గత ఎన్నికల్లో ఘోర పరాజయాన్ని మూటకట్టుకున్న కాంగ్రెస్‌ ఇప్పటికీ కోలుకోలేక పోతున్నది. అధిష్టానం ఊహించినట్లు రేవంత్‌రెడ్డికి పార్టీ పగ్గాలు అప్పగించిన తర్వాత తెలంగాణలో ఇంకా కాంగ్రెస్‌ ఉనికి ఉందనిపిస్తున్నప్పటికీ బిజెపి అంత దూకుడుగా కాంగ్రెస్‌ ‌వ్యవహరించలేకపోతున్నది. పార్టీ పరంగా రూపొందించిన కార్యక్రమాల్లో పార్టీ నేతలంతా సమిష్టిగా పాల్గొనకపోవడం అందుకు ప్రధాన కారణం. ఇటీవల వివాదంగా మారిన వరి విషయంలో మాత్రం పార్టీ శ్రేణులు కదలిరావడం ఒక విధంగా శుభ పరిణామం. దానికి తగినట్లుగా ఇప్పుడు రాహుల్‌ ‌గాంధి పర్యటనకోసం ముమ్మర ఏర్పాట్లు చేసే విషయంలో సీనియర్‌ ‌నాయకులంతా ముందుకు రావడంతో పార్టీకి నూతన జవసత్వాలు అమరుతాయను కుంటున్నారు. ఇప్పటికే బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ ‌ప్రజా సంగ్రామ పాదయాత్రను చేపట్టారు. టిఆర్‌ఎస్‌ను గద్దె దించడమే ధ్యేయంగా ఆయన సుడిగాలిలా ఈ పర్యటన ప్రారంభించారు. ఈ సందర్భంగా ప్రభుత్వ వైఫల్యాలను ప్రజాక్షేత్రంలో నిలదీస్తూ , ప్రజల ఇబ్బందులను తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు. అలాగే ప్రభుత్వంపై, టిఆర్‌ఎస్‌ ‌పార్టీపై అలక వహించిన రాజకీయ నేతలను, ఇతర పార్టీల్లో అసంతృప్తి నేతలను తమ వైపు తిప్పుకునే కార్యక్రమాన్నికూడా ఈ సందర్బంగా కొనసాగిస్తున్నారు. కాగా, వరి కొనుగోళ్ళు తదితర అంశాలను తీసుకుని కాంగ్రెస్‌కూడా ప్రజల పక్షాన పోరాటాలు చేస్తు, ప్రజా మద్దతును కూడగట్టుకునే ప్రయత్నాలు చేస్తుండడంతో కాంగ్రెస్‌ ‌శ్రేణుల్లో కూడా కదలిక ప్రారంభమైనట్లు కనిపిస్తున్నది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page