ఎల్బీనగర్, ప్రజాతంత్ర, నవంబర్ 09 : ఎల్బీనగర్ నియోజకవర్గంలో ప్రజలు పెద్ద ఎత్తున కాంగ్రెస్ పార్టీకి మద్దతు తెలుపుతున్నారన్నారని, తనను గెలిపిస్తే ఎల్బీనగర్ నియోజకవర్గాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తానని, ప్రజా సంక్షేమం కోసం ఎల్లవేళలా తోడుంటానని ఎల్బీనగర్ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థిగా మధు యాష్కీ గౌడ్ హామీ ఇచ్చారు. గురువారం ఎల్బీనగర్ నియోజకవర్గం నుండి కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థిగా మధు యాష్కీ గౌడ్ నామినేషన్ దాఖలు చేశారు. హయత్ నగర్ లో కాంగ్రెస్ ఎమ్మెల్యే అభ్యర్థి మధుయాష్కీ గౌడ్ తల్లి సులోచన ఆశీస్సులు తీసుకొని, కొత్తపేట్ లోని ప్రసన్న మహంకాళి దేవాలయంలో ప్రత్యేక పూజలు చేసారు. అనంతరం హయత్ నగర్ నుండి వేల సంఖ్యలో బైక్లు, కార్లతో స్వచ్ఛందంగా ర్యాలీ బయలుదేరి తన నామినేషన్ పత్రాలను ఆర్వో కార్యాలయంలో ఎన్నికల రిటర్నింగ్ అధికారికి సమర్పించారు. ఎల్బీనగర్ అంతా తిరంగమయంతో, ప్రత్యర్థి పార్టీల నేతలు అయోమయం పడేలా, జై కాంగ్రెస్ జై మధు యాష్కీ అనే నినాదాలతో ఎల్బీనగర్ హోరెతింది. కదా అనంతరం మధు యాష్కి మాట్లాడుతూ యుద్ధం మొదలైంది, కార్యకర్తలు సిద్ధంగా ఉండాలని పిలుపునిచ్చారు. ప్రజల గుండె నిండా మూడు రంగుల జెండా ఉందని కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన 6 గ్యారెంటీ పథకాలతో బడుగు బలహీన వర్గాల అందరికీ కాంగ్రెసే అండగా ఉంటుందన్నారు. ఎదిరించే వాడు వచ్చాడు బెదిరించే వాళ్ళ ఆటలు ఇక సాగవన్నారు. నియోజకవర్గాన్ని ఆదర్శ నియోజకవర్గంగా తీర్చిదిద్దడమే నా లక్ష్యమని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎల్బీనగర్ ఇంచార్జ్ జక్కిడి ప్రభాకర్ రెడ్డి, మాజీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ వజీర్ ప్రకాష్ గౌడ్, తీన్మార్ మల్లన్న, న్యాయవాది చలకాని వెంకట్ యాదవ్, కాంగ్రెస్ ముఖ్య నాయకులు, మహిళా కార్యకర్తలు పాల్గొన్నారు.