కాళోజీలా ప్రశ్నించే మనుషులు కావాలి
: సీనియర్ సంపాదకుడు డాక్టర్ కె.రామచంద్ర మూర్తి
కాళోజీ జంక్షన్ (హన్మకొండ) ప్రజాతంత్ర, నవంబరు 13 : తెలంగాణ సమాజంలో సామాన్యుల ప్రజాస్వామ్య హక్కుల కోసం ప్రశ్నించడానికి కాళోజీ నారాయణరావు లాంటి నిజాయితీ, ముక్కు సూటితనం కలిగిన కవులు, రచయితల అవసరం ఎంతో ఉందని సీనియర్ సంపాదకుడు డాక్టర్ కొండుభట్లు రామచంద్ర మూర్తి అన్నారు. ఆదివారం మధ్యాహ్నం హన్మకొండ లోని వాగ్దేవి కళాశాలలో కాళోజీ ఫౌండేషన్ ఆధ్వర్యంలో కాళోజీ సోదరుల స్మారక పురస్కారాల ప్రధాన ఉత్సవం కవులు, రచయితల మధ్య కన్నులపండువగా సాగింది. అంతకు ముందు నక్కలగుట్ట కాళోజీ జంక్షన్ వద్ద కాళోజీ విగ్రహానికి పూలమాలలు వేసి కవులు, రచయితలు ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా జరిగిన అవార్డుల ప్రదానోత్సవసభకు నాగిళ్ల రామశాస్త్రి అధ్యక్షత వహించగా ఎడిటర్ డాక్టర్ కె.రామచంద్ర మూర్తికి కాళోజీ నారాయణరావు స్మారక అవార్డు, ప్రముఖ ఉర్దూ కవి ఖుత్బ్ సర్ షార్ కు కాళోజీ రామేశ్వర్ రావు స్మారక అవార్డు బహుకరించి ఘనంగా శాలువా, జ్ఞాపికలతో సన్మానం చేశారు. ఈ సందర్భంగా రామచంద్ర మూర్తి మాట్లాడుతూ కాళోజీ నారాయణరావు లేనిలోటు స్పష్టంగా కనిపిస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు. రచయితలు,కవులు సమాజాన్ని విభిన్నమైన కోణాల్లో అవగాహన చేసుకోవాలని కోరారు. సామాజిక, రాజకీయ సమస్యలను పరిష్కరించడానికి తమ వంతుగా కృషి చేయాలని కోరారు. ప్రజాస్వామ్య హక్కుల కోసం కృషి చేసే మేధావుల పట్ల పాలకులు అనుసరిస్తున్న విధానాలను ప్రజలు గమనిస్తున్నారని చెప్పారు. సీనియర్ నవల రచయిత అంపశయ్య నవీన్ మాట్లాడుతూ కాళోజీ సాహిత్యంలో అట్టడుగు వర్గాల ఆక్రందన, ఆవేదనలు నిండి ఉంటాయని చెప్పారు. తెలంగాణ రచయితల సంఘం జిల్లా అధ్యక్షుడు పొట్లపల్లి శ్రీనివాసరావు మాట్లాడుతూ కాళోజీ నారాయణరావు పురస్కారం డాక్టర్ రామచంద్ర మూర్తికి ఇవ్వడం హర్షనీయమని పేర్కొన్నారు. కాళోజీ నారాయణరావు నుండి కేవలం సాహిత్య విషయాలే కాకుండా జీవన విలువలు కూడా నేర్చుకోవాల్సి ఉంటుందని చెప్పారు.
డాక్టర్ ఖుత్బ్ సర్ షార్ మాట్లాడుతూ తనకు ఉపన్యాసాల కంటే అనువాదం, సృజనాత్మక విషయాలే సులువగా చేయగలనని చెప్పారు. రామేశ్వర రావు స్మారక పురస్కారాన్ని అందుకోవడం చాలా ఆనందంగా ఉందన్నారు. సాహిత్య సృజనలో ప్రతిభావంతులైన కవులు, రచయితలను కాళోజీ ఫౌండేషన్ చేస్తున్న నిర్విరామమైన కృషిని అభినందించారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ ఎలనాగ, విఆర్ విద్యార్థి, డాక్టర్ అమ్మంగి వేణుగోపాల్, పందిళ్ల అశోక్ కుమార్, డా.ఆగపాటి రాజ్ కుమార్ , రాజ్ కుమార్, పి.చందు, నల్లెళ్ల రాజయ్య, సాగంటి మంజుల, సిరాజుద్దీన్, ఏరుకొండ నర్సింహులు తదితరులు పాల్గొన్నారు.
రైటప్: డాక్టర్ కె.రామచంద్ర మూర్తిని సన్మానిస్తున్న దృశ్యం