కుట్ర కేసులు

“1986లో ప్రారంభమైన ఈ కేసులో ఆ ఇద్దరి మీద 18 సంత్సరాల తర్వాత 2003 సెప్టెంబర్‌ 29న తీర్పు వెలువడింది . ము­ప్పై మంది మీద పెట్టిన ఈ కేసులో 11 మందిని ప్రభుత్వం బూటకపు ఎన్‌కౌంటర్లలో చంపి వేసింది. పదకొండు మంది మీద కేసును ఉపసంహరించుకుంది. చార్జిషీట్‌లో 253 మంది సాక్షుల పేర్లు ఉన్నప్పటికీ కేవలం 13 మంది సాక్షులను విచారించారు. చార్జిషీట్‌లో 300 ఆధారాలు  దొరికాయని చెప్పినప్పటికీ ఒక్క ఆధారాన్ని  కూడా న్యాయస్థానం ముందు  ప్రదర్శించలేదు.”

ఇక సుప్రసిద్ధమైన సికింద్రాబాద్‌ కుట్ర కేసు ఉంది. క్రైం.నెం.10/75గా నమోదైన  ఈ కేసులో ప్రాథమిక సమాచార నివేదిక మే 1974లో దాఖలైంది. పార్వతీపురం కుట్ర కేసులో ఫిర్యాదీ, పరిశోధనాధికారి ఒకరే (వీరనారాయణరెడ్డి) ఉన్నట్టుగానే, ఈ కేసులో కూడా ఆల్ఫ్రెడ్‌ అనే పోలీసు అధికారి ఫిర్యాది గానూ, పరిశోధనాధికారిగానూ ఉన్నాడు. వేర్వేరు ప్రాంతాల్లో జరిగిన బహిరంగ సభలు, సమావేశాలు, వాటికి ముందు వెనుకలుగా జరిగిన నేరాలను కలిపి ఈ కుట్ర కేసు తయారు చేశారు. కొండపల్లి సీతారామయ్య, కె.జి. సత్యమూర్తి, ఇంగువ మల్లిఖార్జున శర్మ, బర్ల యాదగిరి రాజు, మందడి రవీంద్రరెడ్డి వంటి వారితో పాటు కె.వి. రమణారెడ్డి, త్రిపురనేని మధుసూదనరావు, చెరబండ రాజు, పి. వరవరరావు, ఎం.టి.ఖాన్‌, ఎం. రంగనాథం లను ఈ కేసులో మొదటిసారిగా విప్లవ రచయితలను  కూడా, విప్లవ కార్యకర్తలతో కలిపి నిందితులుగా చూపారు. ఆ కేసులో సెషన్స్‌ కోర్టు నిందితులందరినీ నిర్దోషులుగా విడిచిపెడుతూ 1989ఫిబ్రవరి 27న తీర్పు చెప్పింది. దానితోపాటు గానే విప్లవ కార్యకర్తలను, విప్లవ రచయితలను  కలిపి చిత్తూరు కుట్రకేసు నమోదు చేశారు. దానిలో కూడా నిందితులందరినీ న్యాయస్థానం నిర్దోషులుగా విడుదల చేసింది.

ఆ తర్వాత సికింద్రాబాద్‌ కుట్ర కేసు నాటి నుంచీ 1986 వరకూ జరిగిన నేరాలన్నిటినీ కలిపి రాంనగర్‌లో ఒక ఇంటిపై దాడి చేసి నల్లా ఆదిరెడ్డి తదితరులను అరెస్టు చేసి, ఆ ఇంట్లో దొరికాయని చెప్పబడుతున్న ఆయుధాలు, మందుగుండు సామాగ్రి, పేలుడు పదార్థాలు, విప్లవ సాహిత్యం పత్రాల ఆధారంగా అంతకు ముందు జరిగిన నేరాలన్నింటినీ కలిపి ఈ కుట్ర కేసు తయారు చేశారు. క్రైం.నెం.92/86 అనే ఈ కేసును హైదరాబాద్‌ సిటీ క్రైం స్టేషన్‌ పోలీసులు నమోదు చేశారు. కొండపల్లి సీతారామయ్య, కె.జి. సత్యమూర్తి,వ­క్కు సుబ్బారెడ్డి, నల్లా ఆదిరెడ్డి, పులి అంజయ్య, మల్లోజుల కోటేశ్వరరావు వంటి విప్లవ నాయకులతోపాటు వరవరరావు, ఎన్‌. సుధాకర్‌, గద్దర్‌, కె.వి. రమణారెడ్డి వంటి ప్రజాసంఘాల నాయకులను కూడా ఈ కేసులో నిందితులుగా మొదట ఎఫ్‌ఐఆర్‌లో చూపారు. ఆ తర్వాత 30 మంది మీద దాఖలైన ఛార్జిషీటులో విప్లవ నాయకులతోపాటు వరవరరావు, గద్దర్‌, సుధాకర్‌ల పేర్లు మాత్రమే చేర్చారు. ఆ తర్వాత కొందరు సరెండరైన నాయకుల మీద కేసు ఉపసంహరించుకున్నారు. సీతారామయ్య ఆరోగ్య పరిస్థితి వల్ల ఆయన మీద కూడా కేసు ఉపసంహరించుకున్నారు. చివరికి, విప్ల నాయకులలో కొందరు ఎన్‌కౌంటర్లలో చనిపోవడం, కొందరు అజ్ఞాతంలో ఉండడంవల్ల వరవరరావు, సుధాకర్‌ల మీద మాత్రం విచారణ జరిగి వారిద్దరినీ న్యాయస్థానం నిర్దోషులుగా విడిచిపెట్టింది.

1986లో ప్రారంభమైన ఈ కేసులో ఆ ఇద్దరి మీద 18 సంత్సరాల తర్వాత 2003 సెప్టెంబర్‌ 29న తీర్పు వెలువడింది . ము­ప్పై మంది మీద పెట్టిన ఈ కేసులో 11 మందిని ప్రభుత్వం బూటకపు ఎన్‌కౌంటర్లలో చంపి వేసింది. పదకొండు మంది మీద కేసును ఉపసంహరించుకుంది. చార్జిషీట్‌లో 253 మంది సాక్షుల పేర్లు ఉన్నప్పటికీ కేవలం 13 మంది సాక్షులను విచారించారు. చార్జిషీట్‌లో 300 ఆధారాలు  దొరికాయని చెప్పినప్పటికీ ఒక్క ఆధారాన్ని  కూడా న్యాయస్థానం ముందు  ప్రదర్శించలేదు.  .

ఇక నేను ప్రస్తుతం వివరిస్తున్న బెంగుళూరు కుట్ర కేసు మరింత విచిత్రమైనది. కర్ణాటకలోని శ్రావణ బెలగొళలో 1991లో కొందరు నక్సలైటు నాయకులు సమావేశమయ్యారనీ, దాని ఫలితంగా కొన్ని నేరాలు జరిగాయనీ ఆ కేసు చెబుతుంది. బెంగుళూరులో నక్సలైటు నాయకుడు పటేల్‌ సుధాకర్‌రెడ్డి అరెస్టు కావడంతో, ఆయన ఇంట్లో పెద్ద ఎత్తున ఆయు­ధాలు, మందుగుండు సామాగ్రి దొరకడంతో 1992 ఏప్రిల్‌ 6న ఈ కేసు ప్రారంభమైంది. బెంగుళూరు కుట్ర కేసులో ఒక విచిత్రం జరిగింది. ఇళ్ల మీద దాడులు, సోదాలు, అరెస్టులు, ఆయు­ధాల, మందుగుండు, విప్లవ సాహిత్యం స్వాధీనం మొ­దట బెంగుళూరులో ఏప్రిల్‌ 6న జరిగాయి . ఆ తర్వాత చిత్రదుర్గ, బళ్లారి, కోలార్‌, గోవాలలో జరిగాయి.­ గానీ ఈ పనులన్నీ చేసినవాళ్లు ఆంధ్రప్రదేశ్‌ పోలీసులు. వాళ్లకు బెంగుళూరులో కేసు నమోదు చేసే అధికారం లేదు. అది వాళ్ల అధికార పరిధిలోకి రాదు. అందుకని వాళ్లు తప్పుడు పద్ధతిలో హైదరాబాద్‌లో ఒక అరెస్టు చూపించి మొ­త్తం కేసును తమ పరిధిలోకి తీసుకోదలచుకున్నారు. ఇటువంటి అబద్ధాల మీద, తప్పుడు ఆరోపణల మీద కేసులు బనాయించడం పోలీసులకు బాగా అలవాటు.

అందువల్ల దాదాపు రెండు వారాల తర్వాత ఏప్రిల్‌ 20న సికింద్రాబాద్‌లోని జూబిలీ బస్‌స్టేషన్‌లో గొర్ల కుమారస్వామి అనే వ్యక్తిని అరెస్టు చేసినట్టు, ఆయన దగ్గర ఒక డబుల్‌ బారెల్‌ తుపాకి, 25 తూటాలు దొరికినట్టు ఒక కట్టు కథ అల్లారు. ఆ తర్వాత సమాచారం ప్రకారం ఇతర చోట్ల దాడులు జరిపినట్టు కథ అల్లి హైదరాబాద్‌ స్పెషల్‌ ఇంటిలిజెన్స్‌ బ్రాంచ్‌లోని ఇన్వెస్టిగేషన్‌ సెల్‌ పోలీసుస్టేషన్‌లో క్రైం.నెం.1/1992గా ఆ కేసు నమోదు చేశారు. ఏప్రిల్‌ 1992 నుంచి మార్చ్‌ 1993 మధ్య అరెస్టు చేసిన 24 మంది విప్లవ కార్యకర్తలను, సానుభూతిపరులను, చివరికి  ఆయుధ  వ్యాపారులను కలిపి ఈ కేసులో నిందితులుగా చూపారు. నేర స్వభావం గల కుట్ర (భారత శిక్షాస్మృతి సెక్షన్‌ 120 బి), ప్రభుత్వానికి వ్యతిరేకంగా యు­ద్ధం చేయడం (1an21), ఆ యుద్ధం కొరకు ఆయు­ధాలు సేకరించడం (122), ఆ యుద్ధం కొరకు రహస్యంగా ఉండడం (123) రాజద్రోహం (124ఎ), 1987 తీవ్రవాద కార్యకలాపాల (నిరోధక) చట్టం (టాడా)లోని సెక్షన్లు 3(1)(3), 4,5,6 ఆయుధాల చట్టంలోని సెక్షన్లు 25, 27 వంట నేరాలెన్నో మోపారు. ఇంటిలిజెన్స్‌ విభాగంలోని స్పెషల్‌ ఆపరేషన్‌ సెల్‌లో అదనపు సూపరింటెండెంట్‌గా పని చేస్తుండిన ఎం. వెంకటరెడ్డి నేతృత్వంలోని పరిశోధక విభాగం, ఆయనే సొంతంగా చేసిన ఫిర్యాదు మీద పరిశోధన జరిపి 1993 ఏప్రిల్‌ 19న 47 మంది నిందితుల మీద మొ­దటి చార్జిషీటు పెట్టింది. ఈ కేసులో టాడా నేరాలు కూడా ఉన్నాయి  గనుక, టాడా ప్రకారం ఒక ప్రత్యేక న్యాయస్థానం ఈ విచారణను చేపట్టింది.

-కె.జి. కన్నబిరాన్‌
ఆత్మకథాత్మక సామాజిక చిత్రం
అక్షరీకరణ :ఎన్ .వేణుగోపాల్

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page