కెసిఆర్‌ ‌దీక్ష చేస్తే రాష్ట్రం వొచ్చింది…

  • నేను దీక్షచేస్తే ఒక్క ఉద్యోగం పెరుగ లేదు
  • 9 రోజుల నిరాహార దీక్షను విరమించిన మోతీలాల్‌
  • ‌రాష్ట్రం ప్రభుత్వం స్పందించలేదని ఆగ్రహం

హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, జూలై 2 : నిరుద్యోగుల డిమాండ్ల కోసం గత తొమ్మిది రోజులుగా తాను దీక్ష చేస్తున్నానని, కేసీఆర్‌ 9 ‌రోజులు దీక్ష చేస్తే రాష్ట్రం వొచ్చింది కానీ.. తాను దీక్ష చేస్తే ఒక్క ఉద్యోగం కూడా పెరుగలేదని తెలంగాణ నిరుద్యోగ జేఏసీ చైర్మన్‌ ‌మోతీలాల్‌ ‌నాయక్‌ ఆవేదన వ్యక్తం చేశారు. ఇంత వరకు రాష్ట్ర ప్రభుత్వం స్పందించలేదని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. నిరుద్యోగుల సమస్యలు పరిష్కరించాలన్న డిమాండ్‌తో గత తొమ్మిదిరోజులుగా గాంధీ దవాఖానలో ఆమరణ నిరాహార దీక్ష చేస్తున్న మోతీలాల్‌ ‌నాయక్‌ ‌మంగళవారం తన దీక్షను విరమించారు. ఇన్ని రోజులు అన్నపానియాలు లేకుండా ఆమరణ దీక్ష చేశానని, తన ఆరోగ్యం సరిగ్గా లేదని, క్రియాటిన్‌ ‌లెవల్స్ ‌పెరిగి కిడ్నీ, లివర్లు పాడయ్యే పరిస్థితికి వొచ్చిందని అన్నారు.

తెలంగాణ వొచ్చిన తర్వాత నీళ్లు, కరెంటు వొచ్చినయని, 25 నుంచి 35 ఏండ్ల వయస్సు యువత ఉద్యోగాల కోసం కళ్లు కాయలు కాసేలా ఎదురుచూస్తున్నారని, కొత్త ప్రభుత్వం రాగానే తమ డిమాండ్లు పరిష్కరిస్తామని చెప్పారని, కానీ ఆ దిశగా అడుగులు మాత్రం పడలేదని అన్నారు. ఈ ప్రభుత్వానికి రాజకీయాలపై ఉన్న దృష్టి విద్యార్థులు, నిరుద్యోగులపై లేదని విమర్శించారు.

ఉస్మానియా యూనివర్సిటీలో దీక్ష చేస్తానంటే సర్కారు ఒప్పుకోలేదని, మనుషులు చచ్చిపోయినా పట్టించుకోకపోవడం ప్రజాపాలనా..అంటూ మోతీలాల్‌ ‌ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. తన ఫోన్‌ ‌లాక్కుని ఎవరితోనూ మాట్లాడనీయడం లేదని, డీఎస్సీ రద్దు చేసి..మెగా డీఎస్సీ నోటిఫికేషన్‌ ‌వేయాలని, రేపటి నుంచి తమ సత్తా ఏంటో చూపిస్తామని, 50 వేల ఉద్యోగాలు ఇచ్చే వరకు ఉద్యమాన్ని తీవ్రం చేస్తామని, ప్రభుత్వం జీవోలను విడుదల చేసే వరకు ఉద్యమిస్తామని చెప్పారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page