పటాన్ చెరు,ప్రజాతంత్ర, డిసెంబర్ 2: సంగారెడ్డి జిల్లాలోని ఐదు నియోజకవర్గాల అసెంబ్లీ స్థానాల ఓట్లు కౌంటింగ్ ను పటాన్ చెరు మండల పరిధిలోని రుద్రారం గీతం యూనివర్సిటీలో కౌంటింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. ఈ మేరకు ఆదివారం నిర్వహించే కౌంటింగ్ కోసం రుద్రారం గీతం యూనివర్సిటీలో ఏర్పాట్లు పూర్తి చేశారు. ఈ కార్యక్రమంలో కౌంటింగ్ ప్రక్రియ సాయంత్రం వరకు సాగే అవకాశం ఉన్నట్లు అధికారులు అంచన వేస్తున్నారు. ఓట్ల లెక్కింపు 14 టేబుల్ నుంచి 18కి పెంచగా 23 రౌండ్లలో లెక్కింపు కొనసాగనుంది. ప్రతి టేబుల్ కి వెబ్ క్యాస్టింగ్, సీసీ కెమెరాలు, సూక్ష్మ పరిశీలకులు ఆధ్వర్యంలో కౌంటింగ్ సాగనుంది. ఈ మేరకు పూర్తి బందోబస్తు ఏర్పాట్లు చేస్తున్నారు.
ప్రక్రియ ఇలా…
ఆదివారం ఉదయం 8 గంటలకు పోస్టల్ బ్యాలెట్ లెక్కింపు జరగనుంది. 9.30 ఫలితం వస్తుంది, తర్వాత ఈవీఎంలు బయటకు వచ్చి కౌంటింగ్ మొదలుకానుంది. ఈ క్రమంలో మొదట ఫలితం వచ్చేసరికి ఉదయం 10:30 వరకయ్యే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. పోలింగ్ ఏజెంట్లు గంట ముందే కేంద్రానికి చేరుకోవాలని సూచించారు. సెల్ ఫోన్లు, లేకుండా కౌంటింగ్ కేంద్రంలోకి హాజరు కావాలని అధికారులు స్పష్టం చేశారు. అల్పాహారం భోజనాలు అధికారులు ఏర్పాటు చేస్తున్నారు మంచినీటితో పాటు ఇతర మౌలిక సదుపాయాలు కల్పించారు ఎవరికి ఎటువంటి ఇబ్బంది లేకుండా చర్యలు తీసుకున్నట్లు అధికారులు తెలిపారు.