- ఆకాశాన్నంటుతున్న ధరలొకవైపు
- అదుపులేని నిరుద్యోగం ఇంకొకవైపు
- అవినీతి బంధుప్రీతి చీకటి బజారు
అలుముకున్న ఈ దేశం ఎటు దిగజారు… అని మహాకవి శ్రీశ్రీ గారు వెలుగు నీడలు అనే సినిమా కోసం రాసిన పాట ఆచంద్రార్కం సత్యమే. అప్పుడెప్పుడో ఆనాటి పరిస్థితులకు అనుగుణంగా రాసిన పాట నేటికీ సరిపోవడం బట్టి దేశ అభివృద్ధిని అంచనా వేయవచ్చు. ఏమేరకు పరిస్థితులు మారాయో , ఈ దేశం ఎంతగా అభివృద్ధి చెందిందో ప్రజలు ఎంతటి భోగభాగ్యాలను అనుభవి స్తూన్నారో అవగతం చేసుకోవచ్చు. దేశానికి స్వాతంత్రం అదే అధికార మార్పిడి జరిగి 75 సంవత్సరాలు పూర్తయ్యాయి అని అమృతోత్సవాల ఆరాటంలో సామాన్య ప్రజలు అదుపులేని ధరలతో నిత్యావసర సరుకులు కొనలేని పరిస్థితిలో అల్లాడుతుంటే, వంట చెరుకు కూడా దొరకని ఈ కాలంలో గ్యాస్ బండ సబ్సిడీని ఎత్తివేసి పలుమార్లు గ్యాస్ ధరలను అత్యధికంగా పెంచి వంట వండుకొనలేని దయనీయ పరిస్థితిలోలోకి పేదలను నెట్టివేయడం నేటి ప్రభుత్వాలు సాధించిన ప్రగతి. ప్రస్తుత ప్రధాని పరిపాలనతో దేశంసుసంపన్నమై అచ్చే దిన్ వచ్చినయి అని కేంద్ర పరిపాలకులు ప్రచారం చేస్తుంటే, బంగారు తెలంగాణలో బాధలు ఏమి లేవని, ప్రజలు ఏమన్నా బాధ పడుతున్నారు అంటే అది కేంద్ర పరిపాలకుల వల్లనే అని రాష్ట్ర పాలకులు బల్ల గుద్ది చెబుతున్నారు.
ఇరువురి మధ్యన ముఖ్యంగా మధ్యతరగతి ప్రజలు పేదలు నలిగిపోతున్నారు. ప్రజలు అధిక ధరలతో సతమతమౌతున్న సందర్భంలో ఆదు కోవాల్సిన తరుణంలో ఒకరిపై ఒకరు ఆరోపణలు ప్రత్యా రోపణలు చేసుకుంటూ ఇష్టానుసారం పదునైన భాషను ఉపయోగించి వ్యక్తిగతంగా దూషించడం అసలు సమస్యలను పక్కదారి పట్టించి కాలయాపన చేస్తూ, పేదలకు నడ్డి విరిగేలా, కార్పొరేట్లకు కొంగుబంగారంగా ప్రభుత్వ0 నిర్ణయాలు తీసుకుంటూ కార్పొరేట్ల సంపదను రెట్టింపు చేసేందుకు త్వరితగతిన చర్యలు చేపట్టి, వారిని ప్రపంచ కుబేరుల జాబితాల పతాక శీర్షికన నిలబెడుతుండ డాన్నిబట్టి పాలకులు ఎవరి ప్రయోజనాలు కోసం పని చేస్తున్నారో అర్థం చేసుకోవచ్చు. సబ్ కా సాథ్ సబ్ కా వికాస్ అంటూ అందమైన నినాదాలు పేదల కోసం, కార్పొరేట్ కాసాథ్ కార్పొరేట్ కా వికాస్ అంటూ ప్రభుత్వ విధానాలు కార్పొరేట్ల కోసం చేపడుతుండటం వల్ల దేశఅభివృద్ధి తిరోగమనంలో దూసుకపోతుంది. అందు వల్లనే సహజ వనరులకు నిలయమైన, వ్యవసాయరంగ ఉత్పత్తులతో కళకళలాడుతున్న వ్యవసాయం ప్రధానంగా దేశ ఆర్థిక వ్యవస్థకి వెన్నుముక లాగా ఉన్నను ప్రపంచ ఆహార సూచికలో 116 స్థానాన్ని ఆక్రమించడం, మనిషి జీవించడానికి పట్టెడన్నం కరువై ఆకలి కేకలతో విలవిలలాడుతున్న దయనీయమైన స్థితి ఏర్పడటం ఏఅభివృద్ధికి చిహ్నం?? దేశ జీడీపీ ప్రపంచంలోని అగ్ర దేశాల కన్నా మెరుగ్గా ఉందని, కొన్ని సంవత్సరాల తర్వాత ప్రపంచంలోనే గొప్పదైన ఆర్థిక వ్యవస్థ కలిగి ఉన్న దేశంగా మారుతుందనీ అరచేతిలో వైకుంఠం చూపుతూ ప్రజలను మభ్య పెడుతుండటం బాధాకరం..
అచ్చే దిన్ కాదు…. సచ్చే దిన్…..
దేశానికి మంచి రోజులు వస్తాయని, అవి మా వల్లనే సాధ్యమని మాయమాటలు చెప్పి అధికార పీఠాన్ని దక్కించుకున్న ప్రస్తుత పాలకులు రోజురోజుకు ధరలను పెంచుతూ ప్రజలకు సచ్చేదిన్ తీసుకు రావడం జరిగింది.2014సంవత్సరంలో మోడీ ప్రధాని కాకముందు 410 రూపాయలు ఉన్న గ్యాస్ సిలిండర్ ధర గత ఎనిమిది ఏళ్లలో పలుమార్లు పెంచడం వల్ల నేటికి అది1052 రూపాయలకు చేరుకున్నది. ఇళ్లలో వాడే 14.2 కిలోల గ్యాస్ బండ పై ఆరు వారాల్లోనే రెండుసార్లు ధరల మోత మోగించారు. మార్చి 22న 50 రూపాయలు, నిన్నగాక మొన్న ఈ నెల 7న మరో 50 రూపాయల వంతున పెంచడంతో పేదలు గ్యాస్ సిలిండర్ ధరను అందుకోలేనంత స్థాయికి పెరిగింది. యూపీఏ హయాంలో ఒక్కో సిలిండర్పై సబ్సిడీ 827రూపాయలు లభించడంతో అప్పుడు గ్యాస్ సిలిండర్ 410 రూపాయలకు వచ్చేది. ప్రస్తుతం గ్యాస్ సిలిండర్ ధరలు పెరగడం వల్ల పేద ప్రజల పై ప్రతియేటా ఐదు వేల రూపాయలకు పైగా అదనపు భారం పడనుంది. అసలే కరోనా సంక్షోభంతో ప్రజల ఆదాయాలు తీవ్రంగా పడిపోయి, ఆరోగ్యపరమైన ఖర్చులు పెరుగుదల ఒకవైపు, ఉద్యోగం ఉపాధి కోల్పోయి కొనుగోలు శక్తి లేక బ్రతుకు బండినీ లాగా లేని తరుణంలో ఉండగా ప్రజల సంక్షేమం దృష్ట్యా గ్యాస్ ధరలను తగ్గించాల్సిందే పోయి గత రెండు సంవత్సరాల నుండి సిలిండర్ ధరలను కేంద్ర ప్రభుత్వం పెంచుతూ వస్తుంది..
సబ్సిడీ ఎత్తివేత:
2014లో ఒక్కో గ్యాస్ సిలిండర్ పై 827 రూపాయల రాయితీ లభించేది. గత ప్రభుత్వ విధానాల కారణంగా లబ్ధిదారులకు అందాల్సిన రాయితీల లో అవినీతి అక్రమాలు జరుగుతున్నాయి అన్న కారణంగా పారదర్శకంగా ఉండేందుకు నగదు బదిలీ పథకాన్ని ప్రవేశపెట్టి నేరుగా లబ్ధిదారుల బ్యాంకు అకౌంట్ లోకి గ్యాస్ రాయితీని జమ చేస్తామని చెప్పి… క్రమక్రమంగా సబ్సిడీ ని తగ్గిస్తూ 2018 నవంబర్ లో అత్యధికంగా ఒక్కో గ్యాస్ సిలిండర్ పై 435 రూపాయల సబ్సిడీని వినియోగదారుల వ్యక్తిగత ఖాతాలో జమ చేయడం జరిగింది. ఇలా జూలై 2019 నాటికి గ్యాస్ సిలిండర్ పై రాయితీ 40 రూపాయలు మాత్రమే చెల్లిస్తుంది. ప్రస్తుతం సిలిండర్ ధర వెయ్యి రూపాయలు దాటి పోగా రాయితీ మాత్రం 40 రూపాయలకు తగ్గిపోవడం ఆశ్చర్యకరం. 2014- 15 లో వంట గ్యాస్ ధరల నిర్ణయాన్ని మార్కెట్ సెక్టార్ కు వదిలివేయడం జరిగింది. ఈ సందర్భంలో ఒక్కో సిలిండర్కు 563 రూపాయల రాయితీ ఇవ్వాలని నిర్ణయించింది. అందుకు విరుద్ధంగా 40 రూపాయలకు తగ్గించడం పేద ప్రజలను దగా చేయడమే.. 2019- 20 సంవత్సరం లో గ్యాస్ సబ్సిడీ కి 29 వేల 627 కోట్లు కేటాయించగా, 2022•23 లో కేవలం 5513 కోట్లు మాత్రమే కేటాయించి చేతులు దులుపుకుంది. అనగా కేవలం నాలుగు సంవత్సరాల లోనే 25 వేల కోట్ల భారాన్ని తగ్గించుకుంది. ఈ భారాన్ని సబ్సిడీ ఎత్తివేత ద్వారా పేద మధ్య తరగతి వర్గాల పై భారం మోపిన ప్రభుత్వం, తన సామాజిక బాధ్యత నుండి వైదొలిగి, మిగిలి0చు కున్న సంపదను కార్పొరేట్లకు తన అనుయాయులకు దారాదత్తం చేస్తుండడంతో కరోనా సంక్షోభ కాలంలో కూడా కార్పొరేట్ల సంపద అత్యధికంగా చెప్పలేనంత స్థాయిలో పెరిగిపోయింది….
ఉత్తది కానున్న ఉజ్వల పథకం:
రక్షితం సమర్థం, ఆరోగ్యం పర్యావరణం ఆర్థిక అభివృద్ధి, సాధికారిత వంటి ఐదు ప్రధాన సూత్రాలు కలిగిన ఉజ్వల పథకం 2016 మే 1న బలియా లో ప్రారంభించబడింది. ఈ పథకం ప్రారంభానికి ముందు కేవలం 55 శాతం ఇళ్లలో మాత్రమే వంట గ్యాస్ వాడేవారు. ప్రస్తుతం ఈ ఆరేళ్లలో లిక్విడ్ పెట్రోలియం గ్యాస్(ఎల్పిజ)99.6 శాతం ఇండ్లలోకి చేరింది. ప్రధానంగా 8 కోట్ల ఇళ్లకు ఈ పథకం కింద ఉచిత ఎల్పీజీ కనెక్షన్లు ఇవ్వడమే కారణం. ఈ ఎనిమిది కోట్ల లబ్ధిదారుల లో ఎస్సీ ఎస్టీ వర్గాల వారు 3995 కోట్లు ఉన్నారు. ఈ ఏడాది మరో కోటి మంది గ్యాస్ కనెక్షన్లు ఇవ్వనున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. కానీ సిలిండర్ ధరలు భారీగా పెరుగుతు0డటం వల్ల 2022 ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికంలో 3.2 కోట్ల మంది లబ్ధిదారులు గ్యాస్ను రీఫిల్ చేయించుకో లేదని ప్రభుత్వ లెక్కల ద్వారా తెలుస్తోంది. ధరల పెరుగుదలతో ఉజ్వల పథకం లబ్ధి దారులురీఫిల్ చేయించుకోలేని పరిస్థితులలో ఉండటం మూలంగా ఈ పథకం లక్ష్యం నీరు గారే ప్రమాదం ఉన్నది.
గతంలో ఎన్నడు లేని విధంగా కరోనా మహమ్మారి ప్రజలను ప్రపంచవ్యాప్తంగా గడగడలాడించింది. దేశవ్యాప్తంగా కరోనా కాటుకు 84 శాతం కుటుంబాల ఆదాయం గణనీయంగా తగ్గింది. 2020లో 4.6 కోట్ల మంది పేదరికంలోకి జారుకున్నారు అని ఐక్యరాజ్య సమితి అంచనావేసింది. కరోనా సంక్షోభ కాలంలో 28 శాతం మహిళలు ఉద్యోగాలు కోల్పోయారు. వారి ఆదాయం మూడింట రెండు వంతులు తగ్గిపోయింది. ఇలాంటి హృదయవిదారకమైన పరిస్థితులలో ప్రజల వెన్నంటి ఉండి వారి సహాయార్థం అధిక ధరలను అదుపు చేసి కారుచౌకగా నిత్యావసర సరుకులు గ్యాస్ పెట్రోల్ డీజిల్ వంటి వాటిని అందించి కాపాడాల్సింది పోయి, గత ప్రభుత్వాలు అందించిన రాయితీలను ఎత్తివేసి ప్రజలు మోయలేనంత అదనపు భారాన్ని నెత్తిన వేయడం తగదు. ఎల్పీజీ ధరలు ప్రతిసారీ ఎందుకు పెంచుతున్నారు అన్నదానికి స్పష్టమైన సమాధానం కేంద్రం వద్ద లేదు. అంతర్జాతీయంగా చమురు ధరలు పెరగడం వల్లే చమురు సంస్థలు ఎల్పీజీ ధరను పెంచుతున్నారన్న దానిలో వాస్త వం లేదు. 2014 21 మధ్యకాలంలో అంతర్జాతీ యంగా ఎల్పీజీ ధర 30 శాతం తక్కువగా, అదేకాలంలో రిటైల్ ఎల్పీజీ ధర 110 శాతం పెరిగింది. ప్రజల కొరకు ప్రజల చేత ఎన్నుకోబడిన ప్రజాస్వామిక పాలక ప్రభుత్వాలు ప్రజా ప్రయోజనాలను మరిచి, ప్రజాస్వామిక సూత్రాలను తుంగలో తొక్కి కార్పొరేట్లా బడా పారిశ్రామికవేత్తల అభివృద్ధి కోసం పాటు పడుతుండటం శోచనీయం … ఇప్పటికైనా పాలకులు ప్రజలను ఆదుకునే విధంగా జోక్యం చేసుకుని ధరల పెరుగుదలను అరికట్టి, గ్యాస్ సిలిండర్ ధరకు అనుగుణంగా సబ్సిడీని పెంచి మధ్యతరగతి ప్రజలకు ఊరట కలిగించేలా మరియు ఉజ్వల దీపం పథకం లబ్ధిదారులకు నామమాత్రపు ధర తో గ్యాస్ సిలిండర్లను అందించి ఆదుకోవాల్సిన తరుణం ఆసన్నమయింది.