ఆమనగల్లు, ప్రజాతంత్ర సెప్టెంబర్ 1 : తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 12,769 గ్రామపంచాయతీలు నూతన ఒరవడిని సృష్టిస్తున్నాయని సర్పంచుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు గూడూరు లక్ష్మీనరసింహారెడ్డి అన్నారు. దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా తెలంగాణ ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వంతో సమానంగా మ్యాచింగ్ గ్రాంట్ ఇస్తూ పంచాయతీలను అభివృద్ధి పథంలో ముందుకు తీసుకెళ్తుందని తెలిపారు. కడ్తాల్ గ్రామపంచాయతీ పరిధిలో ఇటీవల 10 లక్షల రూపాయలతో చేపట్టిన సిసి రోడ్డు పనులు పూర్తయ్యాయని అదే విధంగా పదో వార్డులో నిర్మాణం అవుతున్న సిసి రోడ్డు పనులను పరిశీలించారు. గ్రామపంచాయతీ పరిధిలో ప్రజల,స్థానిక శాసనసభ్యులు జైపాల్ యాదవ్ మరియు ప్రజాప్రతినిధుల తోడ్పాటుతో అభివృద్ధి పనులు శరవేగంగా జరుగుతున్నాయని, మిగిలి ఉన్న పనులను రాబోయే రోజులలో పూర్తి చేయనున్నట్లు తెలిపారు. గ్రామంలో అంతర్గత మురుగు కాలువ పనులు దాదాపుగా పూర్తయినట్లు తెలిపారు. తెలంగాణ రాష్ట్రంలో గ్రామాలలో జరుగుతున్న అభివృద్ధి పనులు దేశవ్యాప్తంగా ఏ రాష్ట్రాలలో జరగడంలేదని ఇతర రాష్ట్రాల చూపు తెలంగాణ వైపు మరలిందని సర్పంచ్ అన్నారు. పనుల పరిశీలనలో రెఖ్య తండా సర్పంచ్ హరిచంద్ నాయక్, స్థానిక నేతలు సూద యాదయ్య, వెంకటేష్, మల్లేష్ తదితరులు ఉన్నారు.