చర్చించుకుందాం…పరిష్కరించుకుందాం

  • విభజన సమస్యల పరిష్కారానికి సన్నద్ధమవుతున్న ఇద్దరు సిఎంలు
  • హైదరాబాద్‌ ‌వేదికగా జూలై 6న ముఖాముఖి చర్చలు
  • ఎజెండాపై కసరత్తు చేస్తున్న ఇరు రాష్ట్రాల అధికారులు
  • రేవంత్‌కు చంద్రబాబు లేఖతో ముందడుగు
  • చర్చల ద్వారానే సమస్యల పరిష్కారం.. : స్వాగతించిన కోదండరామ్‌

‌హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, జూలై 2: విబజన సమస్యలపై దాదాపు పదేళ్ల తరవాత ఇప్పుడు అడుగు పడబోతుంది. ఉమ్మడి ఎపిలో సిఎంగా ఉన్న చంద్రబాబు ఇప్పుడు అడుగు వేశారు. తెలంగాణతో కలసి చర్చించాలన్న నిర్ణయానికి వొచ్చారు. గత పదేళ్లుగా అధికారంలో ఉన్న కెసిఆర్‌ ఈ ‌విషయంలో ఎక్కడ ఆ చొరవ చూపలేదు. దీంతో అనేకానేక సమస్యలు అలాగే ఉండిపోయాయి. వాటిని పరిష్కరించుకోవడం ద్వారా ప్రజల్లో భరోసా కల్పించాల్సి ఉంది.

ప్రజలుగా అంతా ఒక్కటిగానే ఉన్నారు..ప్రాంతాలు విడిపోయినా విభేదాలు రాకూడదనే ప్రయత్నంతో ముందుకు సాగుతున్నట్లు కనిపిస్తుంది. ఈ క్రమంలో ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌ ‌రెడ్డికి లేఖ రాయడం సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. ఉమ్మడి ఆంధప్రదేశ్‌ ‌రెండు తెలుగు రాష్ట్రాలుగా విడిపోయాక విభజన సమస్యలను పరిష్కరించుకోవడంలో గత పాలకులు విఫలమయ్యారు.

తెలుగు రాష్ట్రాల ప్రయోజనం కోసం విభజన సమస్యల పరిష్కారం దిశగా సమావేశం ఏర్పాటు చేయాలని చంద్రబాబు ప్రతిపాదించారు. తద్వారా విభజన సమస్యలపై చర్చించుకుందామని..పొరుగు రాష్ట్రాలుగా పరస్పర సహకారాలు అందించుకుందామని చంద్రబాబు తెలిపారు. తనదైన ముద్ర వేస్తూ పరిపాలన సాగిస్తున్న తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌ ‌రెడ్డి కూడా ఇందుకు సిద్దంగానే ఉన్నారు. ఆయన కూడా చర్చల ద్వారా సమస్యలను పరిష్కరించుకోవాలన్న సన్నద్దతను గతంలోనే చాటారు. ఇందుకోసం కసరత్తు కూడా మొదలు పెట్టారు. అధికారులు, మంత్రులతో చర్చించి ఎజెండా కరారు చేసే పనిలో ఉన్నారు. ఇలా చేయడం తెలంగాణ అభివృద్ధికి ఎంతగానో ఉపయోగ పడనుంది.  రెండు రాష్ట్రాల సమగ్ర, సుస్థిర అభివృద్ధి కోసం పరస్ఫరం సహకారం అందించుకోవాలని చంద్రబాబు కూడా సంకల్పం ప్రకటించారు.

ఈ సందర్భంగా చంద్రబాబు తన లేఖలో ఇప్పటికే ఉమ్మడి ఆంధప్రదేశ్‌ ‌రాష్ట్రం విడిపోయి 10 ఏళ్లు గడిచాయని, పునర్విభజన చట్టం ప్రకారం ఇంకా ఎన్నో సమస్యలు పరిష్కారం కావాల్సి ఉండగా అవన్నీ ఇంకా పెండింగ్‌లోనే ఉండిపోయాయని గుర్తుచేశారు. వాటి కారణంగా మన రెండు రాష్ట్రాల సంక్షేమం, ఇతర అంశాలకు అడ్డంకిగా మారుతుందని, కూర్చుని చర్చల ద్వారా వీటన్నింటిని పరిష్కరించుకోవాల్సిన అవసరం ఉందని, అందుకోసం జూలై 6న శనివారం మధ్యాహ్నం తెలంగాణలో సమావేశం ఏర్పాటు చేసుకొందామని తాను ప్రతిపాదిస్తున్నానని, రెండు రాష్ట్రాల మధ్య ఉన్న కీలకమైన సమస్యలు ఇలా ముఖాముఖి సమావేశంలో కూర్చుని చర్చించుకుంటేనే పరిష్కారం అవుతాయని, ఇరు రాష్ట్రాలకు లబ్దికలిగే విధంగా పరస్పరం సహకరించుకోవాలని, భేటీ సత్ఫలితాలను ఇస్తుందని ఆశిస్తున్నానని చంద్రబాబు తన లేఖలో పేర్కొన్నారు. పరస్పర సహకార అభివృద్ధికి తమ భాగస్వామ్య నిబద్ధత వృద్ధి, శ్రేయస్సుకు తమ పరస్పర లక్ష్యాలను సాధించడంలో కీలకమైనదన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page