బాలల భారతం
డా।। పులివర్తి కృష్ణమూర్తి
పిడికిలితో వారు కొట్టుకుంటూ ఉంటే, కొందరు గజగజావణికిపోయారట, ఒకరినొకరు హింసించుకున్నారట. జరాసంధుడు అలసి పోయాడు. భీముడు అతగాడిని రెండు చేతులతో ఎత్తి పట్టుకున్నాడు. ఆ క్షణంలో కృష్ణుడు భీమునికి సైగా చేసాడు. ఒక గడ్డిపరకను రెండుగా చీల్చి పడవేశాడు. భీమసేనుడు అలాగే అని జరాసంధుని రెండుగా చీల్చి పడవేశాడు. అయితే తిరిగి అతుక్కున్నాయి. ఈ సారి కృష్ణుడు పరకలను అటూఇటుగా పడవేశాడు. భీముడు అలాగే చేయగానే జరాసంధుడు అరవడం మొదలుపెట్టాడు. భీముడు సింహనాదం చేసాడు. జరాసంధుడు మరణించాడు. అతని కుమారుడు సహదేవుడు శరణువేడగా వానికి అభయం ఇచ్చారు.
జరాసంధుని వధ పాండవులకు ఎంతో కీర్తి ప్రతిష్టలను తెచ్చిపెట్టింది. పాండువుల కీర్తి దేశదేశాలకూ వ్యాపించింది. భీముడు, అర్జునుడూ, నకులుడూ, సహదేవుడూ విజయయాత్ర సాగింది. నాలుగ దిక్కులలో ఉన్న రాజులను జయించి కానుకలు తెచ్చారు. ఈ విధంగా దిగ్విజయ యాత్రలు ముగియగానే ధర్మరాజు యాగం చేయడానికి పూనుకున్నాడు. అందరికీ ఆహ్వానాలు పంపించాడు. శ్రీకృష్ణ భగవానుడూ బయలుదేరి వచ్చాడు. మణులూ, రత్నాలూ కానుకగా కొనివచ్చాడు. అందరూ భక్తి పూర్వకంగా ఎదురువెళ్ళి, పూజసల్పి, సముచిత ఆసనం మీద కూర్చుండబెట్టి, వచ్చిన సంపదలన్నింటినీ దానధర్మాలకు వినియోగిస్తామని చెప్పారు. ఆపైన తమకు యాగదీక్ష వహించేందుకు అనుమతినడిగారు. కృష్ణుడి అంగీకారంతో వ్యాస మహర్షికి బ్రహ్మపీఠం ఇచ్చారు. అందరూ తలోపని బాధ్యతగా స్వీకరించారు. నిత్య అన్నదానం నిర్విరామంగా సాగింది. వేద ఘోష మిన్నంటింది. యజ్ఞం పూర్తికాగానే వచ్చిన వారిని సత్కరించాల్సిన సమయం రాగానే భీష్ముడు, ముందుగా పూజించదగినవాడు కృష్ణుడని ధర్మరాజుకు చెప్పాడు. భీష్ముడిలా అనగానే శిశుపాలుడు లేచి, ఎందరో రాజులూ, విశిష్టారాధ్యులూ, ఆర్యులూ, పూజ్యులూ, వయోవృద్ధులూ, ఋత్విజశ్రేష్టులూ, గురువులూవుండగా కృష్ణుని పూజార్హునిగా భావించడం ఏమిటని నిలదీశాడు. అవమానకరం అన్నాడు. తెలివితక్కువ పని అంటూ ధర్మరాజుని తప్పుపట్టాడు. ధర్మరాజూ, భీష్ముడూ నచ్చచెప్పేప్రయత్నంగా వించారు. సహదేవుడు, మేము వాసుదేవునికే పూజ జరుపుతాం. కాదనేవారెవరంటూ కాలులేపాడు.
(మిగతా..వొచ్చేవారం)