జవాబుదారితనం,పారదర్శకత లేని పాలన ..!

  డిజిటలైజేషన్ పేరుతో తీసుకొచ్చిన ధరణి పోర్టల్ లో అనేక లోపాలు ఉన్నాయి. ప్రతి గ్రామంలో కనిష్టంగా 25% భూముల సమస్యలు అపరిష్కృతంగా ఉన్నాయి.ధరణి లో జవాబుదారీతనం లోపించింది‌.ధరణి ద్వారా కొన్ని వేయిల ఎకరాల నిషేధిత జాబితాలో ఉంచి ఆ భూములు కేసిఆర్ కుటుంబ కనుసన్నల్లో ఉండేటట్లు చేశారు.ధరణి ద్వారా భూముల సమస్యలు పరిష్కారం కాకపోగా నిత్య ఘర్షణ గా కార్యాలయాలు మారాయి.డిజిటలైజషన్ పేరుతో చేస్తున్న దోపిడి చాలా పెద్ద మొత్తంలో ఉంది.అధికారులు కూడా ప్రజల సమస్యల పట్ల పరిష్కారం చూపకుండా అలసత్వం వహిస్తున్నారు.  
సుపరిపాలన అంటే చట్టబద్ధమైన పాలన,స్వతంత్ర న్యాయ వ్యవస్థ,మానవ హక్కుల పరిరక్షణ.పాలనలో పారదర్శకత, జవాబుదారితనం తో కూడిన అంశాలు ఇమిడేటట్లు చూడటం.తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తర్వాత ప్రజా ఆకాంక్షల మేరకు ప్రజలను భాగస్వాములను చేయడం ప్రధాన లక్ష్యం.అధికారాన్ని వికేంద్రీకరించడం ద్వారా అట్టడుగున ఉన్న వర్గాలకు పరిపాలన ఫలాలను అందించవచ్చు.వలస పాలనా కాలంలో ప్రపంచీకరణ అభివృద్ధి నమూనా ను ఈ ప్రాంతం ప్రజలపై బలవంతంగా ప్రవేశ పెట్టడం మూలంగా తెలంగాణ ప్రజలు ఆ అభివృద్ధి నమూనా కు వ్యతిరేకంగా పోరాడి తమ వనరులు  తమకు  చెందుతాయని కలలు గన్నారు‌. అధికారం కొద్ది మంది చేతుల్లో కేంద్రీకృతం కావడం అలాగే ఆ విధానాలకు వ్యతిరేకంగా ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు ను తెలంగాణ ప్రజలు కోరుకున్నారు.నూతన రాష్ట్రంలో అధికార వికేంద్రీకరణ పేరు తో నూతన జిల్లాలు ,,నూతన మండలాలు,నూతన రెవిన్యూ డివిజన్ కార్యాలయాలు,నూతన గ్రామ పంచాయతీలు మరియు తండాలను గ్రామ పంచాయతీలుగా ఏర్పాటు చేశారు.కాని అంధుకు అనుగుణమైన అధికా‌ర ఏర్పాటు వ్యవస్థ లో విఫలమైంది.తెలంగాణలో పారదర్శకత లేని,జవాబుదారీతనం లోపించిన పాలన నడుస్తుంది.ప్రజల పోరాటాల ఫలితంగా ఏర్పడిన రాజ్యాంగం ద్వారా సంక్రమించిన అధికారాలను దుర్వినియోగం చేయడమే కాకుండా ప్రజాస్వామ్యాన్ని రాచరికం వైపు తీసుకెల్తారేమోననే ఆలోచన తెలంగాణ ప్రజలలో మొదలయింది.
చట్టబద్దత లేని పాలన.
ఏ దేశంలో నైనా చట్టబద్ధంగా పాలన కొనసాగాలి.తెలంగాణ లో కూడా ఆ తరహా పాలన కొనసాగుతుందని ప్రజలు భావించారు.కాని విధి విధానాల్లోనూ ఆచరణలోను చట్టబద్దత లోపించింది.సమీకృత కలెక్టరేట్ ల పేరుతో ప్రజల ఊరుమ్మడి ఆస్తులను ప్రజాభిప్రాయానికి ఆస్కారం లేకుండా ఇష్టారాజ్యంగా లాక్కున్నారు,ఏ విధాన రూపకల్పన లోను ప్రజలకు భాగస్వామ్యం దక్కలేదు.ప్రజలు పౌర సమాజం కోరిన ఏ సమాచారాన్ని కూడా ఇవ్వడం లేదు. జీవోలు సైతం అంతర్గతంగానే రిలీజ్ అవుతున్నాయి. అవి ప్రజలకు అందుబాటులో ఉండడం లేదు.ఏక వ్యక్తి కేంద్రం గానే రహస్య పద్దతిలో విధాన నిర్ణయాలు జరుగుతున్నాయి.ఉద్యమంలో ఏనాడూ పోరాట పటిమ లేని వ్యక్తులకు పాలనలో భాగస్వామ్యం కల్పించారు.అక్రమార్కుల ను ఈ తెరాస ప్రభుత్వం అందలానికెక్కించింది.ప్రభుత్వం సంక్షేమం కోసం ప్రవేశపెట్టె పథకాల వెనుక లాబీయింగ్ ల ద్వారా అధికారాన్ని పొందడమే లక్ష్యం కలిగి ఉంది.విధ్వంసక అభివృద్ధి నమునాను అమలు చేస్తున్నారు.పౌరులలో నైతిక పరమైన అంశాలు ఇమిడేటట్లు చూడటమే అసలైన అభివృద్ధన్న సంగతి మర్చినారు.స్వరాష్టంలో ఏ రంగంలో కి తొంగి చూసినా చట్టబద్దత తో కూడిన పాలన మచ్చుకు కూడా కానరావడం లేదు.
ప్యూడల్ పాలన కోసమే ధరణి
2014లో ఇచ్చిన హామీలో భాగంగా సమగ్ర భూ సర్వే చేస్తామన్నారు.సర్వే నెంబర్ల ప్రకారం తేల్చి రీసెటిల్మెంట్ చేస్తామన్నారు.ఆ హమీలను అమలు చేయకుండానే కేవలం భూ రికార్డులు మాత్రమే ప్రక్షాళన చేశారు. కంప్యూటరైజేషన్ చేసే సందర్భంలో ఇంటి పేర్లు తప్పు బడినాయి,విస్తీర్ణం తక్కువగా పడ్డది,పేర్లు తప్పు పడ్డాయి అవేవీ సవరించకుండానే డిజిటల్ పాస్ పుస్తకాలు ఇచ్చి అనేక సమస్యలను సృష్టించారు. చాలా పట్టా భూములు నిషేధిత జాబితాలో
పడ్డాయి.మ్యూటేషన్ ఆప్షన్స్ పెట్టలేదు. వీఆర్వో వ్యవస్థ రద్దు తో మరింత రెవిన్యూ వ్యవస్థ మరింత జఠిలమైంది. తహసీల్దార్లు అధికారాలుఅన్ని కలెక్టర్లు కు అప్పగించినారు.రెవిన్యూ విషయంలో ఏ చిన్న సమస్య వచ్చినా కలెక్టర్ దగ్గరికి వెళ్లాల్సిందే. కలెక్టర్ జిల్లా పరిపాలన ఉన్నతాధికారిగా అనేక సమస్యలు ఉంటాయి.దీనికి తోడు అనేక భూముల సమస్యలు కుప్పలు తిప్పలుగా తయారైనవి.
చాలా సమస్యలు పెండింగ్ లో ఉంటున్నాయి. ట్రిబ్యుననల్స్ రద్దు చేశారు. సివిల్ కోర్టులకు అధికారాలు అప్పగించారు. 9 1/2 లక్షలు సాదా బైనమా ధరాఖాస్తులు పెండింగ్ లోనే ఉన్నాయి.ఆనాడు కమ్యూనిస్టులు పేద ప్రజలకు పంచిన భూములను పేరుతో అక్రమంగా స్వాధీనం చేసుకుంటున్నారు,మళ్లీ దొరలకు ఆ భూములను అప్పగిస్తున్నారు. పేద ప్రజలకు భూములను దూరం చేస్తున్నారు.డిజిటలైజేషన్ పేరుతో తీసుకొచ్చిన ధరణి పోర్టల్ లో అనేక లోపాలు ఉన్నాయి. ప్రతి గ్రామంలో కనిష్టంగా 25% భూముల సమస్యలు అపరిష్కృతంగా ఉన్నాయి.ధరణి లో జవాబుదారీతనం లోపించింది‌.ధరణి ద్వారా కొన్ని వేయిల ఎకరాల నిషేధిత జాబితాలో ఉంచి ఆ భూములు కేసిఆర్ కుటుంబ కనుసన్నల్లో ఉండేటట్లు చేశారు.ధరణి ద్వారా భూముల సమస్యలు పరిష్కారం కాకపోగా నిత్య ఘర్షణ గా కార్యాలయాలు మారాయి.డిజిటలైజషన్ పేరుతో చేస్తున్న దోపిడి చాలా పెద్ద మొత్తంలో ఉంది.అధికారులు కూడా ప్రజల సమస్యల పట్ల పరిష్కారం చూపకుండా అలసత్వం వహిస్తున్నారు.
చట్టాల అమలులో పారదర్శకత ఏది.?
తెలంగాణ వచ్చేనాటికి అప్పటికే అసెంబ్లీ ఆమోదించిన చట్టాలను అమలు చేయడం లేదు.చట్టబద్ధ పాలన చేస్తామని హమీ ఇచ్చారు.1973 భూగరిష్ఠ పరిమిత చట్టం,2006 అటవీ హక్కుల చట్టం,2009 విద్యా హక్కు చట్టం,2011 కౌలు రైతుల గుర్తింపు చట్టం,2013 భూ సేకరణ చట్టం,2016 వ్యవసాయ కుటుంబాలను ఋణ విముక్తుల చేసే చట్టం ఈ చట్టాలు ఏవి కూడా తెలంగాణలో అమలు చేయడం లేదు.జీవో లో పారదర్శకత లేదు, 2015 సమగ్ర కుటుంబ సర్వే డేటా ఇంతవరకు ప్రజల ముందు పెట్టలేదు, అసెంబ్లీలో పెట్టిన బడ్జెట్ లను ఖర్చు చేయడం లేదు.చట్టాల అమలులో పారదర్శకత లేనప్పుడు సుపరిపాలన ఏలా సాధ్యం.?
నేరపూరిత రాజకీయాలపై నియంత్రణ ఏది.?
రాజకీయాలు అంటే ప్రతి అంశం పట్ల అవగాహనను కల్పించడం.సమస్యల పరిష్కార సాధన కోసం ప్రజా రాజకీయాలను ప్రోత్సాహిస్తూ ప్రజాస్వామ్య వ్యవస్థ పరిరక్షణకై పాటుపడాలి. నేరపూరిత రాజకీయాలకు పాల్పడుతున్న వారి పట్ల కఠినంగా ఉండాల్సిన పాలకులే రాజకీయాలలో నేరాలను ప్రోత్సహించడం అనాగరికమైన చర్య.భూ బకాసురులు, స్త్రీ లపై అనుచిత వ్యాఖ్యలు చేసేవారు,ప్రజల సంపదను వ్యాపారంగా మార్చేవారు,నేరపూరితమైన ఆలోచనలు కలిగిన దివాళా కోరులు నేటి భారాసా పాలనలో ఉన్నారు.అవినీతిని ప్రశ్నించిన వారిని అక్రమ ఇసుక దందాలకు అడ్డుపడిన ప్రజలను ఇసుక లారీలతో తొక్కిస్తున్నారు. సోషల్ మీడియాలో అధికార పార్టీని నిలదీసిన కేసులు బనాయిస్తున్నారు.తెలంగాణ ఉద్యమం పట్ల సానుభూతి చూపించనివారు,ఉద్యమ కారుల పై ఉక్కుపాదం మోపినవారు,భౌతిక నిర్మూలన కు పాల్పడిన వారు తెలంగాణ పునర్నిర్మాణమే తమ లక్ష్యమని తొమ్మిదేళ్లుగా ప్రగల్భాలు పలుకుతున్నారు.గ్రామాలలో ప్రజలను భయభ్రాంతులకు నిరంతరం గురి చేస్తూ , వేధింపులకు పాల్పడుతున్న వారికి ప్రభుత్వ కార్పోరేషన్,ఇతరత్రా నామినేటెడ్ పదవుల లో భారాసా భాగస్వామ్యం కల్పిస్తున్నారు.ఉద్యమ కారులను ,అసమ్మతి వాదులను చిత్ర హింసలకు గురి చేసి వారిపై అనేక కుట్ర కేసులు బనాయించడం వారి నేరపూరిత స్వభావానికి నిదర్శనం.
స్పష్టత-జవాబుదారీతనం ఎక్కడ.?
తొమ్మిదేళ్ళుగా ప్రభుత్వం చేసిన ఏ ప్రకటన పైన జవాబుదారీతనం లేదు‌ స్పష్టత లేదు.తమ అనునూయులకు,బంధు గణానికి  తమ ఆశ్రితుల పట్ల తెరాస  ఉదార స్వభావం తో వ్యవహారిస్తుంది.అసెంబ్లీ సాక్షి గా ప్రకటించిన ఉద్యోగాలువాటిని నియమించే తీరులో అనేక లోపాలు ఉన్నాయి.పౌర రక్షణ కోసం పోలీస్ కమాండెంట్ పేరుతో కంట్రోల్ రూం ఏర్పాటు చేసి దేశంలో అత్యధిక సంఖ్యలో సిసి కెమెరా ల ద్వారా  ప్రతి పౌరుడిపై నిఘా ఏర్పాటు చేయడం ఇది ఏ సుపరిపాలన కు ఆదర్శం.! పరీక్షల పేరుతో వేసిన నోటిఫికేషన్ లు పరీక్షల ప్రశ్నా పత్రాల లీకేజీ నిరుద్యోగులకు ఏం మిగిల్చినట్లు? పరీక్షా తీరు నిర్వహణలో పారదర్శకత ఏది.? ఇది ఏ జవాబుదారీతనంతో కూడిన పాలన.ఇలా అన్ని రంగాల్లో ఇవే ఛాయలు కనిపిస్తున్నాయి.
 వికేంద్రీకరణ పేరుతో చేసిన పరిపాలన అశాస్త్రీయం.
అట్టడుగున ఉన్న వర్గాలకు ప్రభుత్వ సంక్షేమ ఫలాలు అందించడం కోసం 2016 లో కొత్త జిల్లాలు, రెవెన్యూ డివిజన్ లు, మండలాలు,గ్రామ పంచాయతీ లు ఏర్పాటు చేశారు ‌.ఒక శాస్త్రీయమైన ప్రమాణాలు పాటించకుండా తమకు, రంగారెడ్డి జిల్లా కలెక్టరేట్ లాంటివి అనేకం రియల్ ఎస్టేట్ కోసమే నిర్మించినారు అనడంలో ఎలాంటి సందేహం లేదు.పాలన వ్యవస్థలు ప్రజలకు దగ్గరగా ఉండాలి గాని దూరం చేయడంలో పాలకుల యొక్క స్వార్థం దాగి ఉంది అనడంలో శెషబిషలు ఏమీ లేవు.మంత్రులకు వారి అననూయులకు నచ్చినపద్దతిలో, వారు కోరినచోట నూతన కార్యాలయాలను ఏర్పాటు చేసినారు.ప్రతి పక్షాలు ప్రాతినిధ్యం వహిస్తున్న జిల్లాలు,నియోజకవర్గాలు మండలాలను అస్తవ్యస్తంగా మార్చినారు‌.దీనికి తోడు జోన్ల విధానం ద్వారా ప్రభుత్వ నియామకాలు కొన్ని జిల్లాల ప్రజలకు అందని ద్రాక్ష అయింది.రాత్రికి రాత్రి అనే జీవోలు తీసుకువచ్చి ఉద్యోగులను గందరగోళానికి గురి చేశారు, వారి అభిప్రాయాన్ని కూడా పరిగణలోకి తీసుకోలేదు.స్ధానిక ప్రజల సమ్మతి లేకుండా ఇష్టారాజ్యంగా,అశాస్త్రీయంగా తమకు లాభాలు చేకూర్చే విధంగా,రియల్ ఎస్టేట్ లకు అనుకూలంగా ఉండేటట్లు విభజన చేశారు.ఇది రాజ్యాంగ ఆదర్శాలకు విరుద్ధమైన భావన. ఈ ప్రభుత్వంలో వికేంద్రీకరణ పేరుతో నిర్మించిన అనేక నిర్మాణాల లోను వాటి చుట్టుపక్కల్లోనూ అధికార పార్టీ ప్రజా ప్రతినిధుల స్వార్థం దాగి ఉందనేది నగ్న సత్యం.
సమతౌల్యతను సాధించినారా.!
తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు రాజ్యాంగ బద్దంగా జరిగింది.ఏర్పడిన స్వరాష్ట్రంలో సంక్షేమం, అభివృద్ధి సమపాళ్లలో అందరి కి ఇవ్వాలి. ‌ప్రొఫసర్ జయశంకర్ సార్ అభిప్రాయ పడినట్లు తెలంగాణ అభివృద్ధి చెందాలి.అభివృద్ది  ఫలాలు అందరికీ అందాలి.కాని అందుకు విరుద్ధంగా అభివృద్ధి పేరుతో తెలంగాణ అప్పుల కుప్పయింది.తెలంగాణ లో గురుకులాల పేరుతో,ఆత్మ గౌరవ భవనాల పేరుతో,వర్గాల పేరుతో,అస్తిత్వం పేరుతో ప్రజలను విడదీసి పాలన చేస్తున్నారు. సమతౌల్యతను సాధించాల్సిన పాలకులు సమస్యలను సృష్టించి కులం పేరా రాజకీయాలు చేస్తున్నారు.ప్రజలకు చెందాల్సిన సంపదను మెఘా క్రృష్ణారెడ్డి,మై హోం, చినజీయర్ లకు కేటాయించి మధ్య తరగతి, క్రింది స్థాయి వర్గాలకు మొండి చేయి చూపుతున్నారు.వారి మరింత సంపన్నులు గా ప్రజలు కడు బీదవారిగా రూపాంతరం చెందుతున్నారు. స్ర్తీ పురుషుల మధ్య,విభిన్న మతాల మధ్య, విభిన్న కులాల మధ్య, ఉత్తర దక్షిణ తెలంగాణ ప్రాంతాల మధ్య నేక అంతరాలు ఏర్పడ్డారు. తెలంగాణ ప్రాంతాల మధ్య విద్వేషాలు చెలరేగుతున్నాయి.సమగ్ర కుటుంబ సర్వే నివేదిక అంశాలు,అందులో పేర్కొన్న కులాలు,వారి జనాభా, ఇతరత్రా అంశాలు ఉన్నాయి.కాని ఇంతవరకు ఆ నివేదికను బయట పెట్టలేదు.మొత్తంగా తెలంగాణ ప్రజల మధ్య సరియైన ఆరోగ్య వాతావరణం తెరాస కల్పించడం లేదు.
 ప్రజల వద్దకు పాలన ఏది.?
తెరాస నినాదం,హామీ ప్రజల వద్దకు పాలన.కాని నేడు అందుకు విరుద్ధంగా ఉంది.ఏనాడు కూడా సెక్రటేరియల్ మెట్లు ఎక్కకుండానే గడీల పాలన కొనసాగిస్తున్నారు.ప్రగతి భవన్,ఫాంహౌస్ నుంచి తెరాస పాలన ఉంది.ఏనాడు కూడా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రజల నుండి విజ్ఞప్తులు స్వీకరించిన దాఖలాలు లేవు. సమస్యలతో వచ్చిన ప్రజలను సచివాలయంలో కి రానివ్వరు,వీరు ప్రజల దగ్గరకు పోరు.వాస్తు దోషాల పేరుతో ప్రజల సంపదను భవనాల నిర్మాణం కోసం అప్పనంగా ఖర్చు పెడుతున్నారు.అనేక పథకాలకు శ్రీకారం చుట్టారు.ఇలాంటి చర్యల ద్వారా ప్రజల వద్దకు పాలన నినాదంగా నే మారింది.
అస్తవ్యస్త పాలనకు అవినీతికి చరమగీతం పలకాలంటే వివిధ పథకాల అమలులో ప్రజల భాగస్వామ్యాన్ని పెంపొందించాలి.అభివృద్ధి పథకాలను ప్రజలందరికీ అందుబాటులోకి తీసుకురావాలి, అన్ని వర్గాల వారికి పారదర్శకమైన పాలనను అందుబాటులోకి తీసుకురావాలి,ప్రజలందరిలో స్వయం సమృద్ధి సాధికారతను పెంపొందించాలి, అన్ని వర్గాలలోని సామాజిక విలువలను పెంపొందించాలి, సమాజ ప్రగతిలో ప్రభుత్వ సంస్థల యొక్క పౌర సమాజం యొక్క పాత్రను పెంచాల్సిన అవసరం ఉంది,పౌర సమాజంలో జవాబుదారీతనాన్ని మెరుగుపరచాలి, ప్రభుత్వం ప్రజలకు మరియు మార్కెట్లోని ఆర్థిక వ్యవస్థల మధ్య అన్యోన్య సంబంధాలను పెంపొందించాలి.అంతిమంగా పౌరులందరికి సమన్యాయ పాలనను అందిస్తూ సుపరి పాలన వైపు నడుచుకోవాల్సిన బాధ్యత పాలకుల పై ఉంది.
-పందుల సైదులు
తెలంగాణ విద్యావంతుల వేదిక 
9441661192

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page