వికారాబాద్ జిల్లా, ప్రజాతంత్ర, అక్టోబర్ 18: చెక్ పోస్ట్ ల వద్ద గట్టి నిఘా పెట్టాలనీ వికారాబాద్ జిల్లా కలెక్టర్ సి. నారాయణరెడ్డి అధికారులను ఆదేశించారు. బుధవారం జిల్లా ఎస్పీ ఎన్.కోటిరెడ్డి, అదనపు కలెక్టర్ లింగ్యా నాయక్ లతో కలిసి రాష్ట్ర సరిహద్దు, కొడంగల్ నియోజకవర్గం లోని చంద్రకల్ గ్రామ పరిధిలోని హైవేపై ఏర్పాటుచేసిన చెక్ పోస్ట్ ను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఈ సందర్భంగా అధికారులను ఉద్దేశించి కలెక్టర్ మాట్లాడుతూ…. ఎన్నికల నియమ నిబంధనల మేరకు విధులను నిర్వహిస్తూనే సరిహద్దుల్లో అక్రమంగా తరలించే మద్యం, డ్రగ్స్ , డబ్బు తరలించే వాహనాలను గుర్తించే విధంగా ప్రతి వాహనాన్ని తప్పనిసరిగా తనిఖీలు చేయాలని కలెక్టర్ అధికారులకు సూచించారు. చెక్ పోస్ట్ ల వద్ద ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలు జిల్లా ఎన్నికల అధికారికి లింక్ వుంటుందని అదేవిధంగా వీటిని ఎన్నికల కమిషన్ కూడా ఎప్పటికప్పుడు వీక్షిస్తుందని కలెక్టర్ తెలిపారు. వాహనాల తనిఖీలను విరామం లేకుండా రెగ్యులర్ గా సీసీ కెమెరాలో రికార్డ్ అవుతున్నాయా అనేది ఎప్పటికప్పుడు పరిశీలించాలాని కలెక్టర్ అధికారులకు సూచించారు. చెక్ పోస్ట్ ల వద్ద అనుబంధ శాఖలతోపాటు ఆబ్కారి శాఖ అధికారులు కూడా తప్పనిసరిగా విధుల్లో ఉండాలని కలెక్టర్ తెలిపారు. చెక్ పోస్ట్ ల వద్ద ఇప్పటివరకు ఎంత డబ్బు రికవరీ చేశారని కలెక్టర్ ఆరా తీయగా.. ఇప్పటివరకు 8 లక్షల 26 వేల రూపాయల నగదును స్వాధీనం చేసుకున్నట్లు అధికారులు తెలిపారు. ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఏర్పాటుచేసే స్ట్రాంగ్ రూమ్, డిస్ట్రిబ్యూషన్ కేంద్రాల పరిధిలో భారీ కేడ్స్ తో పాటు వివిధ వసతులతోపాటు మౌలిక సదుపాయాలు కల్పించేందుకు ఏర్పాట్లు చేపట్టాలని కలెక్టర్ అధికారులకు సూచించారు.ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ కొడంగల్ ప్రభుత్వ జూనియర్ కాలేజీల్లో ఏర్పాటు చేసే స్ట్రాంగ్ రూమ్, డిస్ట్రిబ్యూషన్ కేంద్రాన్ని , కొడంగల్ రిటర్నింగ్ అధికారి కార్యాలయంలో ఎన్నికల్లో భాగంగా నిర్వహిస్తున్న వివిధ విభాగాలను కలెక్టర్ పరిశీలించారు. కలెక్టర్ తో పాటు కొడంగల్, దౌల్తాబాద్ తహసిల్దార్లు డి. విజయ్ కుమార్, సి. విజయ్ కుమార్, ఎంపీడీవో పాండు, మున్సిపల్ కమిషనర్ ప్రవీణ్ కుమార్, రెవెన్యూ , పోలీస్, అబ్కారీ శాఖల అధికారులు ఉన్నారు.