- అపస్మారక స్థితిలో విద్యార్థి కార్తీక్
- పాల్వంచ ప్రభుత్వ గురుకుల కళాశాలలో దారుణం
కొత్తగూడెం, ప్రజాతంత్ర, జూలై 4 : క్రమశిక్షణ నేర్పాల్సిన అధ్యాపకుడు సహనం కోల్పోయి విచక్షణ మరచి విద్యార్థులపై దాడికి తెగబడిన సంఘటన పాల్వంచలో సోమవారం చోటు చేసుకుంది. కొత్తగూడెం జిల్లా పాల్వంచ మండలంలోని ప్రభుత్వ గురుకుల కళాశాలలో ఇంటర్ ద్వితీయ సంవత్సరం చదువుతున్న తేళ్ళూరి కార్తీక్ డ్రెస్సింగ్ స్టయిల్ సరిగా లేదనే నెపంతో కోపంతో ఊగిపోయిన పిజిక్స్ లెక్చరర్ రాంబాబు విద్యార్థి కార్తీక్ తలను గోడకేసి కొట్టాడు. దీంతో అపస్మారక స్థితిలోకి వెళ్లిన కార్తిక్‌ని తల్లిదండ్రులకు, పోలీసులకు సమాచారం ఇవ్వకుండానే కొత్తగూడెంలోని ఓ ప్రైవేటు హాస్పిటల్‌కి తరలించి వైద్య చికిత్సలు అందిస్తున్నాడు.
ఇదే అంశంపై హాస్పిటల్ వైద్యులు వేణుగోపాల్ మాట్లాడుతూ… కార్తీక్ మెదడుకు బలంగా తగలడంతో రక్తం గడ్డ కట్టిందని, పరిస్థితి విషమంగా ఉందని, విద్యార్థిని అబ్జర్వేషన్లో ఉంచామని తెలిపారు. బాధితుడి తల్లి యశోద మాట్లాడుతూ విద్యాబుద్ధులు నేర్పి తన పిల్లలను ప్రయోజకులను చేస్తారనే ఆశతో తల్లిదండ్రులు విద్యాలయాలకు పంపిస్తుంటే విద్య నేర్పించాల్సిన సార్ కొట్టి సంపుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. శిక్షణ ఇచ్చేవారు ఇలా విశాక్షణ లేకుండా విద్యార్థులపై దాడి చేయడం ఏంటని, తన కుమారుడికి ఏమన్నా అయితే బాధ్యులు ఎవరని ప్రశ్నించారు. దాడికి పాల్పడిన బోధకుడిని శిక్షించాలని బంధువులు, కుటుంబ సభ్యులు, విద్యాసంఘాల నాయకులు డిమాండ్ చేస్తున్నారు.