వ్యవస్థాపక సంపాదకులు

దేవులపల్లి అమర్

ఎడిటర్

దేవులపల్లి అజయ్

తనిఖీల్లో బయటపడుతున్న నోట్ల కట్టలు

April 4, 2019

రూ. 2కోట్ల నగదు స్వాధీనం..టీడీపీ ఎంపీ మురళీమోహన్‌పై కేసునమోదు
: ఈసి అధికారుల ఆదేశాలతో ఎక్కడిక్కడ తనిఖీలు ముమ్మరం చేస్తున్నారు. దీంతో నగదు కట్టల రూపంలో బయటపడుతోంది. ఎక్కడిక్కడ కోట్లల్లో డబ్బులు పట్టుబడుతున్నాయి. దేశవ్యాప్తంగా ఇది కనిపిస్తున్నా తెలుగు రాష్ట్రాల్లోనూ భారీగా డబ్బులు పట్టుబడుతున్నాయి. గతం కన్నా భిన్నంగా ఇప్పుడు జిల్లాల్లో అధికారులు నిఘా కట్టుదిట్టం చేశారు. ప్రధానంగా ఎన్నికల ఖర్చుపై ప్రత్యేక దృష్టి సారించారు. నగదు ప్రవాహంపై ఆరా తీస్తున్నారు. అభ్యర్థుల ప్రచారం, నగదు వ్యవహారాలపై ఎన్నికల అధికారులు ప్రత్యేక దృష్టి సారిస్తున్నారు. ఎప్పటికప్పుడు జిల్లాలకు, అక్కడి నుంచి రాష్ట్రానికి నివేదికలు వెళుతున్నాయి. ఎన్నికల కమిషన్‌ ‌నిబంధనల మేరకు పోటీ చేస్తున్న అభ్యర్థి రూ.70లక్షలకు మించి ఖర్చు చేయడానికి వీలు లేదు. ఈ నేపథ్యంలో నిత్యం నిఘా ఏర్పాటు చేసారు. ఎన్నికల్లో పోటీ చేస్తున్న అభ్యర్థి ఖర్చు వివరాలపై ఈసారి ఎన్నికల కమిషన్‌ ‌ప్రత్యేక దృష్టి సారించింది. డబ్బు చేరవేతపై గట్టి నిఘా పెట్టామని ఎన్నికల అధికారి రజత్‌ ‌కుమార్‌ ‌కూడా చెప్పారు. రషీదులు, రుజువులు దగ్గర పెట్టుకోవాలని సూచించారు. విధించిన పరిమితికి మించి ఖర్చు పెడితే చర్యలు తీసుకునేందుకు ఏర్పాటు చేస్తున్నారు. మరోవైపు అభ్యర్థుల లెక్కలు తప్పుగా చూపే అవకాశం ఉన్న నేపథ్యంలో ప్రత్యేక బృందాల ద్వారా ర్యాలీలు, బహిరంగ సభలతోపాటు ఇతర కార్యక్రమాలను వీడియో ద్వారా చిత్రీకరించనున్నారు. ర్యాలీలు, సభల్లో ఎమ్మెల్యే ఫొటోలు వాడితే ఆ సభకు అయ్యే ఖర్చును అభ్యర్థి ఖాతాలోనే లెక్కిస్తారు. ప్రచారానికి సంబంధించిన వివరాలను నమోదు చేసేందుకు ఎన్నికల అధికారులు ఎంపి అభ్యర్థులకు ప్రత్యేక రిజిష్టర్‌ను అందజేస్తున్నారు. ఈ రిజిష్టర్‌లో అభ్యర్థులు తమ ఎన్నికల ఖర్చు వివరాలను నమోదు చేయాల్సి ఉంటుంది. సామాన్య పౌరులు తమతో రూ.50 వేలకు మించి నగదు తీసుకెళ్లవద్దని, అంతకు మించి తరలిస్తే వాటిని సీజ్‌ ‌చేసి ఆ దాయపు పన్నుల శాఖకు అప్పగించనున్నారు. నగదుకు సంబంధించిన రశీదు, ధ్రువ పత్రాలను చూపించాల్సి ఉంటుంది. కాగా జీరో అకౌంట్స్ ‌ఖాతాలతోపాటు, బ్యాంకుల లావాదేవీలపై కూడా అధికారులు కన్నేశారు. అనుమానిత వ్యక్తులపై కూడా నిఘా ఉంచేందుకు ప్రజలతో భాగ్యస్వామ్యం అవుతున్నారు. సమాచార వ్యవస్థను మరింత పెంచుకుంటున్నారు. ఇందులో భాగంగా వరుసగా గ్రామాల్లో కార్డన్‌ ‌సెర్చ్ ‌నిర్వహిస్తున్నారు. గతంలో నిర్వహించిన ఎన్నికల్లో పోలింగ్‌ ‌కేంద్రాలకు జియో ట్యాగింగ్‌ ‌లేదు. కాని ఈసారి నూతనంగా ప్రతీ పోలింగ్‌స్టేషన్‌ను జియో ట్యాగింగ్‌తో అనుసంధానం చేస్తున్నారు. ప్రస్తుతం అత్యధునిక సాంకేతికతతో కూడిన జియో ట్యాగింగ్‌ ‌సిస్టమ్‌ను పోలీస్‌ ‌యంత్రాంగం వినియోగిస్తోంది. దీంతో అభ్యర్థుల ఖర్చును ఎప్పటికప్పుడు లెక్కలు అడుగుతున్నారు.

రూ. 2కోట్ల నగదు స్వాధీనం..టీడీపీ ఎంపీ మురళీమోహన్‌పై కేసునమోదు
ఎటువంటి పత్రాలు లేకుండా తరలిస్తున్న రూ.2కోట్ల నగదును సైబరాబాద్‌ ‌పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. డబ్బులు తరలిస్తున్న ఇద్దరు జయభేరి సంస్థ ఉద్యోగులను అదుపులోకి తీసుకున్న పోలీసులు, టీడీపీ ఎంపీ మురళీమోహన్‌పై కేసు నమోదు చేశారు. ఈ మేరకు గురువారం సైబరాబాద్‌ ‌పోలీస్‌ ‌కమిషనర్‌ ‌సజ్జనార్‌ ‌వివరాలు వెల్లడించారు.