వ్యవస్థాపక సంపాదకులు

దేవులపల్లి అమర్

ఎడిటర్

దేవులపల్లి అజయ్

తీర్పు ఏ ఒక్కరికీ విజయం.. ఓటమి కాదు

November 9, 2019

భారతభక్తిని బలోపేతం చేద్దాం – ట్విటర్‌లో ప్రధాని నరేంద్ర మోదీసుప్రీం తీర్పు ఏ ఒక్కరికీ విజయం కానీ.. ఓటమి కాదని.. రామ భక్తి అయినా.. రహీమ్‌ ‌భక్తి అయినా ఒకపై భారతభక్తిని బలోపేతం చేయాల్సిన సమయమిదని ప్రధాని నరేంద్ర మోదీ పేర్కొన్నారు. అయోధ్యలో రామజన్మభూమి – బాబ్రీమసీదు భూవివాద స్థలంపై సుప్రీంకోర్టు వెలువరించిన తీర్పుపై ప్రధాని నరేంద్ర మోదీ స్పందించారు. ఈ తీర్పు ఏ ఒక్కరికీ విజయంగానీ.. ఓటమిగానీ కాదని పునరుద్ఘాటించారు. రామభక్తి అయినా.. రహీమ్‌భక్తి అయినా ఇకపై భారతభక్తిని బలోపేతం చేయాల్సిన సమయం ఇదని మోదీ అన్నారు. ఈ సందర్భంగా దేశవాసులంతా శాంతి, సామరస్యాల్ని పరిరక్షిస్తూ.. భారతదేశ ఏకత్వాన్ని చాటాలని, నేడు వెలువరించిన సుప్రీం కోర్టు తీర్పు అనేక రకాలుగా ప్రాముఖ్యమైనదన్నారు. ఎలాంటి వివాదమైనా చట్టబద్ధమైన పక్రియ ద్వారా అందరికీ ఆమోదయోగ్యంగా పరిష్కరించవచ్చునని నిరూపితమైందని ప్రధాని తెలిపారు. అలాగే ఈ తీర్పు భారత న్యాయవ్యవస్థ స్వతంత్రత, పారదర్శకత, దూరదృష్టిని ప్రతిబింబిస్తుందన్నారు. చట్టం ముందు అందరూ సమానులేనని ఈ తీర్పు మరోసారి చాటి చెప్పిందన్నారు. దశాబ్దాలుగా నలుగుతున్న ఈ సమస్యన్ని న్యాయస్థానం అందిరికీ ఆమోదయోగ్యంగా పరిష్కరించిందన్నారు. ఈ కేసులో ప్రతి వర్గానికి తగు సమయం కేటాయించారు. భిన్న వాదనలు, అభిప్రాయాలకు చోటుకల్పించారన్నారు. దీంతో న్యాయవ్యవస్థపై ప్రజలకున్న విశ్వాసం మరింత పెరుగుతుందని, తీర్పు నేపథ్యంలో దేశవ్యాప్తంగా 130కోట్ల మంది ప్రజలు పాటిస్తున్న సంయమనం.. శాంతి కోసం ప్రజలు కట్టుబడి ఉన్నారన్న విషయాన్ని తెలియజేస్తోందని ప్రధాని తెలిపారు. ఇదే స్ఫూర్తిని కొనసాగిస్తూ దేశం అభివృద్ధి పథంలో దూసుకెళ్లాలని అయోధ్య తీర్పుపై ట్విటర్‌ ‌వేదికగా మోదీ తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు.