ఎన్నికల క్షేత్రంలో టీజేఎస్, కాంగ్రెస్ కలిసి పనిచేస్తాయి
బీఆర్‌ఎస్ ప్రభుత్వంపై పదేళ్లుగా కోదండరామ్ పోరాటం
వొచ్చే కాంగ్రెస్ ప్రభుత్వంలో టీజేఎస్‌కు కీలక స్థానం
టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి
హైదరాబాద్, ప్రజాతంత్ర, అక్టోబర్ 30 : తెలంగాణకు పట్టిన చీడ, పీడ వదలాలంటే కోదండరామ్ సహకారం అవసరమని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి అన్నారు. సోమవారం హైదరాబాద్ నాంపల్లిలోని టీజేఎస్ కార్యాలయంలో టీజేఎస్ అధ్యక్షుడు కోదండరామ్‌తో భేటీ అనంతరం రేవంత్ రెడ్డి మీడియా మాట్లాడుతూ…గత పదేళ్లుగా కోదండరామ్ బీఆర్‌ఎస్ ప్రభుత్వ విధానాలపై పోరాడుతున్నారని, ఆయన మద్దతు కాంగ్రెస్‌కు ఇవ్వాలని కోరేందుకు వొచ్చామన్నారు. ప్రజలకి కోదండరామ్ మీద విశ్వాసం ఉందని, అధిష్ఠానం సూచన మేరకు ఆయనను కలిశామని వెల్లడించారు. కోదండరామ్ తెలంగాణ ఆత్మగౌరవాన్ని నిలబెట్టారని, ప్రజల పక్షాన నికార్సుగా నిలబడ్డారన్నారు. కేసీఆర్ కుటుంబం నుండి విముక్తి కలిగించాలని కలసి పని చేద్దామని కోరామన్నారు రేవంత్ రెడ్డి.
రాష్ట్రంలో ప్రజా ప్రభుత్వం ఏర్పాటు చేసేందుకు కలిసి ముందుకెళతామని రేవంత్ రెడ్డి చెప్పుకొచ్చారు. భవిష్యత్‌లో సమన్వయ కమిటీని నియమించుకుని ముందుకెళతామన్నారు. టీజేఎస్ నుంచి ప్రభుత్వంలో భాగస్వామ్యం అయ్యేలా కమిటీ ఉంటుందని తెలిపారు. ఎన్నికల క్షేత్రంలో టీజేఎస్, కాంగ్రెస్ కలిసి పనిచేస్తుందన్నారు. వొచ్చే కాంగ్రెస్ ప్రభుత్వంలో టీజేఎస్‌కు కీలక స్థానం ఉంటుందన్నారు. లక్ష్యాన్ని ముద్దాడే వరకు అండగా ఉంటామని కోదండరామ్ హామీ ఇచ్చారని రేవంత్ రెడ్డి వెల్లడించారు. సీట్లు వోట్లు కంటే.. ఒక గొప్ప లక్ష్యం కోసం కలిసి పనిచేస్తున్నామన్నారు రేవంత్ రెడ్డి. ఒక నియంతను గద్దె దించి ప్రజా పాలన తీసుకురావాల్సిన అవసరం ఉందన్నారు. కేసీఆర్ ప్రైవేటు సైన్యంపై అధికారంలోకి వొచ్చాక చర్యలు తీసుకుంటామన్నారు.
టెలిఫోన్ ట్యాపింగ్‌తో పాటు హ్యాకర్స్‌ను ఉపయోగించి తమ ఫోన్‌లు హ్యాక్ చేస్తున్నారని ఆరోపించారు. కాంగ్రెస్‌ను నియంత్రించాలని కేటీఆర్, కేసీఆర్ ప్రయత్నిస్తున్నారన్నారు. అందరి ఫోన్ లు ట్యాప్ చేస్తున్నారు. ప్రైవేట్ సైన్యం ని తయారు చేసుకున్నారు. హ్యాకర్స్ ని కూడా ఎంగేజ్ చేశారు కేటీఆర్. మా ఫోన్ లు హ్యాకింగ్ చేస్తున్నారు. మమ్మల్ని నియంత్రించాలని చూస్తున్నారు. మాకు సహకరించాలి అనుకున్న వారిని బెదిరిస్తున్నారు. మా బంధువులు.. మిత్రులను కూడా బెదిరిస్తున్నారు కేటీఆర్. తాము ఫోన్‌లో ప్రైవేటుగా మాట్లాడుకున్న సంభాషణలను హ్యాక్ చేసి వింటున్నారని మండిపడ్డారు.
ఈ పద్దతి మంచిది కాదు. కేటీఆర్..వ్యాపారులను బెదిరిస్తున్నాడు. హరీష్..కేటీఆర్..కేసీఆర్.. అనైతికంగా వ్యవహారం చేస్తున్నారు. కేసీఆర్ సైన్యంలో పని చేస్తున్న అధికారులపై విచారణ చేస్తాం. అధికారం లోకి రాగానే అన్నింటిపై విచారణ ఉంటుందని రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు.
ఎంఐఎం అధినేతకు రేవంత్ రెడ్డి స్ట్రాంగ్ కౌంటర్
ఎంఐఎం అధినేతకు రేవంత్ రెడ్డి స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. నరేంద్ర మోదీ కోసం బండి సంజయ్, కిషన్ రెడ్డి కంటే అసద్ ఎక్కువగా కష్టపడుతున్నాడని ఎద్దేవా చేశారు. నరేంద్ర మోదీ ప్రధాని అయితే కేసీఆర్ పరిస్థితులు అనుకూలంగా ఉంటాయని అసద్ భావిస్తున్నారన్నారు. బీజేపీతో ఒప్పందంలో భాగంగా కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీకి పడే సెక్యులర్, మైనార్టీల ఓట్లను చీల్చడానికి జేడీఎస్, ఎంఐఎం కలిసి పని చేస్తున్నాయని ఎన్నికల తర్వాత జేడీఎస్ కలిసి పోతాయని గతంలో మేము చెప్పామన్నారు. విమర్శించారు. జేడీఎస్, ఎంఐఎం కుట్రలు చేసి తిరిగి బీజేపీ ప్రభుత్వం ఏర్పడాలని ఆరోపించారు. కానీ మైనార్టీల్లో 80 శాతం మంది కాంగ్రెస్ పార్టీకి అండగా నిలిచారన్నారు. ఇప్పుడు మేము చెప్పినట్లే జేడీఎస్ బీజేపీతో పొత్తు పెట్టుకొని పార్లమెంట్ ఎన్నికలకు సిద్ధమవుతుందని రేవంత్ రెడ్డి అన్నారు. కర్ణాటక ఫలితాల ప్రభావం ఇక్కడ కూడా ఉందని తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం రాకుండా ఎంఐఎం, బీఆర్‌ఎస్ కుట్ర చేస్తున్నాయని రేవంత్ రెడ్డి ఆరోపించారు.
తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే పార్లమెంట్ ఎన్నికల్లో ఇక్కడ 16 సీట్లు గెలిస్తే కేంద్రంలో మోదీకి ఇబ్బందని అసద్ భావిస్తున్నారని ఆరోపించారు. మైనార్టీ సోదరులు ఈ విషయాన్ని గుర్తు పెట్టుకోవాలన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు గౌలిగూడ నుంచి ఫలక్ నుమా వరకు, ఫలక్ నుమా నుంచి ఎయిపోర్ట్ వరకు మెట్రో మంజూరు చేసింది కానీ అ ప్రతిపాదన కార్యరూపం దాల్చడం లేదన్నారు రేవంత్ రెడ్డి. కారు స్టీరింగ్ ఎంఐఎం చేతిలోనే ఉంది కదా మరీ ఆ ప్రాజెక్టును ఎందుకు అమలు చేయించడం లేదని ప్రశ్నించారు.
హైదరాబాద్ లో లక్ష డబుల్ బెడ్రూమ్ ఇళ్లు ఇచ్చామని గొప్ప చెప్పుకుంటున్నారని, అందులో మైనార్టీలకు ఎన్ని ఇళ్లు ఇచ్చారో స్పష్టం చేయాలని డిమాండ్ చేశారు. మైనార్టీలో పేదలు లేరా అని రేవంత్ రెడ్డి ప్రశ్నించారు. లక్ష ఇళ్లలో 12 శాతం అంటే 12 వేలు కాదు కదా 120 ఇళ్లు కూడా ఇవ్వలేదని విమర్శించారు. జూబ్లీహిల్స్ మైనార్టీకి ఇస్తే ఎంఐఎం ఓర్వడం లేదన్నారు. మైనార్టీ సెల్ చైర్మన్ తో రాజీనామా చేయించి ఆనందం పొందుతుందని విమర్శించారు. హైదరాబాద్ లో లక్ష బెడ్రూమ్ ఇళ్లు ఇచ్చామని గొప్ప చెప్పుకుంటున్నారని అందులో మైనార్టీలకు ఎన్ని ఇళ్లు ఇచ్చారో స్పష్టం చేయాలని డిమాండ్ చేశారు. మైనార్టీలో పేదలు లేరా అని రేవంత్ రెడ్డి ప్రశ్నించారు. బీఆర్‌ఎస్ ఓట్లేయమని అడిగే ముందు మైనార్టీలకు ఇచ్చిన హామీలు ఎందుకు నేరవేర్చలేదో కేసీఆర్ ను ప్రశ్నించాలని అసద్ ను రేవంత్ రెడ్డి డిమాండ్ చేశారు. పదేళ్లుగా 12 శాతం రిజర్వేషన్లు, అంతర్జాతీయ ప్రమాణాలతో ఇస్లామిక్ స్టడీ సెంటర్, వక్ఫ్ బోర్డుకు జ్యూడీషియల్ హోదా వంటి హామీలను ఎందుకు నేరవేర్చలేదని కేసీఆర్ ను ఎందుకు ప్రశ్నించడం లేదన్నారు రేవంత్ రెడ్డి.