- 119 నియోజకవర్గాలకు 9 వేల శక్తి కేంద్రాలు
- ప్రతి శక్తి కేంద్రానికి ఒక ప్రముఖ్
- గ్రామాల్లో ప్రతి వీధి కాషాయమయం
- పండుగ తరవాత పార్టీలో ‘క్రాంతి..’
ప్రజాతంత్ర డెస్క్, జనవరి 14 : తెలంగాణ నేల పైన ఎట్టి పరిస్థితిలో కాషాయ జండాను ఎగురవేసే లక్ష్యంగా భారతీయ జనతాపార్టీ పకడ్బందీ వ్యూహ రచన చేస్తుంది. మిషన్ 90 లక్ష్యంగా అడుగులు వేస్తుంది. రాష్ట్రంలోని 119 స్థానాల్లో కనీసం 90 స్థానాలను గెలుచుకునేందుకు వ్యూహాత్మకంగా పావులు కదుపుతుంది. ప్రతీ చిన్న గ్రామంలో ప్రతీ వోటరును కలుసుకునే విధంగా ప్రణాళికను రూపొందిస్తుంది. వాస్తవంగా తెలంగాణ గ్రామాల్లో బిజెపికి పెద్దగా ఆదరణ లేదు. ఆ పార్టీ కేవలం పట్టణాలకే పరిమితమయిందన్న వాదన చాలాకాలంగా ఉంది. దాన్ని తుడిచివేసే దిశగా రెండంచల వ్యూహంతో ఇప్పుడా పార్టీ ప్రజల్లోకి చొచ్చుకుపోయేందుకు కార్యాచరణను రూపొందిస్తుంది. ముఖ్యంగా సంస్థాగతంగా పార్టీని బలోపేతం చేసుకోవడం ఒకటి కాగా అధికార పార్టీ వైఫల్యాలను ఎత్తిచూపడం ద్వారా ప్రజలకు చేరువ కావాలన్న లక్ష్యంగా అడుగులు వేస్తుంది. అందుకు సంక్రాంతి నుండి క్రాంతిని తీసుకువచ్చే దిశగా సిద్దపడుతుంది.
సంక్రాంతి పండుగ మరుసటి రోజు నుండే అంటే పదహారవ తేదీ నుండి వరుసగా పార్టీ పరమైన కార్యక్రమాలతో కార్యకర్తలు, నాయకుల్లో ఉత్సాహాన్ని నింపే ప్రయత్నం చేస్తుంది. 16,17తేదీల్లో దిల్లీలో పార్టీ జాతీయ కార్యవర్గ సమావేశాల అనంతరం, రాష్ట్ర కార్యవర్గ సమావేశాన్ని 24వ తేదీన నిర్వహించేందుకు ఏర్పాట్లుచేస్తుంది. అదే వరుసలో జిల్లా కార్యవర్గ సమావేశాలను కూడా ఏర్పాటు చేస్తుంది. వీటన్నిటి తర్వాత వొచ్చే నెల అంటే ఫిబ్రవరిలో రాష్ట్రమంతటా వేలాది సభలను నిర్వహించేందుకు రంగం సిద్ధం చేస్తుంది. ఈ సభలను విజయవంతం చేసేందుకు క్రిందిస్థాయిలో నాయకులను తయారు చేసే పక్రియ చేపట్టనుంది. గ్రామస్థాయిలో వోటు చెదరకుండా ఉండేందుకు ఏర్పాటు చేసే బూత్ కమిటీలను పటిష్టపర్చేందుకు శక్తి కేంద్రాలను ఏర్పాటు చేస్తుంది. ప్రతీ యాభై ఆరు బూత్ కమిటీలకు ఒక శక్తి కేంద్రం ఉండేలా చర్యలు తీసుకుంటున్నారు. అలా రాష్ట్రంలోని 119 నియోజకవర్గాలకు సంబంధించి తొమ్మిది వేల శక్తి కేంద్రాల నిర్మాణం జరుగుతుంది. ప్రతీ శక్తి కేంద్రానికి ఒక ప్రముఖ్‌ను ఏర్పాటు చేస్తారు. అతని పర్యవేక్షణలో బూత్‌స్థాయి మానిటరింగ్ జరుగుతుందన్నమాట. అంటే ఏ ఒక్క గ్రామంగాని, గ్రామంలోని ప్రతి వీధి కాషాయమయం అవుతుందన్నమాట. దీనివల్ల బిజెపి అంటే కేవలం పట్టణాలకే పరిమితమన్న పాతమాటను ఆ పార్టీ ఈ ఎన్నికల ద్వారా తుడిచేవేయదలుచుకున్నదన్నది స్పష్టమవుతున్నది.
దీనికి తోడు చేరికల కమిటి ఒకటి ఉండనే ఉంది. వివిధ రాజకీయపార్టీల్లో అసంతృప్తులను అహ్వానించే పక్రియ ఒకటి నిరంతరం కొనసాగుతూనే ఉంటుంది. ఇప్పటికే కాంగ్రెస్, బిఆర్‌ఎస్‌లో అసంతృప్తులు కొందరు కాషాయ కండువ కప్పుకున్న విషయం తెలియందికాదు. తాజాగా కాంగ్రెస్ నుండి కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి లాంటి వారిని ఆకర్షించినట్లుగానే, బిఆర్‌ఎస్ నుండి మరికొందరికి రెడ్ కార్పెట్ పరచడానికి ఆ పార్టీ సిద్దంగా ఉంది. బిఆర్‌ఎస్‌లోని ఖమ్మం రాజకీయ అనిశ్చిత ఆ పార్టీకి కలిసి వొచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇప్పటికే ఆ పార్టీ సీనియర్ నాయకుడు పొంగులేటి శ్రీనివాసరెడ్డి త్వరలో కాషాయ కండువ కప్పుకోనున్నట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి. వాస్తవంగా ఈ నెల 19న ప్రధాని మోదీ తెలంగాణకు రావల్సి ఉండింది. ఆయన సమక్షంలోనే శ్రీనివాసరెడ్డి బిజెపిలో చేరుతారన్న టాక్ ఉంది. అనుకోకుండా మోదీ పర్యటన వాయిదాపడడంతో ప్రస్తుతానికి పొంగులేటి చేరిక నిలిచిపోయింది.
ఇదిలా ఉంటే బిఆర్‌ఎస్‌ను గద్దె దించేందుకు చేపడుతున్న ఎత్తుగడల్లో భాగంగా క్యాబినెట్‌లో తెలంగాణ నుండి మరొకటికి చోటు కల్పించాలన్నది మరో ఆలోచన. కేంద్ర క్యాబినెట్‌లో చేర్పులు, మార్పులు తీసుకువస్తారంటున్నారు.
ఈసారి మార్పులు జరిగితే తెలంగాణ ప్రాంతానికి చెందిన ఒకరికి క్యాబినెట్‌లో చోటు కల్పించే అవకావాలున్నాయంటున్నారు. కిషన్‌రెడ్డికి మరో మంత్రి తోడైతే తెలంగాణలో కేంద్ర పథకాలపై విస్తృత ప్రచారం చేసుకునే అవకాశం ఉంటుందని ఆ పార్టీ భావిస్తున్నట్లు తెలుస్తున్నది. తెలంగాణ నేలపై కాషాయ జండాను ఎగురవేసే విషయంలో ఏ చిన్న అవకాశాన్ని కూడా వొదులుకోవద్దన్నది ఆ పార్టీ ఉద్దేశ్యం. అందుకు వైఎస్‌ఆర్‌టిపి, టిడిపితో కూడా పొత్తు పెట్టుకునే అవకాశాలున్నట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి.అయితే ఈ విషయాన్ని ఆ పార్టీ నేతలు కొట్టివేస్తున్నప్పటికీ ఎన్నికల సమయానికి అదే అభిప్రాయానికి రావచ్చన్నది రాజకీయ విశ్లేషకుల అంచన.