‘‘అన్యాయాన్ని ఎదిరిస్తే నా గొడవకు సంతృప్తి, అన్యాయం అంతరిస్తే నా గొడవకు ముక్తి’’
– కాళోజీ
తెలంగాణ విషయంలో మిమ్ములను ప్రభావితం చేసిన అంశమేదీ?
-కాళోజీ ధిక్కార స్వభావం నన్ను బాగా ప్రభావితం చేసింది. ఆనాడు పడ్డ బీజమే ప్రశ్నించే తత్వాన్ని, ఎదిరించే విధానాన్ని నాలో పెంచింది. వాస్తవంగా 1969 ఉద్యమ కాలంలో నేను హెచ్ఎస్సీ విద్యార్థిని. ఆనాడు జరిగిన సభలు, సమావేశాలద్వారా తెలంగాణ సమాజం పట్ల జరుగుతున్న అన్యాయంపైన అవగాహన కలిగింది. ఆనాటి సభల్లో కాళోజీ చాలా నిర్భీతిగా మాట్లాడేవాడు. అదిచూసి తెలంగాణపై జరుగుతున్న అన్యాయాలను ఎదిరించాలన్న సంకల్పం నాలో ధృడంగా ఏర్పడిరది. నాటి నుండి తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడేరకు తెలంగాణ వాదిగా పలు సమావేశాల్లో భాగస్వామినవుతూనే వొచ్చాను.
-1956లో విశాలాంధ్ర ఏర్పడిన తర్వాత ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ పాలన అంతా సీమాంధ్రుల చేతిలోకి వెళ్ళింది. ఇంకేముంది మళ్ళీ వివక్షత మొదలైంది. కాకతీయులు, ముసునూరి వంశస్తులు, దిల్ల్లీ సుల్తానులు, గోలకొండ నవాబులు ఆ తర్వాత ఆసఫ్‌జాహీల పాలన ఇలా తరతరాలుగా రాజవంశీకుల పాలనలో ఈ ప్రాంతం నలిగి పోతూనే ఉంది. దేశానికి స్వాతంత్య్రం వొచ్చినా ఈ ప్రాంతం స్వేచ్ఛావాయులు పీల్చడానికి మరో సంవత్సరకాలం పోరాడాల్సివచ్చింది. ఇంతకష్టపడి సాధించుకున్న స్యయం ప్రతిపత్తిని భాషా ప్రయుక్త రాష్ట్రాల పేర మరోసారి బంధీ అయింది. రాజకీయాల్లో, ఉద్యోగాల్లో, నీళ్ళు, నిధులు అన్నింటిలోనూ తెలంగాణకు అన్యాయం జరుగుతూ వొచ్చింది. స్థానిక ప్రజలకు స్వేచ్ఛ లేకుండాపోయింది. భాషలో, ఆచార వ్యవహారాల్లో వెక్కిరింపు ధోరణి మొదలైంది. స్వయం పాలన లేకపోవడంతో ఆత్మగౌరవానికి తీవ్ర విఘాతం ఏర్పడిరది. ఈ విషయంలో 1952నుంచీ పోరాడుతున్న కాళోజీ, ప్రొఫెసర్ జయశంకర్ లాంటి ప్రముఖుల సాన్నిహిత్యం నాకు లభించింది. వారితో కలిసి పలు సందర్భాల్లో చర్చించుకునేవాళ్ళం. దీనిపైన ఆలోచించడం మొదలు పెట్టాం. సమిష్టి ఆలోచన, ఆచరణ ఉండాలనుకున్నాం.
-జయశంకర్‌సార్ 1980`1991 మధ్య సీఫెల్ రిజిస్ట్రార్‌గా పనిచేస్తున్నప్పుడు తెలంగాణ ప్రాంతానికి జరిగిన అన్యాయాలను లెక్కలతో సహా వివరించేవాడు. ఉస్మానియా విశ్వవిద్యాలయానికి చెందిన అధ్యాపకులు శ్రీధరస్వామి, తోట ఆనందరావు, కేశవరావు జాదవ్‌లాంటి మొదటితరం ఉద్యమకారులతో కలిసి నేను కూడా చర్చల్లో పాల్గొనేవాడిని. అప్పటికే కాకతీయ విశ్వవిద్యాలయం అధ్యాపకుడిగా పనిచేస్తున్న నేను తెలంగాణ ప్రాంతానికి జరుగుతున్న అన్యాయాలను పిల్లలకు చెప్పి వారిలో చైతన్యం తీసుకువొచ్చే ప్రయత్నాలు చేస్తుండేవాడిని. వారిలో కూడా తెలంగాణ పూర్వపరాలను తెలుసుకోవాలన్న ఆసక్తి మొదలైంది. 1995 ప్రాంతంలో తెలుగుదేశం అధినేత ఎన్టీరామారావు ముఖ్యమంత్రిగా కొనసాగుతున్న రోజులవి. కాకతీయ యూనివర్శిటీలో తెలంగాణ ఉద్యమం తలెత్తుతున్న విషయాన్ని తెలుసుకున్న ముఖ్యమంత్రి దానిపై దృష్టిపెట్టాలని యూనివర్శిటీ వైస్ ఛాన్స్‌లర్‌గా వైకుంఠాన్ని పంపించారు. ఆయన మెల్లగా జయశంకర్‌సార్ అనుచర వర్గం పట్ల వివక్షత చూపించడం మొదలైంది. అంతటితో ఆగకుండా తన సామాజిక వర్గానికి ప్రాధాన్యత ఇవ్వడం ప్రారంభించాడు. అందులో భాగంగానే నన్ను వరంగల్‌లోని కాకతీయ యూనివర్శిటీ నుండి ఖమ్మం పి.జీ కళాశాలకు బదిలీ చేశాడు.
-ఖమ్మం బదలీ చేసినంత మాత్రాన నా పోరాటమేమీ ఆగలేదు. ఇవ్వాళ తెలంగాణ గాంధీగా పిలవబడుతున్న భూపతి కృష్ణమూర్తి , కాకతీయ విశ్వవిద్యాలయ అధ్యాపకుడు బియ్యాల జనార్థన్‌రావు, జయశంకర్‌సార్‌తో కలిసి కోల్‌బెల్ట్ ఏరియా మొత్తం తిరగడం ప్రారంభించాం. ఇక్కడి కార్మికవర్గం బలమైన వామపక్ష భావజాలంతో కూడుకున్నది. కొత్తగూడెం, శ్రీరాంపురం, గోదావరిఖని, మందమర్రి ప్రాంతాలకు రైళ్ళలో, బస్సుల్లో వెళ్ళి వారందరికీ తెలంగాణ ప్రాంతానికి జరిగిన అన్యాయాలను వివరించేవారం. జయశంకర్‌సార్ మాటల్లో చెప్పాలంటే తెలంగాణ పట్ల భావజాల వ్యాప్తి చేశాం. అందుకే ఉద్యమం చివరి వరకు ఆ కార్మికశక్తి ఉద్యమానికి తోడూ నీడగా నిలిచింది. వారిపై ఎన్ని వొత్తిడులు వొచ్చినా వారు తెలంగాణ పక్షాన్నే నిలబడ్డారు.
-తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడాలన్న బలమైన కాంక్షకు భోనగిరి సదస్సులో పునాది పడిరది. ఈ సదస్సును ఆర్గనైజ్ చేసిన బెల్లి లలితను ఆ తర్వాత పాలకులు ముక్కలు, ముక్కలుగా నరికారు. 1996లో జరిగిన ఈ సదస్సులో ప్రజాగాయకుడు గద్దర్, జయశంకర్‌సార్, మల్లెపల్లి లక్ష్మయ్య తదితరులు పాల్గొని తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడాల్సిన అవశ్యకతపై ఉపన్యసించారు. అదే సంవత్సరంలో సూర్యాపేటలో జనశక్తి గ్రూప్ ఆధ్వర్యంలో తెలంగాణ ఆకాంక్షపై మరో సదస్సు జరిగింది. మారోజు వీరన్న, చెరుకు సుధాకర్ తదితరులు సభను విజయవంతం చేశారు.
ఈ సదస్సుల పరిణామక్రమంలో నల్లగొండ ఫ్లోరైడ్ బాధిత ప్రజల దారుణ పరిస్థితి వెలుగులోకి వొచ్చింది. కాళ్ళు చేతులు వంకర్లుపోయి, నడుము వొంగిపోయి జీవత్సవాల్లా బతుకుతున్న అక్కడి ప్రజల హృదయవిదారక కథనాలు వెలుగు చూడడం ప్రారంభమైంది. ఫ్లోరైడ్పై దుశ్చర్ల సత్యనారాయణ జలసాధనా సమితి పేరిట అవిరామపోరాటం సాగించారు. ఫ్లోరైడ్ సమస్యను ప్రభుత్వం దృష్టికి తీసుకు వొచ్చేందుకు 1992లో 200 మందితో నల్లగొండ నుండి శ్రీశైలం వరకు దుశ్చర్ల సత్యనారాయణ పాదయాత్ర జరిపిన వ్యక్తి. 1997లో హనుమకొండలో నక్సల్స్ సానుభూతిపరుల ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ‘జనసభ’ జరిగింది. పూర్తి పోలీసు పహారా మధ్య జరిగిన ఈ సభ ‘వరంగల్ డిక్లరేషన్’ను ప్రకటించింది. విప్లవ రచయిత వరవరరావు, మాజీ విసీ సీతారామారావు, గద్దర్‌లాంటి పలువురు మేధావి వర్గం హజరైన ఈ సభ ప్రజాస్వామ్య తెలంగాణ కావాలని డిమాండ్ చేసింది.
గాదె ఇన్నయ్య రాసిన ‘దగాపడ్డ తెలంగాణ’ పుస్తకం పెద్ద సంచలనంగా మారింది. తెలంగాణకు అప్పటివరకు జరిగిన అన్యాయాలను పూసగుచ్చినట్లు ఇన్నయ్య అందులో పొందుపర్చాడు. తెలంగాణపై ఆలోచిస్తున్నవారికి అదొక పాఠ్యాంశమైంది. ఉస్మానియా విద్యార్ధులను ఆ పుస్తకం బాగా ప్రభావితం చేసింది. ఉస్మానియా కింద ఉన్న ఆరు జిల్లాల విద్యార్థులం తా తెలంగాణకోసం ఏకమైనారు. అందులో నా భాగస్వామ్యం ఉండడమే నన్ను ఖమ్మానికి బదిలీ చేయడానికి కారణంగా మారింది.
తాడూ బొంగరం లేకుండా ఎంతకాలం ఈ తెలంగాణ మదన, ఇంకా ఎంతకాలం కొట్లాడలె అంటూ అందరిలో ఒక రకమైన నైరాశ్యం మొదలైంది. అయినా ఎక్కడో ఆశ మిణుగురు పురగులా మెరుస్తూనే ఉంది. అప్పుడే తెలంగాణ టీచర్స్ ఫోరం, తెలంగాణ స్టూడెంట్ ఫోరం, తెలంగాణ గ్రాడ్యుయేట్ అసోసియేషన్లు ఏర్పడి ఎవరికి వారు తెలంగాణ రాష్ట్ర సాధనకోసం స్వంతంగా కార్యక్రమాలు చేయడం మొదలైంది. ఈ సంఘాలన్నిటికీ మార్గ నిర్దేశం చేసింది ‘అకూట్’ (అసోసియేషన్ ఆఫ్ కెయుసి టీచర్స్). నాతోపాటు పాపిరెడ్డి, అమరేందర్‌రెడ్డి, బ్రహ్మం, అర్ఎస్యూ సుదర్శనం, కరుణాకర్ (కెయుసి), ప్రోఫెసర్ క్రిష్ణారెడ్డి తదితరులు అకుట్కు సారధ్యం వహించారు. తెలంగాణపై భావజాల వ్యాప్తి కొనసాగుతున్నా ఈ విషయంలో పరిష్కార మార్గాలు కనిపించడంలేదు. రాజకీయంగా ఒక్క అడుగుకూడా ముందుకు పడటంలేదు. అది కొంత నిరాశను కలిగించింది.
ఏమైతేనేమి ఎట్టకేలకు చట్టసభలో తెలంగాణ వాయిస్ వినిపించగలిగాం. తెలంగాణ కోల్పోతున్న అస్థిత్వంపై దివంగత ప్రణయ్‌భాస్కర్‌కు వివరించడంతో ఆయన అదే విషయాన్ని మొదటిసారిగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ శాసనసభలో తెలంగాణపై మాట్లాడాడు. 1999`2000 మధ్య కాలంలో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు సమక్షంలో ఆయన తెలంగాణ ప్రాంతానికి జరుగుతున్న అన్యాయంపై గళమెత్తాడు. బోరు బావులపై ఆధారపడిన రైతాంగాన్ని ఆదుకునేందుకు వ్యవసాయ పంపుసెట్లకు ఉచిత కరెంటు ఇవ్వాలని ఆయన ప్రభుత్వానికి సూచన చేశాడు. అప్పటికే రాష్ట్రంలో తెలంగాణకు జరుగుతున్న అన్యాయాలపై ఆందోళనలు కొనసాగుతున్నాయి. కేవలం అసెంబ్లీలో మాట్లాడటమేకాదు. దానిపై ఒక లేఖనుకూడా ఆయన స్పీకర్‌కు అందజేయడమన్నది రాజకీయ చర్చకు నాంది పలికినట్లైంది. దానిపై చంద్రబాబు సీరియస్‌గా రియాక్టు అయ్యాడు. తెలంగాణ ప్రాంతంగా సంబోధించవొద్దని, ఇక నుండి దాన్ని వెనుకబడిన ప్రాంతంగానే పిలువాలని సభలోనే పేర్కొనడంతో తెలంగాణ వాదుల్లో మరింత పట్టుదల పెరిగింది.
1999లో రాష్ట్ర శాసనసభ ఎన్నికలు వొచ్చాయి. తెలంగాణను వ్యతిరేకిస్తున్న తెలుగుదేశంను ఓడిరచేందుకు కాంగ్రెస్‌ను గెలిపించాలనుకున్నాం. అందుకు తెలంగాణ రైతులకు మేలు చేయాలన్న కండీషన్ పెట్టాం. రైతులకు ఉచిత కరెంటు ఇచ్చేవిధంగా ఎన్నికల నినాదం తీసుకోవాలని కాంగ్రెస్‌పై ఒత్తిడి తీసుకురావడమైంది. తెలంగాణ ప్రాంతంలో బోరుబావుల కిందనే ఎక్కువ శాతం వ్యవసాయం జరుగుతుంది. చంద్రబాబుకాలంలో వరుసగా ఏడేళ్ళ పాటు తెలంగాణలో కరువు ఏర్పడిరది. బోర్లు వేసినా వందల ఫీట్లు తవ్వితేనే నీరు పడేది. ఒక విధంగా తెలంగాణ అంతా భూదేవికి తూట్లు పొడవటమే. ఆ విధంగా తెలంగాణలో ఆనాడు సుమారు 32 లక్షల పంపుసెట్లు ఉన్నట్లు ఒక అంచనా. అధికారంలోకి రావాలనుకున్న కాంగ్రెస్ ఎట్టకేలకు ఉచిత కరెంటు నినాదం తీసుకోవడానికి ఒప్పుకుంది. ఇంకేముంది ప్రజలు కాంగ్రెస్ మద్దతు పలికారు. ఫలితంగా 294 అసెంబ్లీ స్థానాలకు గాను 90 సీట్లను కాంగ్రెస్ గెలుచుకుంది. అప్పుడు పీసీసీ అధ్యక్షుడిగా డా.వైఎస్ రాజశేఖర్‌రెడ్డి ఉన్నారు.
రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత జయశంకర్‌సార్‌కు ఎం.పి అభ్యర్థిగా ఆఫర్ వొచ్చింది. మేమంతా ఆ అవకాశాన్ని తీసుకోవొద్దని చెప్పాం. ఎందుకంటే ఆయన ఓడిపోతే మా పోరాటానికి విఘాతం ఏర్పడుతుందని భావించాం. తెలంగాణ వాదానికి బలం లేదన్న ప్రచారం జరిగే ప్రమాదం ఉంది. జయశంకర్‌సార్ కూడా తన అయిష్టతను వ్యక్తంచేశాడు. ఎన్నికలంటే డబ్బుతో కూడుకున్నది. రాజకీయ నాయకుల్లా లక్షలు, కోట్లు గుమ్మరించే అవకాశం తనకు లేదని సున్నితంగా తిరస్కరించాడు.
– ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు తన మంత్రివర్గంకోసం ఎంఎల్ఏల పనితీరుపై విచారణ జరిపితే, అత్యంత అవినీతి పరుల్లో కెసిఆర్ పేరు మొదట ఉందట. దాంతో ఆయనకు మంత్రివర్గంలో స్థానం కల్పించకుండా డిప్యూటీ స్పీకర్ బాధ్యతలను అప్పగించారన్నది వార్త. దాంతో అలిగిన కెసిఆర్ తన ఎమ్మెల్యే పదవికి, పార్టీకి రాజీనామాచేసి, అప్పటికే రగులుతున్న తెలంగాణ నినాదాన్ని చేపట్టారు. నాతోపాటు మల్లెపల్లి లక్ష్మయ్య, గాదె ఇన్నారెడ్డి, బిఆర్ జనార్థన్‌రావు, వి.ప్రకాశ్, జయశంకర్‌సార్ లాంటి పలువురు తెలంగాణ మేధావులందరం కలిసి అనేక సార్లు సుదీర్ఘచర్చలు జరిపేవారం. కెసిఆర్ కూడా లెక్కలతో సహా దానిపైన అవగాహన పెంచుకున్నారు. ఉద్యమానికి రాజకీయ అండ కావాలను కున్న మా సంకల్పం ఆ విధంగా నెరవేరింది.
కెసిఆర్‌తో చర్చలు జరుగుతున్న సందర్భంలో ప్రత్యేక తెలంగాణ రాష్ట్రంకోసం పోరాటానికి ప్రత్యేక రాజకీయపార్టీని ఏర్పాటు చేయాలన్న నిర్ణయానికి వొచ్చాం. అందుకు 2001లో ‘ప్రిసీడియం’ను రూపొందించడమైంది. ఆంటే పార్టీ ఏర్పాటుపై చర్చించి నిర్ణయం తీసుకునే కమిటీ అన్నమాట. దానికి కెసిఆర్ చైర్మన్ గా, మాజీ ఎంపి గొట్టె భూపతి వైస్ చైర్మన్‌గా ఉన్నారు. మాజీ శాసనసభ్యుడు బండి పుల్లయ్య, దేశిని చినమల్లయ్య, మాజీ ఎంపి ఎం నారాయణరెడ్డి తదితరులు ఉన్నప్పటికీ ప్రధాన బాధ్యతలను మాత్రం ఆనాడు నాకే అప్పగించారు.
2004లో పీపుల్స్‌వార్ గ్రూప్ నక్సలైట్లతో ప్రభుత్వం చర్చలు జరిపిన అనంతరం వరవరరావును అరెస్టు చేశారు. పలువురు మావోయిస్టులను ఎన్కౌంటర్ పేరున చంపేశారు. బూటకపు ఎన్కౌంటర్లు కొనసాగుతూనే ఉన్నాయి. అప్పుడే గద్దర్, విమలక్క ఆధ్వర్యంలో ధూం ధాం మొదలైంది. టిఆర్ఎస్ పార్టీకి సమాంతరంగా మరో తెలంగాణ ఉద్యమం మొదలైంది. అదే వరుసలో తెలంగాణ ఐక్య కార్యాచరణ (ఐకాస) ఉద్యమం ప్రారంభమైంది. దానికి వరంగల్ జిల్లా కన్వీనర్ బాధ్యతలను కూడా నాకే అప్పగించారు. అంతవరకు తెలంగాణ పేరున ఉన్న వివిధ ఆర్గనైజేషన్లన్నీ దీనికింద పనిచేయడం ప్రారంభించాయి.
2005`2006 మధ్య టిఆర్ఎస్ కాంగ్రెస్‌తో పొత్తుపెట్టుకుంది. అటు కేంద్రంలో, ఇటు రాష్ట్రంలో మంత్రివర్గంలో చేరింది. గతంలో చెన్నారెడ్డిలా బదనామ్ అవుతామని చెప్పినా కెసిఆర్ వినలేదు. చివరకు వైఎస్ రాజశేఖర్‌రెడ్డి ప్రభుత్వంలోకూడా దోపిడి ఆగలేదు. అప్పుడే పులిచింతల ప్రాజెక్టును వైఎస్ శంఖుస్థాపన చేసిండు. అది ఉద్యమానికి విఘాతం కలిగించేదిగా ఉందని, కాంగ్రెస్ పొత్తును వదులకోవాలని సూచించినప్పటికీ కెసిఆర్ వినలేదు.
ఎప్పుడైతే 2009నాటి కాంగ్రెస్ ప్రభుత్వంలోని కేంద్ర హోంశాఖ మంత్రి చిదంబరం ప్రత్యేక తెలంగాణ వేర్పాటు ప్రకటనను వెనక్కు తీసుకుంటున్నట్లు ప్రకటించాడో ‘ఉస్మానియా’ ఉద్యమంలోకి ఎంటరైంది. తన ఆటపాటలతో గద్దర్ విద్యార్ధులకు అండగా నిలిచాడు. అక్కడినుంచి ఉద్యమంలో ఉస్మానియా విద్యార్ధులు ప్రధాన భూమికను పోషించారు. ధర్నాలు, రాస్తారోకోలు, ఫైరింగ్‌లతో ఉస్మానియా క్యాంపస్ అట్టుడికి పోయింది.
ఒకవైపు ప్రాణత్యాగాలు, మరోవైపు రగులుతున్న మారణహోమం. ఉద్యమకారులు ఎవరు చెప్పినా వినే పరిస్థితిలేదు. ఉద్యమం చెయ్యిదాటే పోయేపరిస్థితి ఏర్పడిరది. దానికితోడు వివిధ రాజకీయపార్టీల్లో ఉన్న తెలంగాణ నాయకుల మౌనవ్రతం. ఆంధ్రా నాయకుల రెచ్చగొట్టుడు ప్రకటనల మధ్య అంతా ఆయోమయం. చివరకు కెసిఆర్ చెప్పినా యువకులు, విద్యార్ధులు ఆగే పరిస్థితి కనిపించలేదు. అప్పటికే పౌరహక్కులపై పోరాటం చేస్తున్న ప్రొఫెసర్ కోదండరామ్‌ను ముందుకు తీసుకువొచ్చారు. తెలంగాణకోసం పోరాటం చేస్తున్న అనేక సంస్థలు, పార్టీలు, ఉద్యోగ, విద్యార్థి సంఘాలన్నిటినీ కలిపి జాయింట్ ఆక్షన్ కమిటీగా ఏర్పాటు చేశారు. ఈ పొలిటికల్ జెఏసికి కోదండరామ్ అధ్యక్షులుగా కొనసాగారు. తెలంగాణ సాకారం అయ్యేవరకు ఆయన నాయకత్వంలోనే పోరాటం జరిగింది. ఇప్పుడు ఆయన తెలంగాణ ప్రభుత్వానికి పనికిరానివాడయ్యాడనేకన్నా అవసరార్ధం వినియోగించుకున వదిలేశారనడం సమంజసంగా ఉంటుంది.
రొట్టెలు పెట్టిన సబితా ఇంద్రారెడ్డి..
ఇక్కడ ఇంకో విషయం చెప్పాలె. తెలంగాణ ఉద్యమాన్ని రాజకీయపరంగా తీసుకు వెళ్ళేందుకు అనేక ప్రయత్నాలు చేశాం. వొచ్చిన రాజకీయ నాయకులందరికీ దాని పూర్వపరాలు చెబుతూనే ఉన్నాం. సమావేశాలకు ఆహ్వానిస్తూనే ఉన్నాం. జానారెడ్డి, ఇంద్రారెడ్డిలాంటి నాయకులు కూడా దీన్ని ముందుకు తీసుకుపోవాలని ప్రయత్నించారేగాని పట్టుదలగా చేయలేకపోయారు. మాజీమంత్రి దివంగత ఇంద్రారెడ్డి కూడా మేధావులు, అభిమానులతో అనేక చర్చలు జరిపారు.
ఈ విషయంలో నేనుకూడా పలు దఫాలుగా ఆయనతో కలిసేందుకు వాళ్ళింటికి వెళ్ళేవాడిని. ఆ సందర్భంలో ఇవ్వాళ రాష్ట్ర మంత్రిగా ఉన్న సబితా ఇంద్రారెడ్డి స్వయంగా మాకు రొట్టెలు చేసి పెట్టింది. ఆ తర్వాత కెసిఆర్ ఆ నినాదాన్ని ఎత్తుకోవటం
ఆ తర్వాత జరిగిన పరిణామాలు అందరికీ తెలిసినవే.
(సమాప్తం )