నూతన సంవత్సర డైరీ, క్యాలెండర్ ఆవిష్కరించిన మంత్రి పొంగులేటి
ఖమ్మం, ప్రజాతంత్ర, ఫిబ్రవరి 1 : తెలంగాణ ఉద్యమంలో అక్షరాలను అస్త్రంగా అందించి ప్రజల పోరాటానికి బాసటగా ప్రజాతంత్ర దినపత్రిక నిలిచిందని రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అన్నారు. ఖమ్మం జిల్లాలోని తన క్యాంపు కార్యాలయంలో బుధవారం రాత్రి మంత్రి ప్రజాతంత్ర 26వ వార్షికోత్సవం సందర్భంగా నూతన సంవత్సర క్యాలెండర్, డైరీని ఆవిష్కరించారు.ఈ సందర్భంగా మంత్రి పొంగులేటి మాట్లాడుతూ తెలంగాణ తొలి దినపత్రిక ప్రజాతంత్ర ఉద్యమ సమయంలో రాష్ట్ర ఆవశ్యకతను అక్షర రూపంలో గొంతెత్తి చాటిందన్నారు. యావత్ తెలంగాణ సమాజం ఆకాంక్షను ప్రజల గొంతుకగా నలుదిశల వ్యాప్తి చెందేలా చేస్తున్న కృష్టి అభినందనీయం అన్నారు.
స్వరాష్ట్రం సిద్ధించిన అనంతరం సుపరిపాలనకు ప్రభుత్వానికి, ప్రజలకు మధ్య వారధిగా నిలుస్తుందన్నారు. డిజిటల్ మీడియా రంగాన్ని తట్టుకుని వాటికి ధీటుగా ప్రజల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకురావడంలో ఎనలేని కృషి చేస్తుందని తెలిపారు. విలేఖరుల వ్యక్తిగత అభిప్రాయాలకు చోటు ఇవ్వక ప్రజల పక్షనా పారదర్శంగా వార్తలను ప్రచురిస్తుందన్నారు. ఇదే స్ఫూర్తిని మున్ముందు కొనసాగించాలని, పత్రికారంగంలో 26 సంవత్సరాలు విజయవంతంగా పూర్తిచేసుకున్న సందర్భంగా ప్రజాతంత్ర యాజమాన్యానికి, విలేఖరులకు నూతన సంవత్సర సుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో మంత్రి పొంగులేటి ఖమ్మం క్యాంప్ కార్యాలయ ఇంచార్జ్ పొంగులేటి దయాకర్ రెడ్డి, స్టాఫ్ రిపోర్టర్ అరుణ్ కుమార్, రిపోర్టర్లు మధు, బీర రవి తదితరులు పాల్గొన్నారు.