తెలుగు పత్రికకు కొత్త ఒరవడి దిద్దిన ఎడిటర్‌

(ఫిబ్రవరి 16 – నార్ల వర్థంతి)    

కవిగా, రచయితగా, నాటకకర్తగా, విమర్శకుడుగా, అనువాదకుడుగా, పాత్రికేయునిగా అనేకులకు స్ఫూర్తి ప్రదాత. ఇంగ్లీషులో ఆలోచించి తెలుగులో రాసే మూసలో కొట్టుకుపోతున్న పాత్రికేయాన్ని ప్రజల భాషకు చేరువ చేశారు. తెలుగు పత్రికా రచనకు కొత్త గౌరవాన్ని, మర్యాదను సమకూర్చారు. ఎన్నో కొత్త పదాలు, పదబంధాలకు సృష్టికర్త ఆయన. మాండలీకాలకు పెద్దపీట వేశారు. భాషాపరమైన అంశాల్లో ప్రయోగాలు ఆయన సొత్తు. ఆయనే నార్ల వెంకటేశ్వరరావు. వీ.ఆర్‌.నార్లగా కూడా ప్రసిద్ధులు. ఇంగ్లీష్‌ పదాలకు సమానార్ధకాలు తెలియజేసేందుకు ఉపయోగించిన తిరోగమనం, ఐక్య రాజ్య సమితి, దిగ్బంధనం మొదలైన వాటిని పేర్కొనవచ్చు. సంపాదకీయాలను పత్రికకు ప్రాణదీపాలుగా మార్చడంతోపాటు, సామాజిక సంస్కరణకు వాహికలుగా ఉపయోగించారు. ప్రజలకు అర్థమయ్యే జీవభాషలో సంపాదకీయాలను రాశారు. నైజాం ప్రభుత్వం ఆంధ్రప్రభను నిషేధించినా రజాకార్ల దురాగతాలపై  ఎత్తిన కత్తి దించకుండా పోరాడిన కలం  యోధుడాయన.

నార్ల కళాభిమాని, బౌద్ధ కళల పట్ల ప్రత్యేక అభిరుచి, విదేశాలలో సేకరించిన బౌద్ధ మినీ విగ్రహాలు, కళాఖండాలు అట్టి పెట్టేవారు. మ్యూజియంలో, శిల్ప సౌందర్యాలు ప్రత్యేకంగా అధ్యయనం చేశారు. వేమనను విపరీతంగా అభిమానించిన నార్ల ఆ మహాకవి మాదిరే ఆటవెలది పద్యాలు రాసారు. మొదట ‘వాస్తవమ్ము నార్ల మాట’మకుటంతో రాసి, దానిని తర్వాత ‘నవయుగాల బాట నార్ల మాట’గా మార్చారు. . నార్ల సొంత గ్రంథాలయంలో 20 వేలకు పైగా పుస్తకాలుండేవి.

తెలుగునాట ప్రముఖ పాత్రికేయులు, రచయిత. తెలుగు పత్రికా రచనకు సరికొత్త ఒరవడిని దిద్దిన ఆయన, మూడు దశాబ్దాల పాటు ఎడిటర్‌ గా తెలుగు పత్రికా పాఠకులకు చిరపరిచితుడు. హేతువాదిగా, మానవతావాదిగా జీవించారు. సంపాదకీయాలను పత్రికకు ప్రాణదీపాలుగా మార్చడంతోపాటు, సామాజిక సంస్కరణకు వాహికలుగా వాటిని ఉపయోగించారు. ‘‘ఎడిటరైనవాడు బిడియము చూపుచో ధాటి తగ్గు వృత్తి ధర్మమందు, కడుపుకూటి రాత కక్కుర్తి రాతరా’’, అంటూ తోటి రచయితలనూ, భావి సంపాదకులనూ హెచ్చరించిన యోధుడు. పత్రికలు అనుసరించవలసిన ధర్మం ‘సత్యనిష్ఠ’అనిచెప్పారు నార్ల.

ఎడిటర్‌ అనే ఇంగ్లీషు మాటకు సంపాదకుడు అనే తెలుగు అనువాదాన్ని ఆయన ఆమోదించక, సంపాదకుడు అనే మాట ఉపయోగించేవారు  కాదు. ఎడిటర్‌ అనే రాసుకునే వారు, పిలిపించుకునేవారు. సంపాదకుడు అంటే ఏమిటో, సంపాదకుడి స్థానం ఏమిటో యాజమా న్యాలకూ, సమాజానికీ తెలియజెప్ప డానికి ఆయన శత విధాలుగా ప్రయత్నించారు.  ‘‘తెలుగులో ఆలోచించి, తెలుగు నుడికారంలో తెలుగుదనం ఉట్టిపడేటట్టు రాయగలిగినప్పుడే తెలుగు వారిలో మనం కదలిక పుట్టించగలం’’ అని తోటి జర్నలిస్టులకు ఉద్బోధించారు.

నార్ల సంపాదకీయాలు విశిష్టంగా, వివేచనాయుతంగానే కాక, చర్చనీయాంశాలుగా ఉండేవి.. నార్ల సంపాదకీయం కోసమే పత్రిక చదివే వారుండేవారన్న మాట అతిశయోక్తి కాదు. ఎడిటర్‌ బాధ్యతలను నార్ల ఆషామాషీ వ్యవహారంగా ఎన్నడూ భావించలేదు. పత్రిక తన భుక్తికి పనికి వచ్చే ఒక ఉద్యోగంగా ఆయన తీసుకోలేదు. ప్రజలచేతిలో ఆయుధంగా ఆయన పత్రికలను  భావించారు. ప్రజలపక్షాన నిలిచి పత్రికలు యుద్ధం చేయాలన్నది ఆయన అభిప్రాయం. పత్రిక ఎడిటర్‌ గా అపార విషయ పరిజ్ఞానం ఉన్న నార్ల కవిగా, నాటకకర్తగా, విమర్శకునిగా, హేతువాదిగా, మానవతావా దిగా, శాస్త్రీయ విజ్ఞాన శీలిగా ఎన్నో రచనలు చేసారు.

గోరాశాస్త్రి మాటల్లో చెప్పాలంటే ‘కేవలం సత్వగుణ ప్రధానంగా, అచ్చ తెలుగులో చప్పచప్పగా ఉన్న పత్రికా రచనలో వాడినీ, వేడినీ సృష్టించి, తెలుగు నుడికారంలో ఎంత ‘కారం’ ఉందో తెలియజెప్పినవాడు’ నార్ల. ‘స్వరాజ్య’, ‘జనవాణి’, ‘ప్రజామిత్ర’ పత్రికల్లో మెరుపులు మెరిపించి ‘ఆంధ్రప్రభ’, ‘ఆంధ్రజ్యోతి’ పత్రికల ఎడిటర్‌ బాధ్యతలను చేపట్టి వాటిని తీర్చిదిద్దారు. ‘జనవాణి’తో తాపీ ధర్మారావు ప్రారంభించిన వ్యావహారిక భాషా ఉద్యమాన్ని నార్ల ‘ఆంధ్రప్రభ’, ‘ఆంధ్రజ్యోతి’ ద్వారా సమర్థంగా కొనసాగించారు. తెలుగు పత్రికా రంగాన్ని ఆయన ఉడుకు రక్తంతో నింపి, ఎన్ని కొత్త కలాలను పరిచయం చేసారో. ఎడిటర్‌ గా పనిచేసిన ముప్ఫై మూడేళ్ల కాలంలో ఛాందస విశ్వాసాలతో రాజీలేని పోరు సాగించి, నిజంపట్ల నిబద్ధత, జనశ్రేయంపట్ల నిజాయతీ, వృత్తిపథంలో తిరుగులేని నిర్భీకతలను ప్రదర్శించిన పాత్రికేయుడిగ ప్రసిద్ధికెక్కారు.

పత్రికా రంగంలో ఆయన నేతృత్వంలొ శ్రమించిన  సభ్యులు దేనికీ ఏ వత్తిళ్ళకూ వెరవకుండా, రాబడి కోసం  రాజీపడకుండా రాజీనామాలకు అలవాటు పడిన కలం ధీరులే. ఆయన స్ఫూర్తితో పని చేసినవారు పత్రికా రంగలో ధృవతారలై వెలిగారు. ‘విరామమెరుగని రాక్షసుడు నార్ల’ అని ప్రఖ్యాత సంపాదకుడు ఖాసా సుబ్బారావు అభివర్ణించారు. ఆంధ్రప్రభ’ నుంచి వైదొలిగి సంపాదకత్వం వహించడానికి చేతిలో పత్రిక లేకుండా ఉన్న నార్ల కోసం కొందరు ముఖ్యులు పూనుకొని పెట్టిన పత్రిక ఆంధ్రజ్యోతి. ఆ పత్రిక స్థాపనకు ప్రధాన కారకుడు నార్ల. ఆంధ్రజ్యోతి యజమాని కె.ఎల్‌.ఎన్‌. ప్రసాద్‌ కు నార్లకు అభిప్రాయ భేదాలు వచ్చి ఎడిటర్‌ పదవికి. రాజీనామా చేశారు. నార్లను  ఎన్‌.టి. రామారావు సాంస్కృతిక వ్యవహారాల సలహాదారుగా నియమించారు.
1946లో మహాత్ముడు రాజగోపాలాచారిని కాంగ్రెస్‌ శాసనసభాపక్ష నేతగా ఎన్నుకోవాలని నిర్ణయించినప్పుడు- దానికి నిరసనగా నార్ల పరంపరగా సంపాదక శస్త్రాలను ప్రయోగించారు. అదేవిధంగా మహాత్ముడు చనిపోయినప్పుడు ఆయన రాసిన సంపాదకీయం ఆంధ్రదేశాన్ని కుదిపింది. 1954లో ఎం.ఎన్‌. రాయ్‌ చనిపోయినప్పుడు దేశంలో అన్ని పత్రికలు సంపాదకీయాలు రాసినా, నార్ల మాత్రం రాయలేదు. ఆ తరువాత రాయ్‌ రచనలను, పుస్తకాలను తెప్పించుకుని అధ్యయనం చేసి ఆయన పంథా మార్చుకున్నారు. వేటూరి ప్రభాకరశాస్త్రి స్థాయి వ్యక్తి వారికి సాష్టాంగ నమస్కారం’ అన్నారు.  టంగుటూరి ప్రకాశం, నీలం సంజీవరెడ్డి, కళా వెంకటరావు, కాసు బ్రహ్మానంద రెడ్డి, ఎన్‌.జి. రంగా ఆయన కలానికి గురైన వారే. ఇందిరాగాంధిని, కుటుంబ వారసత్వ రాజకీయాల్ని తీవ్రంగా విమర్శించేవారు. పౌరహక్కులు, మానవ విలువలు కావాలనేవారు. జయప్రకాశ్‌ నారాయణను మెచ్చుకునేవారు.  మధ్యప్రదేశ్‌ లోని జబల్‌పూర్‌లో డిసెంబర్‌ 1, 1908న జన్మించిన నార్ల, 1985 ఫిబ్రవరి 16న కలం మూసేసి శాశ్వత నిద్రలోకి జారుకున్నారు. ఎడిటర్‌ నార్ల వర్థంతి ఈ రోజు నాలుగో దశకంలోకి ప్రవేశిస్తున్నది.

-నందిరాజు రాధాకృష్ణ.
వెటరన్‌ జర్నలిస్ట్‌ : 98481 28215

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page