ముషీరాబాద్, ప్రజాతంత్ర, సెప్టెంబర్ 15 : రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో దళిత ముఖ్యమంత్రే తమ ఏజెండాగా ముందుకెళ్తామని రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా(అథావలె) జాతీయ కార్యనిర్వాహక అధ్యక్షులు డాక్టర్ ఎం.వెంకటస్వామి అన్నారు. బషీర్ బాగ్ ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఎం.వెంకటస్వామి మాట్లాడుతూ తమ పార్టీ జాతీయ అధ్యక్షులు, కేంద్ర సామాజిక న్యాయ శాఖ సహాయ మంత్రి రాందాస్ అథావలె పిలుపు మేరకు హైదరాబాద్ లోని పరేడ్ గ్రౌండ్ లో అక్టోబర్ 3వ తేదీన ఉదయం 11 గంటలకు పార్టీ 67వ ఆవిర్భావ సభతో పాటు 50 వేల మందితో భారీ బహిరంగ సభను నిర్వహించనున్నట్లు ఆయన తెలిపారు. రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో తెలంగాణలోని 119 అసెంబ్లీ స్థానాల నుంచి పోటీ చేయనున్నట్లు తెలిపారు. దళిత బహుజనులంతా ఏకమై రాబోవు ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ అధినేత, సీఎం కేసీఆర్ ను ఓడిస్తామని హెచ్చరించారు. రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్.అంబేద్కర్ ఆశయాలను ముందుకు తీసుకెళుతున్న ఏకైక పార్టీ రిపబ్లికన్ పార్టీ అని అన్నారు. దళితుడిని రాష్ట్ర ముఖ్యమంత్రిగా చేయడమే తమ పార్టీ ఏకైక లక్ష్యమన్నారు. తెలంగాణలో పార్టీ బలోపేతం చేయడానికి నిర్వహించే ఈ భారీ బహిరంగ సభలో పార్టీ విధి, విధానాలు, రాబోయే అసెంబ్లీ ఎన్నికలకు అభ్యర్థులను ఖరారు చేస్తామన్నారు. అక్టోబర్ 3న నిర్వహించే భారీ బహిరంగ సభకు పార్టీ జాతీయ అధ్యక్షులు, కేంద్ర మంత్రి రాందాస్ అథావలె పాల్గొంటారన్నారు. ఈ బహిరంగ సభకు 33 జిల్లాల నుంచి కార్యకర్తలు, బడుగు బలహీన వర్గాల ప్రజలు పెద్ద ఎత్తున తరలివచ్చి విజయవంతం చేయాలని ఆయన కోరారు. ఈ సమావేశంలో పార్టీ రాష్ట్ర అధ్యక్షులు పసుల రవికుమార్, కార్యనిర్వాహక అధ్యక్షులు ఐరేణి శ్రవణ్ కుమార్, ఉపాధ్యక్షుడు చంద్రశేఖర్, కార్యదర్శి శివరాజ్, మహిళా విభాగం అధ్యక్షురాలు స్నేహలత తదితరులు పాల్గొన్నారు.