ఆమనగల్లు, ప్రజాతంత్ర అక్టోబర్ 7 : ఫ్రెండ్లీ పోలీసింగ్, శాంతి భద్రతలే లక్ష్యంగా తెలంగాణ పోలీసులు సేవలందించి దేశంలోనే నెంబర్ వన్ గా నిలుస్తున్నారని తెలంగాణ రాష్ట్ర హోం మంత్రి మహమూద్ అలీ అన్నారు. రంగారెడ్డి జిల్లా లోని కల్వకుర్తి నియోజకవర్గ పరిధిలో కడ్తాల్ మండలం లో నూతనంగా నిర్మించిన అత్యాధునిక పోలీస్ స్టేషన్ భవనాన్ని శనివారం తెలంగాణ రాష్ట్ర హోంశాఖ మంత్రి మహమూద్ అలీ, డీజీపీ అంజనీ కుమార్, ఐపీఎస్., సైబరాబాద్ పోలీస్ కమీషనర్ స్టీఫెన్ రవీంద్ర, ఐపీఎస్., నాగర్ కర్నూల్ ఎంపీ శ్రీరాములు, కల్వకుర్తి ఎమ్మెల్యే జైపాల్ యాదవ్ తదితరులతో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో హోం మంత్రి మాట్లాడుతూ.. రాష్ట్రంలో ప్రజల ధన, మాన, ప్రాణాల రక్షణలో విధి నిర్వహణలో తెలంగాణ పోలీస్ శాఖ దేశానికే ఆదర్శంగా నిలిచిందని తెలంగాణ రాష్ట్ర హోంశాఖ మంత్రి శ్రీ మహమూద్ అలీ అన్నారు. ప్రజల ఆస్తులను మానాలను ప్రాణాలను కాపాడడంలో తెలంగాణ పోలీస్ శాఖ కీలకపాత్ర పోషిస్తుందన్నారు. ఫ్రూటీన్ బటర్ఫ్లై సిటీ సహకారంతో సుమారు 9000 గజాల స్థలంలో రూ.2 కోట్ల వ్యయంతో కడ్తాల్ లో నూతనంగా నిర్మించిన పోలీస్ స్టేషన్ భవనాన్ని ఈరోజు ప్రారంభించడం చాలా సంతోషంగా ఉందన్నారు. కడ్తాల్ పోలీస్ స్టేషన్ లో ఆధునిక సాంకేతిక సాంకేతికతను వినియోగించుకొని కేసుల సత్వర పరిష్కారానికి ప్రత్యేక చర్యలు చేపట్టడం జరిగిందన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడక ముందు ఉన్న పోలీస్ వ్యవస్థకు, ఇప్పుడున్న పోలీస్ వ్యవస్థకు చాలా వ్యత్యాసం ఉందన్నారు. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు తెలంగాణ పోలీస్ వ్యవస్థను ప్రక్షాళన చేసి దేశానికే ఆదర్శంగా తీర్చేదిద్దారన్నారు. తెలంగాణ పోలీస్ శాఖకు భారీ బడ్జెట్ ను కేటాయిస్తూ మౌలిక సదుపాయాలకు తెలంగాణ ప్రభుత్వం పెద్దపీట వేసిందన్నారు. పోలీసులు తీసుకుంటున్న చర్యలతో ప్రజల మనసులలో భద్రతాభావం ఏర్పడిందన్నారు.ఫ్రెండ్లీ పోలీస్ వ్యవస్థ, శాంతి భద్రతలే లక్ష్యంగా తెలంగాణ పోలీస్ ముందు స్థాయిలో ఉందని కితాబు ఇచ్చారు. ఎక్కడైతే శాంతిభద్రతలు బాగుంటాయో అక్కడికే పెట్టుబడులు ఎక్కువగా వస్తాయని తద్వారా ఉద్యోగ కల్పన జరుగుతుందన్నారు. శాంతిభద్రతలను కాపాడడంలో ప్రభుత్వం కృత నిశ్చయంతో ఉందన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత మెరుగైన పోలిసింగ్ కోసం ప్రభుత్వం పోలీస్ శాఖకు పోలీసు భవనాలు, వాహనాలు, మ్యాన్ పవర్, వెల్ఫేర్ తదితర సహాయసహకారాలు అందిస్తుందన్నారు. రాష్ట్రంలో ఐటీ, సైబర్ నేరాలను అరికడుతున్నట్టు తెలిపారు. మహిళల, యువతుల భద్రత కోసం షీ టీంలు భరోసా సెంటర్లు ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. దేశంలో ఎక్కడాలేని భద్రత మన తెలంగాణ రాష్ట్రంలో మాత్రమే కొనసాగుతుందన్నారు.అనంతరం తెలంగాణ రాష్ట్ర డిజిపి అంజనీ కుమార్ మాట్లాడుతూ.. ప్రభుత్వం ప్రజల శాంతిభద్రతలను కాపాడడంలో కృత నిశ్చయంతో ఉందన్నారు. ముఖ్యంగా మహిళల భద్రత కొరకు టాప్ ప్రయారిటీ ఇచ్చిందన్నారు. అధునాతన పోలీస్ భవనంలో అన్ని రకాల సదుపాయాలు ఉన్నాయన్నారు. అనంతరం నాగర్ కర్నూల్ ఎంపీ శ్రీరాములు మాట్లాడుతూ… కడ్తాల్ లో ఆధునిక సదుపాయాలతో నూతన పోలీస్ స్టేషన్ భవనాన్ని నిర్మించడం చాలా సంతోషంగా ఉందన్నారు. రాష్ట్రంలో శాంతి భద్రతల పరిరక్షణ కోసం అనేక విప్లవాత్మక చర్యలు చేపట్టినట్లు తెలిపారు. శాంతిభద్రతలను కాపాడడంలో రాష్ట్ర పోలీసులు ముందంజలో ఉన్నారన్నారు. కల్వకుర్తి ఎమ్మెల్యే జైపాల్ యాదవ్ మాట్లాడుతూ… రాష్ట్ర ముఖ్యమంత్రి కెసిఆర్ కృషితో రాష్ట్రంలో శాంతి భద్రతల పరిరక్షణకు పోలీసు శాఖ నడుం బిగించిందని పేర్కొన్నారు. దేశంలో ఎక్కడాలేని భద్రత మన తెలంగాణ రాష్ట్రంలో మాత్రమే కొనసాగుతుందన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత మెరుగైన పోలిసింగ్ కోసం ప్రభుత్వం పోలీస్ శాఖకు అన్ని రకాల సహాయసహకారాలు అందిస్తుందన్నారు. సిసిటీవీ కెమెరాలు ఏర్పాటు చేయడంలో నేరాలను నియంత్రించడంలో తెలంగాణ పోలీసులు పూర్తిగా విజయవంతమయ్యారన్నారు.అనంతరం కడ్తాల్ పోలీస్ స్టేషన్ నిర్మాణానికి సహాయ సహకారాలందించిన ఫ్రూటీన్ బటర్ఫ్లై సిటీ మేనేజింగ్ డైరెక్టర్ అండ్ ఛైర్మన్ బి. శేషగిరి రావును హోంమంత్రి మహమూద్ అలీ సత్కరించారు. ఈ కార్యక్రమంలో శంషాబాద్ డిసిపి నారాయణరెడ్డి, ఏ డి సి పి రామ్ కుమార్, షాద్ నగర్ ఏసిపి రంగస్వామి, సిఐలు వెంకటేశ్వర్లు, శివప్రసాద్, ఎస్ఐలు హరిశంకర్, బలరాం నాయక్, శ్రీను బటర్ఫ్లై ఈడి రమేష్, జడ్పిటిసి జర్పుల దశరథ్ నాయక్, వైస్ ఎంపీపీ ఆనంద్, చైర్మన్ వెంకటేష్ గుప్తా, సర్పంచ్ లక్ష్మీనరసింహారెడ్డి, ఉప సర్పంచ్ రామకృష్ణ, ఎంపీటీసీ గూడూరు శ్రీనివాస్ రెడ్డి, కోఆప్షన్ మెంబర్ జాంగిర్ బాబా, తాహసిల్దార్ షేక్ ముంతాజ్, తదితరుల పాల్గొన్నారు.