దేశంలో పెరుగుతున్న కొరోనా కేసులు

46 రోజుల తరువాత 3 వేలు దాటిన పాజిటివ్‌ల సంఖ్య
అప్రమత్తం అయిన రాష్ట్రాలు…మాస్కులు తప్పనిసరి చేస్తూ ఆదేశాలు

న్యూ దిల్లీ, ఏప్రిల్‌ 28 : ‌దేశంలో కొరోనా కేసుల సంఖ్య రోజురోజుకూ పెరుగుతున్నది. తాజాగా 24 గంటల్లో 3,303 కేసులు నమోదు కావడంతో 46 రోజుల తరువాత మొదటిసారిగా పాజిటివ్‌ల సంఖ్య 3 వేలు దాటింది. దీంతో మొత్తం కేసుల సంఖ్య 4,30,68,799కి చేరుకోగా తాజాగా మహమ్మారితో 39 మంది మృత్యువాత పడడంతో ఇప్పటివరకు మొత్తం మరణాల సంఖ్య 5,23,693కు చేరుకుందని కేంద్ర ఆరోగ్య శాఖ బులెటిన్‌లో పేర్కొంది. యాక్టివ్‌ ‌కేసుల సంఖ్య 16,980కి చేరుకోగా ఇప్పటివరకూ నమోదయిన మొత్తం కేసులతో పోలిస్తే 0.04 శాతానికి చేరుకుంది. కాగా కోవిడ్‌ ‌నుంచి కోలుకున్న వారి రేటు 98.74 శాతంగా నమోదయింది.

అప్రమత్తం అయిన రాష్ట్రాలు… మాస్కులు తప్పనిసరి చేస్తూ ఆదేశాలు
కోవిడ్‌-19 ‌కేసుల సంఖ్య రోజురోజుకూ పెరుగుతుండటంతో పలు రాష్ట్రాలు మరోసారి బహిరంగ ప్రదేశాల్లో మాస్క్‌ని తప్పనిసరి చేశాయి. దిల్లీ, ఉత్తరప్రదేశ్‌, ‌హర్యానా, కేరళ, ఇతర రాష్ట్రాల ప్రభుత్వాలు మాస్కు ధరించాలనే ఆదేశాలను తిరిగి తీసుకువచ్చాయి. దిల్లీలో మాస్క్ ‌తప్పనిసరి చేస్తూ దిల్లీ డిజాస్టర్‌ ‌మేనేజ్‌మెంట్‌ అథారిటీ ఆదేశాలు జారీ చేసింది. నిబంధనలు ఉల్లంఘించిన వారికి రూ.500 జరిమానా చెల్లించాల్సి ఉంటుందని డీడీఎంఏ తెలిపింది. కోవిడ్‌ ‌కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ఉత్తరప్రదేశ్‌ ‌ప్రభుత్వం రాజధాని లక్నో, ఆరు ఎన్‌సిఆర్‌ ‌జిల్లాల్లోని బహిరంగ ప్రదేశాల్లో ప్రజలు ఫేస్‌ ‌మాస్క్ ‌ధరించడాన్ని తప్పనిసరి చేసింది. హర్యానా ప్రభుత్వం జాతీయ రాజధాని ప్రాంతంలోని నాలుగు జిల్లాల్లో ముఖానికి మాస్క్ ‌ధరించడం తప్పనిసరి చేసింది.

పంజాబ్‌ ‌ప్రభుత్వం కూడా బహిరంగ ప్రదేశాల్లో మాస్కులు ధరించడం తప్పనిసరి చేసింది. కర్నాటక ప్రభుత్వం ఫేస్‌ ‌మాస్క్‌లు ధరించడం, సామాజిక దూరాన్ని కొనసాగించడం తప్పనిసరి చేస్తూ మార్గదర్శకాలు జారీ చేసింది. తమిళనాడు ప్రభుత్వం రాష్ట్రంలో మాస్కులు ధరించడం తప్పనిసరి చేసింది. కేరళ ప్రభుత్వం కూడా రాష్ట్రంలో మాస్క్‌లను తప్పనిసరి చేసింది. అన్ని బహిరంగ ప్రదేశాల్లో ఫేస్‌ ‌మాస్క్‌లను తప్పనిసరి చేస్తూ కేరళ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. గోవా రాష్ట్రంలో తాజాగా కొరోనా కేసుల సంఖ్య పెరుగుతుండటంతో తాజాగా ప్రజలు మాస్కులు ధరించాలని గోవా సర్కారు ఆదేశాలు జారీ చేసింది. ఛత్తీస్‌ ‌ఘడ్‌, ‌ఛండీఘడ్‌, ‌తెలంగాణ, మహారాష్ట్రలలోనూ మాస్కు తప్పనిసరిగా ధరించాలని ఆయా రాష్ట్ర ఆరోగ్య శాఖల అధికారులు సూచించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page