- డా. బిఆర్ అంబేద్కర్ అతిపెద్ద విగ్రహాన్ని ఆవిష్కరించిన కెసిఆర్
- ప్రత్యేక అతిథిగా హాజరైన బాబాసాహెబ్ మనవడు ప్రకాశ్ అంబేద్కర్
- హాజరైన స్పీకర్, చైర్మన్, మంత్రులు, ప్రజాప్రతినిధులు, వేలాదిగా ప్రజలు
హైదరాబాద్, ప్రజాతంత్ర, ఏప్రిల్ 14 : ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు దార్శనికతతో, దేశ చరిత్రలో తెలంగాణ రాష్ట్రం మరో నూతనాధ్యాయాన్ని లిఖించింది. ప్రపంచంలోనే పప్రథమంగా బాబాసాహెబ్ డా. బిఆర్ అంబేద్కర్ 125 అడుగుల మహా విగ్రహాన్ని అంబేద్కర్ జయంతి సందర్భంగా శుక్రవారం హైదరాబాద్‌లో సిఎం కేసీఆర్ ఆవిష్కరించారు. తద్వారా తెలంగాణ ఆదర్శంగా భారత దేశంలో వొక నవ శకం ప్రారంభమైంది. వివక్షకు గురవుతూ తర తరాలుగా విస్మరించబడుతూ వస్తున్న దళిత తదితర వర్గాల పట్ల ఈ దేశ పాలకులు అనుసరించాల్సిన విధానాలకు అసలు సిసలు భాష్యం చెప్తూ అంబేద్కర్ సాక్షిగా తెలంగాణ వేదికైంది. అంబేద్కర్ మహా విగ్రహావిష్కరణ కార్యక్రమానికి గౌరవ అతిథిగా హాజరైన, బాబాసాహెబ్ మనుమడు మాజీ లోక్ సభ సభ్యుడు ప్రకాశ్ అంబేద్కర్‌ను తోడ్కొని ప్రగతి భవన్ నుంచి మధ్యాహ్నం 3.15కు బయలు దేరిన సిఎం కేసీఆర్ నేరుగా హుసేన్ సాగర్ పక్కనే ఆవిష్కరణకు సిద్దమైన అంబేద్కర్ మహా విగ్రహం చెంతకు చేరుకున్నారు. అక్కడ బౌద్ధ బిక్షువులు వారి సాంప్రదాయ పద్దతిలో ప్రార్థనలు చేస్తూ సిఎం కేసీఆర్ కేసీఆర్‌కు ఆహ్వానం పలికారు.
అక్కడే ఏర్పాటు చేసిన వేదక మీదికి చేరుకుని అంబేద్కర్ మహా విగ్రహాన్ని దర్శించారు. ఈ సందర్భంగా ప్రత్యేకంగా అంబేద్కర్ విగ్రహాన్ని తీర్చిదిద్దిన తీరు గురించి ఆరా తీసారు. విగ్రహావిష్కరణ ఏర్పాట్ల తీరు పట్ల సంతృప్తి వ్యక్తం చేసిన సిఎం మంత్రి ప్రశాంత్ రెడ్డిని, కొప్పుల ఈశ్వర్ ను ఈ సందర్భంగా అభినందించారు. అనంతరం.. నిర్ణీత సమయానికి ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన హెలికాప్టర్ ద్వారా గులాబీ రేకులు పూలవానై కురుస్తండగా జై భీమ్ అంటూ నినాదాలు చేస్తూ బాబాసాహెబ్ అంబేద్కర్ కు సిఎం ఘన నివాళులు అర్పించారు. సంతోషంతో కరతాళధ్వనులు చేశారు. అనంతరం అంబేద్కర్ విగ్రహాన్ని నిలబెట్టిన బేస్ భవనాన్ని ప్రకాశ్ అంబేద్కర్ చేతులమీదుగా సిఎం ఆవిష్కరింప చేశారు. అనంతరం విగ్రహ వేదిక మీదకు చేరుకుని అక్కడ ఏర్పాటు చేసిన అంబేద్కర్ పాలరాతి స్థూపానికి బౌద్ధ సాంప్రదాయంలో భిక్షువులు ప్రార్థనలు చేశారు. అక్కడ నిర్వహించిన ప్రత్యేక ప్రార్థనలల్లో సిఎం కేసీఆర్ పాల్గొన్నారు. అనంతరం..బేస్ భవనంలో ఏర్పాటు చేసిన డా బిఆర్ అంబేద్కర్ ఫోటో ఎగ్జిబిషన్‌ను మంత్రులు ప్రజాప్రతినిధులు సిఎస్ సహా ప్రభుత్వ ఉన్నతాధికారులు వెంటరాగా సిఎం ఆసక్తితో తిలకించారు.
చారిత్రక సందర్భాలను గుర్తుచేసుకుంటూ ప్రకాశ్ అంబేద్కర్‌తో చర్చిస్తూ ముందుకు సాగారు. అక్కడనుండి ఆడోటిరియానికి చేరుకున్న సిఎం ఎస్సీ కార్పోరేషన్ వారు రూపొందించిన…ఆత్మబంధువు అంబేద్కరుడు…. డాక్యుమెంటరీని ప్రకాశ్ అంబేద్కర్‌తో పాటు మంత్రులు ప్రజాప్రతినిధులు సిఎస్ ఉన్నతాధికారులతో కలిసి వీక్షించారు. డాక్యమెంటరీలో పొందుపరిచిన అంబేద్కర్ జీవిత గాథను, భారత దేశానికి వారు చేసిన సేవలను., వాటితో పాటు అంబేద్కర్ ఆశయాలను ఆదర్శంగా చేసుకుని తెలంగాణ ప్రభుత్వం దళితాభ్యున్నతికోసం అమలు చేస్తున్న దళితబంధు వంటి విప్లవాత్మక పథకాల వివరాలను, సాధించిన విజయాలతో కూడిన డాక్యుమెంటరీని సిఎం కేసీఆర్ తిలకించారు. అనంతరం అక్కడనుంచి నేరుగా ప్రకాశ్ అంబేద్కర్‌ను తోడ్కొని సభా వేదికకు సిఎం కేసీఆర్ చేరుకున్నారు. వేదిక మీదకు సిఎం చేరుకోగానే..జై భీం జైతెలంగాణ జై కేసీఆర్ నినాదాలతో సభా ప్రాంగణం మారు మోగింది.