ఆమనగల్లు, ప్రజాతంత్ర ఆగస్ట్ 8 : ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలోని నాగర్ కర్నూల్, వనపర్తి, గద్వాల, జిల్లాలను కలుపుకుంటూ నాగర్ కర్నూల్ – కల్వకుర్తి రైల్వే నిర్మాణానికి సర్వే చేయించేందుకు కేంద్రం లోని నరేంద్ర మోదీ ప్రభుత్వం రూ. 7.40 కోట్లు మంజూరు చేసిందని జాతీయ బీసీ కమిషన్ మాజీ సభ్యులు తల్లోజు ఆచారి తెలిపారు. సోమవారం స్థానిక విలేకరులతో ఆయన మాట్లాడుతూ నాగర్ కర్నూల్, కల్వకుర్తి, సూర్యాపేట, నల్గొండ, మీదుగా వనపర్తి గద్వాల డోర్నకల్ వరకు దాదాపు 296 కిలోమీటర్ల రైల్వే లైన్ సర్వే కొరకు కేంద్ర ప్రభుత్వం నిధులు మంజూరు చేయడం హర్షించదగ్గ విషయం అన్నారు. కల్వకుర్తి నియోజకవర్గం ప్రజలకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుందన్నారు. రైల్వే లైన్ సర్వేకు సహకరించిన దేశ ప్రధాని నరేంద్ర మోధీ కేంద్ర మంత్రి, బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి, డీకే అరుణ, సుధాకర్ రావు, దిలీప్ లకు ఆచారి కృతజ్ఞతలు తెలిపారు. నాగర్ కర్నూల్, వనపర్తి, గద్వాల, మహబూబ్ నగర్ జిల్లా ప్రజలకు ఆచారి కృతజ్ఞతలు తెలిపారు. ఆయన వెంట బిజెపి కల్వకుర్తి కోకన్వీనర్ గోరేటి నరసింహ, కౌన్సిలర్లు లక్ష్మణ్, చెన్నకేశవులు, మున్సిపాలిటీ బిజెపి అధ్యక్షుడు శ్రీకాంత్ సింగ్ తదితరులు ఉన్నారు.