నూతన సంవత్సరంలో తెలంగాణకు కొత్త కాంతులు

2015 ఎమ్మెల్సీ ఎన్నికల సమయంలో..వోటుకు నోటు కేసులో అరెస్ట్‌ కావటంతో రేవంత్‌ రెడ్డి తెలంగాణలో ఓ సంచలనంగా మారిపోయారు. అయితే..రేవంత్‌ ఏమాత్రం భయపడకుండా..ఇదంతా కేసీఆర్‌ అండ్‌ కో పన్నిన కుట్రగా తిప్పికొట్టారు. ఆ సమయంలోనే..కేసీఆర్‌ను సీఎం కుర్చీ నుంచి దించుతానని మీసం తిప్పి మరీ శపథం చేశారు. తన కూతురి పెళ్లికి కూడా ఆయన ఓ అతిథిగా వొచ్చి వెళ్లటం లాంటి ఘటనలతో తీవ్రంగా బాధపడిన రేవంత్‌ రెడ్డి.. ఏమాత్రం కుంగిపోలేదు. రేవంత్‌ రెడ్డి కాంగ్రెస్‌ పార్టీతో సంప్రదింపులు జరుపుతున్నారన్న ఆరోపణలతో తెలంగాణ తెలుగుదేశం పార్టీ ఆయనపై సస్పెన్షన్‌ వేటు వేసింది.

2018 అసెంబ్లీ ఎన్నికల్లో మళ్లీ కొడంగల్‌ నుంచి ఎన్నికల బరిలోకి దిగి ఓడిపోయారు రేవంత్‌ రెడ్డి. అయితే రేవంత్‌ రెడ్డికి ఉన్న మాస్‌ ఫాలోయింగ్‌ చూసిన కాంగ్రెస్‌ అధిష్ఠానం టీపీసీసీ వర్కింగ్‌ ప్రెసిటెండ్‌గా నియమించింది. 2019 లోక్‌సభ ఎన్నికల్లో మల్కాజ్‌గిరి నుంచి పోటీ చేసిన రేవంత్‌ రెడ్డి.. బీఆర్‌ఎస్‌ అభ్యర్థి మర్రి రాజశేఖర్‌ రెడ్డిపై 10,919 వోట్ల తేడాతో గెలుపొందారు. మొదటిసారి పార్లమెంట్‌లో అడుగుపెట్టారు. ఆ తర్వాత 2021లో కాంగ్రెస్‌ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా రేవంత్‌ రెడ్డి బాధ్యతలు స్వీకరించారు. జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో ఓటమితో కుంగిపోయిన కాంగ్రెస్‌కు ఆ తర్వాత ఉప ఎన్నికల్లో గట్టి ఎదురుదెబ్బలు తగిలాయి. ఆ సమయంలో పార్టీ బాధ్యతలు చేపట్టిన రేవంత్‌ రెడ్డి..పదునైన విమర్శలతో ప్రత్యర్థులను ఇరుకునపెడుతూ వొచ్చారు.

అయితే కాంగ్రెస్‌ పార్టీ తనను తానే ఓడిరచుకుంటుంది అనేది రాజకీయ వర్గాల్లో ఎప్పుడూ వినిపించే మాట. గత పదేళ్లలోనూ తెలంగాణలో అదే జరిగింది. పీసీసీ చీఫ్‌గా ఎవరు ఉన్నా..అసమ్మతులతో తల బొప్పికట్టేది. రేవంత్‌ పీసీసీ అయ్యాక కూడా సమస్యలు తప్పలేదు. అధిష్టానం జోక్యం చేసుకొవటంతో నేతలంతా దారిలోకి వొచ్చారు. రేవంత్‌ పార్టీ నేతలందరినీ ఒక్కతాటిపైకి తెచ్చేందుకు శ్రమించారు. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్‌ విజయం సాధిస్తుందని కొందరు ముఖ్య నేతలకే నమ్మకం లేని పరిస్థితి. కానీ రేవంత్‌ రెడ్డి అందుకు భిన్నంగా ఆలోచించారు. దాని కోసం లోతైన కసరత్తు చేశారు. దిల్లీ ఉంచి గల్లీ వరకు అన్ని స్థాయిల్లోనూ ఎవరి పని వారు చేశారు. ప్రచార వ్యూహం దగ్గరి నుంచి టికెట్ల పంపిణీ వరకు చాలా జగ్రత్తలు తీసుకున్నారు.

రాష్ట్ర అధ్యక్ష బాధ్యతలు చేపట్టిన నాటి నుంచే కాంగ్రెస్‌ పార్టీని అధికారంలోకి తీసుకురావడమే లక్ష్యంగా రేవంత్‌ రెడ్డి తీవ్ర ప్రయత్నాలు సాగించారు. క్షేత్రస్థాయిలో అధికార పార్టీపై ప్రజల్లో ఉన్న వ్యతిరేకతను పసిగట్టిన రేవంత్‌ రెడ్డి..‘మార్పు కావాలి..కాంగ్రెస్‌ రావాలి’ అనే నినాదంతో ముందుకు కదిలారు. పార్టీలోని చాలా మంది ముఖ్య నేతలు, స్టార్‌ క్యాంపెయినర్లు తమ నియోజకవర్గాలకే పరిమితమై ప్రచారం సాగించగా..రేవంత్‌ రెడ్డి మాత్రమే ఒక్కడే.. ఒంటరిగా రాష్ట్రమంతా తిరుగుతూ అభ్యర్థులకు అండగా ఉంటూ వొచ్చారు. అధికార పార్టీ బీఆర్‌ఎస్‌పై ఘాటు విమర్శలు కురిపిస్తూ..తొమ్మిదిన్నరేళ్ల పాలనలోని తప్పులను వివరిస్తూ జన చైతన్యాన్ని రగిలించారు. అతడే ఒక సైన్యమై కాంగ్రెస్‌ పార్టీని విజయ తీరానికి చేర్చగలిగారు.

తెలంగాణ ఇచ్చినప్పటికీ రెండు సార్లు అధికారానికి దూరంగా ఉన్న కాంగ్రెస్‌ పార్టీ..ఇప్పుడు అధికారంలోకి రావడం వెనుక నేతల సమిష్టి కృషి ఉంది. అయితే రేవంత్‌ అనుసరించిన వ్యూహాలు కీలకంగా మారాయి. కురు వృద్ధ కాంగ్రెస్‌ను గెలుపు తీరానికి చేర్చిన యువ నేతగా ఆయనకు అభినందనలు వెల్లువెత్తుతున్నాయి. సభలు, సమావేశాలు, రోడ్‌ షోలతో రాష్ట్రమంతా హోరెత్తించిన రేవంత్‌ రెడ్డి.. పార్టీకి విజయం అందించారు. కాంగ్రెస్‌లో అతి తక్కువ కాలంలో ఈ స్థాయికి ఎదిగిన నాయకుడు ఎవరూ లేరంటే అతిశయోక్తి కాదు. రాష్ట్ర కాంగ్రెస్‌ పగ్గాలు చేపట్టిన రెండేళ్లకే..పార్టీని అధికారంలోకి తీసుకురావడంలో కీలక పాత్ర పోషించి..చరిత్ర సృష్టించారు రేవంత్‌ రెడ్డి.

ఎన్నికల ప్రక్రియ మొదలైనప్పటి నుంచి రాష్ట్రంలో సీఎంగా వినిపించిన ఒకే ఒక్క పేరు రేవంత్‌ రెడ్డి. పార్టీ గెలిచినప్పటి నుంచి అధిష్ఠానం మనసులో కూడా అదే పేరు ఉన్నా..బయటకు చెప్పలేక తచ్చాడుతున్న సమయంలో.. రాష్ట్రమంతా ముక్తకంఠంతో రేవంత్‌ రెడ్డే సీఎం అని…మిగితా ఎవ్వరు వొచ్చినా ఒప్పుకోమన్న రీతిలో తమ అభిప్రాయాలను సోషల్‌ మీడియాలో వ్యక్తం చేశారు. రేవంత్‌ రెడ్డిపై అటు అధిష్ఠానానికి, ఇటు రాష్ట్ర ప్రజానికానికి అంత నమ్మకమేంటీ. స్వతంత్ర అభ్యర్థిగా రాజకీయ రంగ ప్రవేశం చేసి జడ్పీటీసీగా గెలిచి..ఆ తర్వాత ఎమ్మెల్సీ అయిన ఓ సాధారణ వ్యక్తి ఏదో ఓ రోజు సీఎం అవుతానని ఆరోజే కలగన్నాడు. ఇప్పుడు ఆయన కోరుకోకపోయినా..అటు అధిష్ఠానం, ఇటు ప్రజలు ఆయనే కావాలని బలంగా నమ్ముతున్నారంటే..ఆయనలో ఏదో ఉంది.

ఉమ్మడి మహబూబ్‌నగర్‌ జిల్లా కొండారెడ్డిపల్లిలో 1969లో అనుముల నర్సింహారెడ్డి, రామచంద్రమ్మ దంపతులకు జన్మించిన రేవంత్‌ రెడ్డికి చిన్ననాటి నుంచే నాయకత్వ లక్షణాలున్నాయి. పాఠశాలలో చదివే రోజుల్లోనే విద్యార్థి నాయకుడిగా ఉన్నారు. రేవంత్‌ రెడ్డి..ఏవీ కాలేజీలో బీఏ చదివారు. ఆ సమయంలోనే..ఏబీవీపీలో చురుగ్గా పని చేశారు. ఆ తర్వాత కొంతకాలం ఆరెస్సెస్‌లో కొనసాగారు. పెయింటర్‌గా కొంతకాలం పనిచేశారు. ఆ తర్వాత సోదరుడితో కలిసి ప్రిటింగ్‌ ప్రెస్‌ ప్రారంభించారు..అది విజయవంతం అవ్వడంతో రియల్‌ ఎస్టేట్‌ రంగంలోకి కాలు పెట్టారు. ఆర్థికంగా నిలదొక్కుకున్న రేవంత్‌ రెడ్డి..ఎన్నో సేవాకార్యక్రమాలు చేశారు. రేవంత్‌ రెడ్డి 1992లో జైపాల్‌ రెడ్డి బంధువైన గీతను ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. వీరి కుమార్తె నైమిషా రెడ్డి వివాహం ఘనంగా జరిపించారు. మనవడు కూడా జన్మించాడు. ఇక కుటుంబానికి సంబంధించిన బాదర బందీలు లేకపోవటంతో పూర్తి ఫోకస్‌ పార్టీపైన, రాష్ట్ర సమస్యలపైనే పెడతానంటూ పలు సందర్భాల్లోనూ రేవంత్‌ చెప్పుకొచ్చారు. రియల్‌ ఎస్టేట్‌ రంగంలో ఎప్పటి నుంచో ఉండటంతో..ఆర్థికంగానూ బలంగానే ఉండటంతో ఆ దిశగా తనకు ఎలాంటి సమస్యలు లేకపోవటంతో దృష్టి మొత్తం రాజకీయంపైనే పెట్టి..ఇచ్చిన బాధ్యతలు నెరువేరుస్తానని స్పష్టం చేశారు.

2006లో మిడ్జిల్‌ మండలం జడ్పీటీసీ ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థిగా బరిలోకి దిగి గెలుపొందారు. 2007లో మహబూబ్‌నగర్‌ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లోనూ స్వతంత్ర అభ్యర్థిగా విజయం సాధించారు. ఆయన చురుకుదనం చూసి టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు పిలిచి పసుపు కండువా కప్పితే..మరింత ఉత్సాహంతో పని చేశారు. 2009లో టీడీపీ తరపున కొడంగల్‌ నుంచి తొలిసారి ఎమ్మెల్యేగా గెలిచారు. చంద్రబాబుకు చాలా దగ్గరైపోయి.. పార్టీలో కీలక పాత్ర పోషించారు. ఆ తర్వాత 2014లో కొడంగల్‌ ఎమ్మెల్యేగా గెలుపొందారు. టీడీపీ ఫ్లోర్‌ లీడర్‌గా, పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడిగా కీలక బాధ్యతలు పోషించారంటే..ఆయనకున్న కమిట్‌మెంటే కారణం. 2009, 2014 ఎన్నికల్లో కొడంగల్‌ నుంచి టీడీపీ ఎమ్మెల్యేగా విజయం సాధించారు. తెలంగాణ టీడీపీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌గా, ఫ్లోర్‌లీడర్‌గానూ పనిచేశారు.

2014లో తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక ఈ ప్రాంతంలో తెలుగుదేశం పార్టీ క్రమంగా బలహీన పడిరది. టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు ఇక్కడి రాజకీయాలకు దూరంగా ఉంటూ ఆంధ్రప్రదేశ్‌కే పరిమితమయ్యారు. ఈ నేపథ్యంలో తెలంగాణ తెలుగుదేశం పార్టీని అసెంబ్లీలో నడిపించే అవకాశం రేవంత్‌ రెడ్డికి దక్కింది. కానీ, రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ అంతకంతకూ బలహీనపడటం, కీలక నేతలంతా అధికార పార్టీలో చేరడమో, లేదంటే పార్టీ బాధ్యతలకు దూరంగా ఉండటమో చేయడంతో అధికార పార్టీని ఎదుర్కొంటూ తెలుగుదేశం పార్టీని నడిపించడం కష్టమైంది…

దీంతో 2017 అక్టోబర్‌ 17న ఆయన తెలుగుదేశం పార్టీ సభ్యత్వానికి, శాసన సభ్యత్వానికి రాజీనామా చేశారు. అక్టోబర్‌ 30న దిల్లీలో రాహుల్‌ గాంధీ సమక్షంలో కాంగ్రెస్‌ పార్టీలో చేరారు. ముందు నుంచీ సంచలన నాయకుడిగానే పేరున్న రేవంత్‌..ఆ తర్వాత తన మాటల్లో, విమర్శల్లో పదును పెంచారు. మైక్‌ పట్టుకుంటే చాలు కేసీఆర్‌తో పాటు ఆయన కుటుంబం మీద పరుష పదజాలంతో శివాలెత్తి పోయేవారు. సొంతంగా సామాజిక మాధ్యమ సైన్యాన్ని తయారు చేసుకుని తన వ్యక్తిత్వాన్ని గణనీయంగా పెంచుకోగలిగారు. కానీ, వర్గ రాజకీయాలకు పెట్టింది పేరులాంటి కాంగ్రెస్‌ పార్టీలో ఆయన ప్రస్థానం అంత సులభంగా సాగలేదు.

హస్తంతో రేవంత్‌ దోస్తీ కుదిరిపోయింది. 2017 అక్టోబర్‌ 30న రాహుల్‌ గాంధీ సమక్షంలో కాంగ్రెస్‌ కండువా భుజాన వేసుకున్నారు. ఇక అప్పటి నుంచి రేవంత్‌..రాజకీయ భవిత మరింత పుంజుకుంది. ఆయన వాగ్ధాటితో అధికార బీఆర్‌ఎస్‌ నేతలపై..ముఖ్యంగా కేసీఆర్‌ మీద బలమైన విమర్శలు చేస్తూ.. తెలంగాణలో ప్రభుత్వ వ్యతిరేకతను తనవైపు తిప్పుకుని..ప్రత్యేక అనుచరులను సంపాదించుకున్నారు. చురుకుదనం, ఆవేశపూరిత ఉపన్యాసాలతో పార్టీలో చేరిన ఏడాదికే అధిష్ఠానం దృష్టిలో పడ్డారు. దీంతో..టీపీసీసీ అధ్యక్షుని రేసులో ఇద్దరు సీనియర్ల సరసన నిలిచారు. కానీ..ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డికే అధిష్ఠానం పార్టీ పగ్గాలు అప్పజెప్పింది. అయితే 2018లో కాంగ్రెస్‌ పార్టీ ఆయన్ను ముగ్గురు టీపీసీసీ వర్కింగ్‌ ప్రెసిడెంట్స్‌లో ఒకరిగా ఎంపిక చేసింది.

2018 ఎన్నికల్లో కొడంగల్‌లో రేవంత్‌ రెడ్డి సైతం ఓడిపోయారు. దీంతో ఆయనపై విమర్శలు మరింత ఎక్కువయ్యాయి. ఆ తర్వాత 2019లో వొచ్చిన లోక్‌ సభ ఎన్నికల్లో దేశంలోనే అతిపెద్ద పార్లమెంట్‌ నియోజకవర్గమైన మల్కాజిగిరి నుంచి కాంగ్రెస్‌ ఎంపీగా గెలుపొంది తిరిగి తన సత్తా చాటారు. ఎంపీగా గెలవటంతో..దిల్లీ నేతలతో సత్సంబంధాలు పెంచుకునేందుకు రేవంత్‌కు మంచి అవకాశంగా మారింది.  దీంతో..2021లో ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డిని తప్పించి..టీపీసీసీ అధ్యక్షుడిగా రేవంత్‌ రెడ్డిని అధిష్ఠానం నియమించింది. అందుకు కారణం..యువనేత, ఉత్తేజపరచే ప్రసంగాలతో ప్రజలను ఆకట్టుకుంటూ మాస్‌ లీడర్‌గా పేరు తెచ్చుకోవటం, ఉనికి కోల్పోయే పరిస్థితిలో ఉన్న పార్టీకి ఊపిరిలూదేందుకు కావాల్సిన స్ట్రాటజీలున్న నేతగా గుర్తించడమేనని చెబుతారు. అప్పటి నుంచి రేవంత్‌ గ్రాఫ్‌ ఒక్కసారిగా పెరిగిపోయింది.
బయట గ్రాఫ్‌ పెరగటమేమో కానీ.. సొంత పార్టీ నేతల నుంచి తీవ్ర స్థాయిలో వ్యతిరేకత వొచ్చింది. బహిరంగానే వాళ్ల నుంచి విమర్శలు ఎదుర్కున్నారు. వీటన్నింటినీ ఎదుర్కుని నిలబడిన రేవంత్‌.. ఎక్కడా తన లక్ష్యాన్ని వదల్లేదు. జీరోగా ఉన్న కాంగ్రెస్‌ పార్టీని హీరో లెవల్‌కు తీసుకొచ్చేందుకు ప్రతి క్షణం కృషి చేశారు. అవమానాలు చుట్టుముట్టినా..ఆరోపణలు బాధపెట్టినా..పరిస్థితులు ఒంటరిని చేసినా..మొక్కవోని ధైర్యంతో..2023 ఎన్నికల్లో కేసీఆర్‌ సర్కారును గద్దె దించడమే లక్ష్యంగా వ్యూహాత్మకంగా పని చేశారు.

ఈ క్రమంలో తన సొంత డబ్బు ఖర్చు పెట్టుకున్నారు. సునిల్‌ కనుగోలు లాంటి పొలిటికల్‌ స్ట్రాటజిస్టులను కూడా నియమించుకుని క్షేత్రస్థాయి నుంచి పార్టీని బలోపేతం చేసుకుంటూ వొచ్చారు. ఈ క్రమంలోనే.. రేవంత్‌కు వొస్తున్న ఆదరణతో సీనియర్లలో ఒకింత ఈర్ష్య రావటం..వర్గాలుగా విడిపోవటం.. తన వర్గానికి అన్ని బాధ్యతలు అప్పగిస్తున్నాడంటూ రేవంత్‌పై బహిరంగంగానే ఆరోపణలు చేయడం పార్టీలో ఇబ్బందికరంగా మారాయి. అయినప్పటికీ.. అధిష్ఠానంతో చర్చలు జరుపుతూ..వ్యూహాత్మకంగా సీనియర్లను కలుపుకుని ముందుకు సాగారు రేవంత్‌.

కర్ణాటక తర్వాత కాంగ్రెస్‌ అధిష్టానం తెలంగాణ ఎన్నికలపై ఎక్కువగా దృష్టి సారించడంతో రాహుల్‌గాంధీ, ప్రియాంక వాద్రాలు విస్తృతంగా రాష్ట్రంలో పర్యటించారు. ఈ సమయంలో రేవంత్‌ వారి వెంట ఉండి ప్రచార కార్యక్రమాల్లో పాల్గొన్నారు. రాహుల్‌ గాంధీ నిర్వహించిన భారత్‌ జోడో యాత్రలో కూడా పాల్గొన్న రేవంత్‌ రెడ్డి ఆయనకు సన్నిహితంగా ఉండేందుకు ప్రయత్నించారు. పార్టీలో ఏకపక్షంగా నిర్ణయాలు తీసుకుంటున్నారంటూ సీనియర్‌ నేతల నుంచి విమర్శలు వొస్తున్నా తనదైన శైలిలో పని చేసుకుపోతున్నారన్న పేరు తెచ్చుకున్నారు రేవంత్‌ రెడ్డి. రాహుల్‌, ప్రియాంక దృష్టిలో అపారమైన నమ్మకం కల్పించటంలోనూ..రేవంత్‌ వందకు వంద మార్కులు సంపాదించారు. ప్రచారంలోనూ రేవంత్‌ రెడ్డి గురించి ప్రియాంక మాట్లాడుతూ..తనను కలిసిన ప్రతిసారి.. ఆయనకు పదవి కావాలనో, పేరు కావాలనో అడగలేదని..కేవలం కేసీఆర్‌ను గద్దె దించేందుకు అవకాశం ఇవ్వాలని, తెలంగాణలో మార్పు తీసుకొచ్చేందుకు ఛాన్స్‌ ఇవ్వాలనే అడిగారంటూ చెప్పారంటే..ఆయన అధిష్ఠానం దృష్టిలో ఎంత నమ్మకం సాధించారో.

రేవంత్‌ కాకుండా..పార్టీలోని మిగతా నేతలలో..సీనియర్లు, అనుభవజ్ఞులు ఉన్నా.. వారికి సత్తా లేదని, పడికట్టు రాజకీయాలకు అలవాటు పడ్డారని, ఏ నిర్ణయాన్ని సొంతంగా తీసుకుని అధిష్ఠానాన్ని ఒప్పించలేరన్న అభిప్రాయం ఉంది. గతంలో పీసీసీగా ఉండి ఉనికి కోల్పోయే పరిస్థితి నుంచి అధికారంలోకి తీసుకొచ్చిన వైఎస్సార్‌ను గుర్తు చేస్తూ..ప్రస్తుతం జీరో నుంచి మళ్లీ అధికారంలోకి తీసుకొచ్చిన టీపీసీసీ రేవంత్‌ రెడ్డినే..సీఎం అంటూ కాంగ్రెస్‌ శ్రేణులు, జనాలు ఫిక్సయిపోయారు. యువ నేత, డైనమిక్‌ లీడర్‌ రేవంత్‌ రెడ్డి మాత్రమే తెలంగాణ కొత్త సీఎం అని అధిష్ఠానం, రాష్ట్ర ప్రజలు కోరుకున్నట్టు  ముందు నుంచి అన్నీ తానై నిలబడిన రేవంత్‌. ప్రత్యర్థి పార్టీల నుంచే కాకుండా సొంత పార్టీ నేతల నుంచి కూడా వొచ్చిన విమర్శలను తట్టుకుని నిలబడి..పార్టీని ఈ స్థాయికి తీసుకురావటంలో ఆయన పాత్ర కీలకమని, సీనియర్‌ నేతలంతా తమ సెగ్మెంట్లకే పరిమితమైనా..రేవంత్‌ మాత్రం రాష్ట్రమంతా పర్యటిస్తూ.. ప్రభుత్వ వైఫల్యాలపై ఉద్రేక పూరిత ప్రసంగాలతో ప్రజలను కాంగ్రెస్‌ వైపు ఆకర్షించటంలో తనదైన పాత్ర పోషించారు. పార్టీని నడిపించే నాయకుడిగా..స్టార్‌ క్యాంపెయినర్‌గా..   ప్రభుత్వంపై పోరాటం చేసే ప్రతిపక్ష పార్టీ నేతగా..అన్ని తానై పార్టీని విజయ తీరాలకు చేర్చటంలో బాహుబలి పాత్ర పోషించారు.

ఎన్నికల సమయంలో అభ్యర్థుల ఎంపిక దగ్గరి నుంచి..టీడీపీ మద్దతు కూడగట్టుకోవటం, కమ్యూనిస్టుల పొత్తు విషయంలో తీసుకున్న నిర్ణయాల వరకు రేవంత్‌ తీసుకున్న నిర్ణయాలు..పార్టీ విజయానికి సానుకూలంగా మారాయని..అభ్యర్థుల ఎంపిక విషయంలో వ్యతిరేకత వొచ్చినా..బాధ్యత వహించి   గెలుపే లక్ష్యంగా తీసుకున్న కఠిన నిర్ణయాలు సరైనవేనని నిరూపించారు. బీఆర్‌ఎస్‌, బీజేపీ పార్టీలు ప్రతిసారీ వోటుకు నోటు కేసును తెరమీదికి తీసుకొస్తూ అవమానించినా వాటన్నింటినీ తట్టుకుని..ప్రత్యర్థులకు తన పార్టీని అధికారంలోకి తీసుకొచ్చి ధీటుగా సమాధానం ఇచ్చారు.

తెలుగు రాజకీయాలలో రేవంత్‌ రెడ్డి సంచలనాలకు, వివాదాలకు కేంద్రం. ఆర్‌ఎస్‌ఎస్‌, తెలుగుదేశం పార్టీ మూలాలున్న ఆయన కాంగ్రెస్‌ పార్టీలోకి రావడమే ఒక విశేషమైతే, అధిష్టానం ఆశీస్సులతో రాష్ట్ర అధ్యక్ష బాధ్యతలు స్వీకరించడం, పార్టీని అధిక స్థానాలలో గెలిపించడం అంతకన్నా విశేషం.  తెలంగాణ కాంగ్రెస్‌ పార్టీ సారథిగా పార్టీని రాష్ట్రంలో తొలిసారి గెలిపించిన నేతగా సంచలనం సృష్టించారు. అన్నీ తానై.. ఒంటరి పోరాటం చేసి.. కర్ణాటక ఎన్నికల్లో  కాంగ్రెస్‌కు అధికారం కట్టబెట్టిన కర్ణాటక పీసీసీ అధ్యక్షుడు డీకే శివకుమార్‌తో రేవంత్‌ రెడ్డిని పోల్చుతున్నారు. శివకుమార్‌కు వొచ్చిన పేరే రేవంత్‌ రెడ్డికి కూడా వొచ్చింది. అగ్రెస్సివ్‌ లీడర్‌గా ఇప్పటికే అధిష్ఠానం దృష్టిలో మంచి పేరు తెచ్చుకున్నారు.
-నందిరాజు రాధాకృష్ణ,
వెటరన్‌ జర్నలిస్ట్‌

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page