నేటి నుండి శాసనసభ సమావేశాలు

  • అస్త్ర శస్త్రాలను సిద్ధం చేసుకుంటున్న ప్రతిపక్షాలు
  • సమస్యలు అనేకం…30 రోజులైనా నిర్వహించాల్సిందేనని డిమాండ్‌
  • ఎదురు దాడికి అధికార పార్టీ వ్యూహాలు

మండువ రవీందర్‌రావు, ప్రజాతంత్ర
హైదరాబాద్‌, ఆగస్ట్ 2 : ‌నేటి నుంచి ప్రారంభం కానున్న శాసనసభ సమావేశాల్లో అధికార పార్టీని ఆడ్డుకునేందుకు ప్రతిపక్షాలు సమాయత్తం మవుతున్నాయి. తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించిన తర్వాత రెండవసారి అధికారంలోకి వొచ్చిన బిఆర్‌ఎస్‌ ‌ప్రభుత్వం నిర్వహించే అసెంబ్లీ సమావేశాల్లో ఇదే చివరిది కావడంతో ప్రజలకిచ్చిన పలు హామీలను నెరవేర్చడంలో విఫలమైన ప్రభుత్వ తీరును నిలదీసేందుకు విపక్షాలు సిద్ధమవుతున్నాయి. ఈ సమావేశాల అనంతరం జరుగనున్న ఎన్నికల్లో తామే విజయం సాధిస్తామన్న ధీమాతో ఉన్న కాంగ్రెస్‌, ‌బిజెపి పార్టీలు ప్రభుత్వ వైఫల్యాలను ఎత్తిచూపి ప్రజలముందు నగ్నంగా నిలబెట్టాలన్న ఆలోచనలో ఉన్నాయి. గడచిన రెండు ఎన్నికల్లో ఎజండాలోని ఏ ఒక్క అంశాన్ని ప్రభుత్వం నెరవేర్చలేదని ఇప్పటికే ఈ పార్టీలు చాలాకాలంగా పోరాటం చేస్తూనే ఉన్నాయి. ప్రధానంగా తెలంగాణ సాధన విషయంలో ట్యాగ్‌లైన్‌గా ఉన్న నిధులు, నీళ్ళు, నియామకాలన్న నినాదం కేవలం నినాదానికే పరిమితమైందంటున్నాయి.

ప్రస్తుతం నిన్నమొన్న జరిగిన విపత్తు విషయంలో విఫలమైన ప్రభుత్వ చర్యలపైన నిలదీసేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నాయి. తాజా వర్షాల కారణంగా గతంలో ఎన్నడూ లేని విధంగా యావత్‌ ‌తెలంగాణ నష్టపోయింది. ప్రాణనష్టం, ఆస్తి నష్టం, జంతు నష్టం జరిగినా రాష్ట్ర ప్రభుత్వం ఇంతవరకు ఎలాంటి సహకారం అందించకపోవడంపైన నిలదీసేందుకు విపక్షాలు ఏకం కానున్నాయి. ఇంత ఘోరకలి జరిగితే రాష్ట్ర ముఖ్యమంత్రికి రాజకీయాలే ప్రధానాంశంగా మారాయన్న విమర్శ ఉంది. ఊర్లకు ఊర్లే జలదిగ్భంధంలో చిక్కుకుంటే వారిని పరామర్శించడం, సహాయక చర్యల విషయాలను పక్కకు పెట్టి మహారాష్ట్రంలో పార్టీని విస్తృత పర్చే దిశగా రాష్ట్ర ముఖ్యమంత్రి కార్యక్రమాలను కొనసాగించడంపైన ఈ పక్షాలు నిలదీసే అవకాశాలు కనిపిస్తున్నాయి. రాష్ట్ర రాజధాని తర్వాత అత్యంత అధికంగా నష్టపోయిన ప్రాంతం ఉమ్మడి వరంగల్‌ ‌జిల్లా. ప్రధానంగా మోరంచ గ్రామం తీవ్ర విపత్తుకు లోనయింది. ఈ గ్రామమంతా నీ•మునిగింది. గొడ్డు, గోద, పంటలకు తీవ్ర నష్టం వాటిల్లింది. మృతుల్లో ఎక్కువ మంది ఇక్కడే చనిపోయారు. అయినా రాష్ట్ర ముఖ్యమంత్రి కనీసం ఆకాశ మార్గాన ఈ ప్రాంతాన్ని సందర్శించలేదన్న విమర్శ ఇక్కడ బలంగా ఉంది. తెలంగాణ రాష్ట్రంలో నియామకాలు జరుగుతాయని యువత ఎంతో ఆశించింది. కాని, వారి అశలకు బిఆర్‌ఎస్‌ ‌సర్కార్‌ ‌గండి కొట్టిందన్న అపవాదు ఉంది.

లేకలేక ఇచ్చిన నోటిఫికేషన్‌లు గందరగోళంగా మారటం, కనీసం నిరుద్యోగులకు ఇస్తామని హామీ ఇచ్చిన మేరకు భృతిని అందించకపోవడాన్ని సభా వేదికగా ప్రభుత్వాన్ని నిలదీయాలని విపక్షాలు సిద్ధమవుతున్నాయి. ధరణిని మొదటి నుండీ కాంగ్రెస్‌ ‌వ్యతిరేకిస్తున్న విషయం తెలిసిందే. తాము అధికారంలోకి వొస్తే ధరణిని ఎత్తివేస్తామని ఎప్పటినుండో చెబుతుంది. ధరణి లోపాలవల్ల నష్టపోయిన రైతులు, విసుగు చెంది ప్రాణాలు తీసుకున్న ఘటనలను అసెంబ్లీ వేదికగా ప్రజల దృష్టికి మరోసారి తీసుకువచ్చేందుకు ఆ పార్టీ సిద్ధమవుతున్నది. రైతు ప్రభుత్వంగా చెప్పుకుంటున్న బిఆర్‌ఎస్‌ ‌ప్రభుత్వం రైతులకు తీవ్ర అన్యాయం చేస్తున్న విషయాలను ఎత్తిచూపేందుకు సిద్ధమవుతున్నాయి. వివిధ కారణాలతో ఇక్కడ రైతులు ఆత్మహత్యలకు పాల్పడుతుంటే పంజాబ్‌ ‌రైతులను ఆర్థిక సహాయం చేసిన తీరుపైన ప్రభుత్వాన్ని నిలదీస్తామంటున్నారు. హుజురాబాద్‌ ఉప ఎన్నికల సమయంలో అక్కడ ప్రారంభించిన దళిత బంధును రాష్ట్ర వ్యాప్తంగా విస్తరించడంలో జరుగుతున్న జాప్యాన్ని,  గిరిజనుల పోడు పట్టాలిచ్చే విషయంలో చూపుతున్న వివక్షతపై పోరాడడానికి ఆయుధాలను సిద్ధంచేసుకుంటున్నారు.

బిజెపి కూడా దళిత బంధు, డబుల్‌ ‌బెడ్‌ ‌రూమ్‌ల నిర్మాణం, కేటాయింపులతో పాటు రేషన్‌ ‌కార్డులపై ప్రభుత్వాన్ని నిలదీయాలనుకుంటుంది. అనేక విధాలుగా నష్టపోతున్న వ్యవసాయ రైతాంగానికి ప్రభుత్వం రుణమాఫీని ప్రకటించకపోవడంపై సభా వేదికన పోరాటం చేయాలనుకుంటుంది. వీటితోపాటు అటు బిజెపి, ఇటు కాంగ్రెస్‌ ‌నాయకులు జరిపి పాదయాత్రల సందర్భంగా రాష్ట్రంలోని వివిధ జిల్లాల్లో నెలకొన్న సమస్యలపైన కూడా ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టేందుకు సిద్ధమవుతున్నాయి.  ఇదిలా ఉంటే అధికార పార్టీ కూడా ఎదురు దాడికి రంగం సిద్దం చేసుకుంటుంది. గవర్నర్‌ ‌దగ్గర బిల్లులు పెండింగ్‌లో ఉండడం, వాటివల్ల ప్రభుత్వ పథకాలు ఆమలులో జరుగుతున్న జాప్యాలను ఏకరువు పెట్టాలనుకుంటుంది. బిల్లుల పెండింగ్‌ ‌వల్ల యూనివర్శిటీలలో ఉద్యోగాల నియామకాలకు సంబంధించిన కామన్‌ ‌రిక్రూట్‌మెంట్‌ ‌బోర్డ్ ‌బిల్లు కూడా ఉంది. ఈ బిల్లును తిరిగి గవర్నర్‌కు ప్రభుత్వం పంపనుంది. వ్యవసాయానికి తాము 24 గంటల కరెంట్‌ ఇస్తుంటే, రోజుకు మూడు గంటలే చాలన్న కాంగ్రెస్‌ ‌విధానాన్ని ప్రజలకు తేటలెల్లం చేయాలనుకుంటుంది. అలాగే కేంద్రం  రాష్ట్రం పట్ల చూపిస్తున్న సవతి తల్లి ప్రేమను, కేంద్రం నుండి రావాల్సిన నిధులపై లెక్కలతోసమా వివరించేందుకు సిద్ధవుతుంది. మొత్తానికి ఎన్నికలకు ముందు జరుగుతున్న ఈ సభను అన్ని రాజకీయ పార్టీలు సద్వినియోగం చేసుకోవాలనుకుంటున్నాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page