సమస్యలపై చర్చించేలా అందరికీ అవకాశం
బిఆర్‌ఎస్ జాబ్ క్యాలెండర్ డిమాండ్ విడ్డూరమన్న మంత్రి సీతక్క
హైదరాబాద్, ప్రజాతంత్ర, జూలై 24 : పదేళ్ల తర్వాత అసెంబ్లీలో ప్రజాస్వామ్యం కనిపిస్తుందని, బీఆర్‌ఎస్ హయంలో శాసనసభలో ప్రొటెస్ట్ చేస్తే సస్పెండ్ చేసే వారని, తెలంగాణ ఏర్పడిరదే నియామకాల విూదని అలాంటి నియామకాలపై అధికారంలో వున్నపుడు బీఆర్‌ఎస్ స్పందించలేదని మంత్రి సీతక్క ఆరోపించారు. బుధవారం అసెంబ్లీ లాబీలో మంత్రి విూడియాతో చిట్ చాట్‌గా మాట్లాడారు. కాంగ్రెస్ అధికారం రాగానే 30 వేల ఉద్యోగాలతో పాటు, జాబ్ నోటిఫికేషన్‌లు ఇచ్చామన్నారు. అధికారం పోయాక బీఆర్‌ఎస్ నేతలకు నిరుద్యోగులు గుర్తుకు వచ్చి ప్రొటెస్ట్ చేయటం హాస్యాస్పదంగా ఉందన్నారు.
పదేళ్లుగా ఉద్యోగాల భర్తీని పట్టించుకోని గత బీఆర్‌ఎస్ ప్రభుత్వం జాబ్ క్యాలెండర్ కోసం డిమాండ్ చేయడం విడ్డూరమన్నారు. అసెంబ్లీ పోడియంలోకి వెల్లినా.. ప్లకార్డులు ప్రదర్శించినా.. గత ప్రభుత్వం సస్పెండ్ చేసేదని.. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం అలా చేయడంలేదని మంత్రి సీతక్క అన్నారు. గతంలో నిరసనలను అణగదొక్కిన బీఆర్‌ఎస్.. ఇప్పుడు నిరసనకు దిగడం ఆశ్చర్యకరమన్నారు. బీఆర్‌ఎస్ నిరసనలతో రాష్ట్రంలో ఎంత ప్రజా స్వామ్యం వుందో అర్థం అవుతుందని, ఉద్యోగాల భర్తీలో వున్న చిక్కు ముడులను విప్పి నియామకాలు చేపట్టామని చెప్పారు. త్వరలో జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తామన్నారామె.
తండాల్లో జీవన ప్రమాణాలు మెరుగయ్యేలా చర్యలు చేపడుతున్నామని, తండాలను రెవెన్యూ గ్రామాలుగా మార్చే అంశం చర్చిస్తున్నామన్నారు. 1936 నాటి రెవెన్యూ గ్రామాలే ఇంకా కొనసాగుతున్నాయని మంత్రి సీతక్క వ్యాఖ్యానించారు. కాగా దివ్యాంగులపై ఐఏఎస్ అధికారిణి స్మితా సభర్వాల్ చేసిన వ్యాఖ్యలు సరికాదని, దివ్యాంగులను కించపరిచేలా ఉన్నాయని.. దీని వెనుక వేరే ఆలోచన కనిపిస్తోందని మంత్రి సీతక్క ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఐఏఎస్ అధికారిణి స్మితా సభర్వాల్‌లో ఫ్యూడల్ భావజాలం ఉందని, ఆమె తన ఆలోచనా విధానాన్ని మార్చుకోవాలని సూచించారు. దేవుడు ఇచ్చిన జన్మకు ఎవరు ఏం చేస్తారన్నారు. ఇప్పటికైనా అలాంటివి మానుకోవాలన్నారు. దివ్యాంగులుగా ఉన్న ఎంతోమంది గొప్ప స్థానాలకు వెళ్లారని, ఇతరుల సమర్థతను గుర్తించాలన్నారు. ఈ విషయం సీఎం రేవంత్‌రెడ్డి దృష్టికి తీసుకెళ్తానని మత్రి సీతక్క స్పష్టం చేశారు.