పొలిటికల్‌ ‌బరస్ట్

‌రాష్ట్రంలో వరదల కారంణంగా ముంపుకు గురైన ప్రాంతాలను చూడడానికి వెళ్ళిన సందర్భంగారాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు చేసిన సంచలనాత్మక వ్యాఖ్యలు రాష్ట్ర రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. కేవలం రాజకీయ వర్గాల్లోనే కాదు, సామాజిక మాధ్యమాల్ల్లోకూడా దీనిపై దుమారం లేస్తున్నది. గత వారంరోజులుగా దేశంలోని భిన్న ప్రాంతాల్లో భారీగా కురిసిన వర్షాల వల్ల గోదావరి ఉప్పొంగి దాని పరివాహక ప్రాంతాలన్నీ జల సమాధిగా మారాయి. ఈ ప్రాంతాలను సందర్శించేందుకు రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రత్యేక హెలికాఫ్టర్‌లో రెండు రోజుల పర్యటన చేశారు. ఉమ్మడి వరంగల్‌ ‌జిల్లాతో పాటు భద్రాచలం చుట్టు పక్కల ప్రాంతాలను ఆయన ఏరియల్‌ ‌సర్వే చేశారు. ఈ సందర్భంగా ఆయన చేసిన సంచలనాత్మక వ్యాఖ్యలు శాస్త్రవేత్తలను ఆలోచనలో పడవేసేవిగా ఉన్నాయి. విదేశాలు కావాలనే భారతదేశంలోని కొన్ని ప్రాంతాల్లో క్లౌడ్‌ ‌బరస్ట్ ‌చేస్తున్నాయని, ఈ వరదలు రావడానికి విదేశీ కుట్ర దాగి ఉందన్న అనుమానాన్ని ఆయన వ్యక్తం చేశారు. అయితే ఇది ఎంతవరకు సరైనదన్న విషయం తనకు కూడా స్పష్టంగా తెలియదని చెప్పారు. అయితే తన అనుమానాలకు ఆయన కొన్ని ఉదాహరణలు కూడా జోడించారు.

గతంలో కశ్మీర్‌ ‌దగ్గర లద్ధాఖ్‌-‌లెహ్‌లో , ఆ తర్వాత ఉత్తరాఖండ్‌లో ఇలాంటి ప్రయోగాలు జరిగినట్లు తెలుస్తున్నదని, ఈ మధ్య గోదావరి పరివాహక ప్రాంతాల్లో ఇలాంటి ప్రయోగమే చేస్తున్నట్లు ఒక గ్లూమీ గ్లూమీ సమాచారం ఉన్నట్లు ఆయన అనడంతో రాజకీయ పార్టీలన్నీ ఒకసారే విరుచుకు పడుతున్నాయి. దీంతో క్లౌడ్‌ ‌బరస్ట్ ‌కాస్తా పొలిటికల్‌ ‌బరస్టట్‌గా మారింది. వర్షాలు పడుతున్నన్ని రోజులు ప్రగతి భవన్‌కే పరిమితమైనా కెసిఆర్‌కు ఇప్పుడు విదేశీ కుట్ర ఎలా కనిపించిందంటూ ప్రతిపక్ష పార్టీల నాయకులు తీవ్రంగా విమర్శిస్తున్నారు. రాష్ట్రంలో భారీగా వర్షాలు పడి, పలు ప్రాంతాలు ముంపుకు గురై, వందలాది కుటుంబాలు కట్టుకునేందుకు గుడ్డలు లేక, ఉన్న పూరిగుడిసెలన్నీ సర్వనాశనం అయిన తర్వాత ఆలస్యంగా మేల్కొన్న తాను తన వైఫల్యాన్ని కప్పిపుచ్చుకునే క్రమంలో ఏదో ఒక అనుమానాన్ని లేవనెత్తి అందరి దృష్టిని అటు వైపుగా మళ్ళించే ఎత్తుగడలో భాగంగానే క్లౌడ్‌ ‌బరస్ట్ అన్న కొత్త థియరీని ప్రజలముందుకు తీసుకు వొచ్చాడని వారు ఆరోపిస్తున్నారు.

ఇంతకు క్రితం ఏనాడు జూలై నెలల్లో ఇంత పెద్దగా వర్షాలు పడడంగాని, వరదలు కాని రాలేదు. అనుకోకుండా వొచ్చిన ఈ నీటి ప్రవాహాన్ని మళ్ళించడంద్వారా నష్టం వాటిల్లకుండా ఏవిధంగా చూడాలన్న విషయాలపైన మాట్లాడకుండా, తన తప్పిదాన్ని విదేశాలపై నెట్టడం చూస్తుంటే కెసిఆర్‌ ఎం‌త చీప్‌గా మాట్లాడుతున్నారన్నది అర్థమవుతున్నదంటూ పిసిసి మాజీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి విమర్శిస్తున్నారు. అలాగే పిసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి కూడా ప్రపంచంలోనే అతిపెద్ద ఎత్తిపోతల పథకంగా చెప్పుకుంటున్న కాళేశ్వరం ప్రాజెక్టు వరదలకు మునిగి వేలకోట్ల రూపాయల నష్టం వాటిల్లితే విదేశీ కుట్ర అంటూ తన తప్పును ఇతరులపైన నెట్టే ప్రయత్నం చేస్తున్నాడంటూ దుయ్యబడుతున్నారు. ఇది నిజంగానే ఈ శతాబ్ధపు పెద్ద జోక్‌గా భారతీయ జనతాపార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ ‌వ్యాఖ్యానించారు. అయితే అదే పార్టీకి చెందిన ఎంపీ, కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి మాత్రం తాము కెసిఆర్‌ ‌మాటలను సీరియస్‌గానే తీసుకుంటామని, అయితే అందుకు సంబంధించిన ఆధారాలను చూపాలని డిమాండ్‌ ‌చేశారు. ఇది కేవలం తన చేతగాని తనానికి నష్టపోయిన వారిని పక్కదోవ పట్టించేందుకు అల్లుతున్న కట్టుకథగా ఆయన అభివర్ణించారు.

తెలివైన వాడెవరు వరదలగురించి ఇంత చౌకబారుగా మాట్లాడరని హుజురాబాద్‌ ఎంఎల్‌ఏ ఈటల రాజేందర్‌ ‌కామెంట్‌ ‌చేశారు. వీరితోపాటు వైఎస్‌ఆర్‌సీపీ•, జనసేన పార్టీల నాయకులుకూడా విమర్శనాస్త్రాలను సంధించారు.. ఏదిఏమైనా కెసిఆర్‌ ‌మాటలతో అసలు క్లౌడ్‌ ‌బరస్ట్ అం‌టే ఏమిటి ? ఎలా ఎక్కడ సంభవిస్తుంది.? మేఘాల మధనం చేయవొచ్చా? అన్న విషయాలు ఇప్పుడు దేశ వ్యాప్తంగా చర్చనీయాంశమయింది. కెసిఆర్‌ ‌మాటలను బట్టి చైనా వారు ఇలాంటి ప్రయోగాలు చేసినట్లు తెలుస్తున్నది. మనకు శత్రుదేశమైన చైనా సరిహద్దు ప్రాంతాలను ఆక్రమించడంలాంటి చర్యలకు ఇప్పటికే పాల్పడుతున్నది.. ఇటీవల ప్రపంచ వ్యాప్తంగా మారణహోమానికి కారకమైన కొరోనా వ్యాప్తికి కూడా చైనానే కారణంగా అమెరికాలాంటి దేశాలు కూడా ఆరోపించాయి. గతలో కశ్మీర్‌, ఉత్తరాఖండ్‌ల్లో చైనా క్లౌడ్‌ ‌బరస్టట్‌లు చేసినట్లు అనుమానాలున్నాయి. మరి అమర్‌నాథ్‌లో జరిగిందేమిటి..! ఎందుకు ఆకాశానికి చిల్లి పడిందా అన్నట్లుగా అక్కడ వర్షాలు పడ్డాయి. ఇప్పుడు గోదావరి పరివాహక ప్రాంతాల్లో అలాంటి ప్రయోగమేదైనా నిజంగానే జరిగి ఉంటుందా అన్నదిప్పుడు శాస్త్రజ్ఞుల మేధకు పదునుపెట్టే కార్యక్రమంగా కొనసాగుతున్నది. కాని పక్షంలో గోదావరి మహా ఉగ్ర రూపం వెనుక మర్మమేమిటన్నది ఇప్పుడు ప్రధాన ప్రశ్నగా మారింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page