తెలంగాణ జలవనరుల అభివృద్ధి సంస్థ ఛైర్మన్ వి.ప్రకాష్ వ్యాఖ్యలు
పోలవరం ప్రాజెక్టు నిర్మాణం పూర్తి అయితే భద్రాచలం గ్రామం పూర్తిగా మునిగిపోతుందని రాష్ట్ర జల వనరుల అభివృద్ధి సంస్థ చైర్మన్ వి ప్రకాశ్ అన్నారు. 67 అడుగుల ఎత్తులో వరద ప్రవాహం కొనసాగితేనే రామాలయం వెళ్లేందుకు వీలు లేకుడా అష్టదిగ్భందనం అయిందని, అదే పొలవరం పూర్తయితే గనుక ఆ ప్రాజెక్ట్ బ్యాక్ వాటర్ కారణంగా భద్రాచలం పూర్తిగా మునిగిపోతుందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. పోలవరం విషయంలో సరైన అధ్యయనాలు జరగలేదని, ముఖ్యంగా బ్యాక్ వాటర్, డ్యామ్ సేఫ్టీ విషయంలో సరైన స్టడీస్ చేయకుండానే నిర్మాణ పనులు మొదలు పెట్టారని అన్నారు.
ఈ అంశాలను అధ్యయనం చేసేందుకు చంద్రబాబు అప్పట్లో నిరాకరించారని ప్రకాశ్ ఆరోపించారు. పోలవరం ప్రాజెక్టును తొందరగా కట్టాలనే ఉద్దేశంతో మొక్కుబడిగా స్టడీ చేపట్టి పనులు ప్రారంభించారని విమర్శించారు. ప్రస్తుతం ఈ డ్యామ్ బాధ్యతను కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నేపథ్యంలో బ్యాక్ వాటర్ ఎఫెక్ట్ పై స్టడీ నిర్వహించాలని డిమాండ్ చేశారు. పోలవరం పూర్తయితే కేవలం భద్రాచలం మాత్రమే కాదని, తెలంగాణలో 100 కిలోమీటర్ల మేర ఎఫెక్ట్ పడుతుందని ప్రకాష్ హెచ్చరించారు.