జగిత్యాల, ప్రజాతంత్ర, అక్టోబర్ 20 : అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ గత మూడు రోజులుగా తెలంగాణలో పర్యటిస్తున్నారు. అందులో భాగంగా శుక్రవారం రాహుల్ జగిత్యాల జిల్లాలో పర్యటించారు. ఈ క్రమంలో కాంగ్రెస్ విజయభేరి యాత్రలో భాగంగా జగిత్యాలకు వెళుతూ మార్గ మధ్యంలో న్యాక్ స్టాప్ వద్ద ఆగారు. ఈ సందర్భంగా రాహుల్ నూకపల్లిలో స్కూటీపై వెళుతున్న ప్రయాణికులతో ముచ్చటించారు. చిన్నారులకు చాక్లెట్స్ అందించారు. అలాగే రోడ్డు ప్రక్కన దోశ బండి దగ్గర ఆగి దోశ వేసి అక్కడ ఉన్నవారందరినీ ఆశ్చర్యచకితులను చేశారు. రోడ్డు వద్ద రాహుల్ గాంధీ ఆగడంతో ప్రయాణికులు ఆశ్చర్యపోయారు. రెండు దోశలు వేసి రాహుల్ అందరినీ ఆకట్టుకున్నారు. అక్కడున్న స్థానికులతో ముచ్చటించారు. రాహుల్ గాంధీ దోసెలు వేసిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
రాహుల్ తాను వేసిన దోసెలు దోసెల బండి ఓనర్‌కు తినిపించారు. ఈ సందర్భంలో రాహుల్‌తో పాటు రేవంత్ రెడ్డి, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, పొన్నం ప్రభాకర్, కోమటిరెడ్డి వెంకట రెడ్డి వంటి తదితర నేతలు ఉన్నారు. రాహుల్ గాంధీ చిన్నారులకు చాక్లెట్లు పంచిన ఫోటోలను..దోసెలు వేసిన ఫోటోలను తెలంగాణ కాంగ్రెస్ ట్విట్టర్లో పోస్టు చేస్తు ..మనలో ఒక్కడు..మనందరి కోసం ఒక్కడు..అతడే మన రాహుల్ గాంధీ అంటూ పేర్కొంది. జగిత్యాల పర్యటనలో మార్గమధ్యంలో మరోచోట గీత కార్మికులు కనిపించగా రాహుల్ గాంధీ బస్సును ఆపి వారితో ముచ్చటించారు. వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా గీత కార్మికులు రాహుల్ గాంధీకి మోకును ధరింపచేసి సండురపడ్డారు. తమ కష్టసుఖాలను అడిగి తెలుసుకున్నందుకు కృతజ్ఞతలు తెలిపారు. హై సెక్యూరిటీ మధ్య ఉండే రాహుల్ గాంధీ సడెన్‌గా రోడ్డుపై కనిపించడంతో ప్రజలు సంభ్రమాచర్యాలకు లోనయ్యారు.