వైద్యులు జనాలకు ఆయుష్షు పోస్తారు, ఆయుష్షు పెంచుతారు. అందుకే నారాయణులని, కనిపించేదేవ్లు•ని జనం కొనియాడుతారు. ఈ పవిత్ర కార్యం నిర్వహించబడే చోట వ్యాపారం చేస్తే ప్రజారోగ్యం ఏమైపోవాలి ? అందుకే అభివృద్ధి చెందిన దేశాలలో మాదిరిగా ప్రభుత్వాల ఆధీనంలో నిర్వహిస్తూ, మానవీయ దృక్పథంతో సామాజిక స్ప•హతో పాలకులు వ్యవహరించాలి. వైద్య విద్యంను పూర్తిగా ప్రభుత్వాలు ఉచితంగా అందించాలి. సామాన్యుల చెమటోడ్చి కట్టిన పన్నులతో వైద్య వృత్తిని చేపట్టి సామాన్యులకు సేవ చేయకుండా, వైద్యాన్ని వ్యాపారం చేయడం అన్యాయం. వైద్యులందరిని ఒకేగాటిన కట్టి చూడడం కాదు, ప్రజావైద్యులు ఉన్నారు. వారు ప్రజల మన్ననలు పొందుతూనే ఉంటారు. వైద్యాన్ని వ్యాపారం చేస్తూ దోపిడి చేయడాన్ని ఉద్యమంతో చరమగీతం పాడాల్సి ఉందని సామాజిక వేత్తలు భావిస్తున్నారు.
వైద్య విధాతలారా.. ? మీ గొలుసుకట్టు రాతలు, బ్రాండెడ్ ఔషధాలు సిఫార్సులు చేయడం వ్యాధి గ్రస్తుల పాలిట శాపంగా మారుతుంది. వైద్యుల రాతలు అర్థం కాక, ఖరీదైన బ్రాండెడ్ కంపెనీల ఔషధా(మందు)లు కొనలేక ప్రజలు అల్లాడిపోతున్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ ఔషధాలు జనరిక్ పేర్లతోనే వైద్యులు ప్రిస్క్రిప్షన్ రాయాలని. 2017 ఏప్రిల్ 21న భారత వైద్య మండలి (ఎంసీఐ) స్పష్టమైన ఆదేశాలు ఇచ్చింది. అంతేకాదు రోగికి అర్థమయ్యేలా, కనిపించేలా పెద్ద అక్షరాల (క్యాపిటల్ లెటర్ల)తో రాయాలని చెప్పింది. దీనికన్న ముందు సుప్రీం కోర్టు కూడా ఆదేశాలిచ్చింది. కానీ నేడు ఎక్కువ మంది వైద్యులు ఔషధాలను బ్రాండెడ్ పేర్లతోనే రాస్తున్నారు. అవి కూడా గొలుసుకట్టుగా ఎవరికీ అర్థం కాని రీతిలో ఉంటుంది. వైద్యులు వారికున్న వైద్య నిబంధనల మేరకు జనరిక్ పేరుతో ఔషదా(మందు)ల్ని రాస్తే ఏ సంస్థ తయారు చేసిన ఉత్పత్తికి ధర తక్కువ ఉంటే దానిని వాడుకునే అవకాశం రోగికి ఉంటుంది.
అలా కాకుండా వైద్యులు బ్రాండెడ్ కంపెనీల పేర్లతో ఔషధాలు రాయడం వెనక ఔషద మాఫియా దందా ఉందనే విమర్శ వినబడుతుంది. జనరిక్ పేర్లతో ఔషధాలు రాయకుండా బ్రాండ్ల (కంపెనీ) పేర్లతో వైద్యులు రాస్తే ఆయా కంపెనీలు భారీగా ప్రోత్సాహకాలు, అమ్మకాల్లో వైద్యులక• కొంత శాతం కమీషన్ల రూపంలో ముడుతుందనే ఆరోపణలు ఉన్నాయి. మరో వైపు ఔషద షాపుల యజమానులతో, సంస్థలతో కుమ్మక్కై కొన్ని రకాల ఉత్పత్తులనే ఎక్కువగా రాస్తున్నారనే విమర్శలు కూడా ఉన్నాయి. ఈ కమీషన్లకు తోడు విదేశీ ప్రయాణాలు, పుట్టిన రోజులు, పెళ్లి రోజుల పేరిట ప్రత్యేక బహుమతులు కూడా అందిస్తున్నట్లు తెలుస్తుంది. కొన్ని దవాఖానాల్లో వారి బంధువుల పేర్లతో ఔషద దుకాణాలు నిర్వహిస్తున్నారు. వీరు రాసే మందులు వారి దుకాణాలలో మాత్రమే తప్ప వేరెక్కడ దొరకవు. ఈ రకమైన దోపిడి పట్ల బాధితులు గోడు వెల్లబోసుకుంటున్నారు. వైద్యులు గొలుసుకట్టులో ప్రిస్క్రిప్షన్ రాయడం వలన అనేక అనర్థాలు ఎదురౌతున్నాయి. మందులమ్మే దుకాణాదారులకు అర్థం కాక వ్యాధి ఏదో రోగి ద్వారా తెలుసుకొనో లేక మొదటి అక్షరం ఆధారంగానో ఔషధాల్ని ఇస్తే ? ఒక్కోసారి మందు వికటించి ప్రాణాలకే ముప్పు వాటిల్లిన సంఘటనలు కూడా ఉన్నాయి. అలాగే వైద్యులు ‘‘జనరిక్’’ నిబంధనలను ఖాతరు చేయకుండా యధేచ్ఛగా బ్రాండెడ్ కంపెనీల పేర్లతో రాయడంలో రోగికి ఆర్థిక భారం పెరిగి పోతుంది.
మనదేశంలో ఇటీవల విడుదలైన ‘‘నేషనల్ హెల్త్ అకౌంట్స్’’ సమాచారం మేరకు రోగులు చికిత్స కోసం పెట్టే ఖర్చు మొత్తం 36.8 శాతం అంటే మూడో వంతు మందులకే పెట్టాల్సి వస్తున్నట్లు గణాంకాలు స్పష్టం చేసింది. ఇలా మందు(ఔషదా)ల ఖర్చు తడిసి మోపెడౌతున్నవేళ ‘‘జనరిక్’’ ఔషధాల వాడకాన్ని ప్రచారాన్ని పెంచాలి. నమ్మకం పెంచడంతోపాటు బ్రాండెడ్ కంటే జనరిక్ మందుల ధరలు చాలా చౌకగా ఉంటాయని, జనరిక్ మందుల షాపులను పెంచి అందరికి అందుబాటులోకి తెచ్చి సామాన్య, మద్యతరగతి ప్రజలకు ఆర్థిక భారం తగ్గించాలి.
జనరిక్ మందులంటే.. ఏదైనా సంస్థ స్వతహాగా పరిశోధన చేసి ఔషధాన్ని (మందును) కనుగొంటే ప్రభుత్వం మేధోహక్కు (పేటెంట్ రైట్) ఇస్తుంది. దాని కాలపరిమితి పూర్తి అయ్యాక మందు తయారీ ఫార్ములా జాతీయం అవుతుంది. దాన్ని వినియోగించి తయారయ్యేవే ‘‘జనరిక్’’ మందులు. పరిశోధన సంబంధిత వ్యయ ప్రయాసలు లేనందున అవి తక్కువ ధరకు లభిస్తాయి. మార్కెట్లో జనరిక్, బ్రాండెడ్, బ్రాండెడ్ జనరిక్ అని మూడు రకాల ఔషధాలు అందుబాటులో ఉన్నాయి. ఇలా కాకుండా ఔషధాల ఉత్పత్తి సమయంలోనే జనరిక్ అని ముద్రించి ఇస్తే కంపెనీ పేరు, జనరిక్ పేరు మాత్రమే ఉండేలా చర్యలు తీసుకోవాలి. సాధారణ మందుల దుకాణాల్లో జనరిక్ మందులు విస్త•తంగా అమ్మాలి.
మన దేశంలో వైద్య చికిత్సకయ్యే ఖర్చులో మూడో వంతు దాకా జనమే సొంతంగా భరించాల్సి వస్తుంది. మన 140 కోట్ల జనాభాకు జనరిక్ మందులు అందుబాటులోకి తెస్తే గొప్ప లాభం జరుగుతుంది. దేశంలో ఎనిమిదేళ్ల క్రితం కేవలం 86కు పరిమితమైన ‘జన్ఔషధి’ దుకాణాలు, 8675కు పెరగడం మంచిదే ! ఇలా చౌకలో నాణ్యమైన జనరిక్ ఔషధాలు వినియోగంలోకి వస్తే ప్రజలకు చాలా ఆర్థికంగా మేలు జరుగుతుంది. అంతెందుకు ప్రపంచ దేశాలకు చౌకలో నాణ్యమైన మందులు సరఫరా చేస్తున్న మనదేశం సొంత ప్రయోజనాలు మానడం విడ్డూరంగా ఉందంటున్నారు విశ్లేషకులు. ప్రభుత్వాలు కార్పొరేట్ వైద్యానికి, (బాండెడ్ కంపెనీలకు ఊడిగం చేయడం భావ్యమా ! దేశంలోని రాష్ట్ర, జిల్లా స్థాయిలోని ఆరోగ్య కేంద్ర దవాఖానా)ల్లో, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో, ఆరోగ్య ఉప కేంద్రాల్లో మరియు సామాజిక ఆరోగ్యకేంద్రాల్లో, ప్రభుత్వ చికిత్సాలయాలన్నింటిలో జనరిక్ మందులే వాడాలని, రాయాలని, నిబంధనలు విధించి అవి ఖచ్చితంగా అమలు పరిచేలా పాలకులు పూనుకోవాలి.
అలా పాలకులు విశేషమైన చొరవతో చిత్తశుద్ధిని పాటించి అమలు చేస్తేనే దేశంలోని ప్రజా ఆరోగ్యం పరిఢవిల్లుతుంది. అలాగే రోగులకు వైద్యులు ప్రిస్క్రిప్షన్లలో జనరిక్ పేరే రాసి ఇవ్వాలని, ఔషద సంస్థల బ్రాండెను సూచించరాదనే నిబంధన కఠినంగా అమలు జరగాలి. వైద్యుల• ఉచితాలు, బహుమతులు, విదేశీ విహార యాత్రలక• ఆశపడి అమానవీయంగా వ్యవహరిస్తున్న తీరుతో రోగుల• వైద్యంపై ఉండే అపార నమ్మకాన్ని కోల్పోతారు. న్యాయస్థానాల ఆదేశాలను బేఖాతరు చేస్తూ, చట్ట పరంగా నేరమని తెలిసి ఇలా వ్యవహరించడం అనైతికం కాదా ! పాలకులు ఉదాసీనంగా వ్యవహరించడం భావమా ఇది మానవీయ విధానం ముమ్మాటికి కానే కాదు. వైద్య వృత్తికి వన్నెలద్దండి.. రోగికి భరోసా కల్పించండి…
– మేకిరి దామోదర్, సోషల్ ఎనలిస్ట్, వరంగల్,9573666650