ప్రపంచ ఫార్మస్యూటికల్ పరిశ్రమల సూచీలో ఔషధాల విలువ, నాణ్యమైన ఔషధాల సరఫరాలను పరిగణనలోకి తీసుకొని తయారు చేసిన జాబితాలో ఇండియా 14వ స్థానంలో ఉన్నది. ఆత్మ నిర్భర భారతంలో భాగంగా ఫార్మా సెక్టార్ అభివృద్ధికి సంబంధించిన పాలసీలు, ప్రోగ్రామ్‌లు గత కొన్నేళ్లుగా అమలు చేయబడుతున్నాయి. 2020 నుంచి భారత్‌లో ఫార్మా పరిశ్రమలను ప్రోత్సహించడం, ఆర్ డ డి (పరిశోధనలు-అభివృద్ధి) రంగాలకు ఊతం ఇవ్వడం చూస్తున్నాం. స్థానిక పరిశ్రమలను సపోర్ట్ చేయడం, ఉత్పత్తిదారులకు చేయూత ఇవ్వడం జరుగుతున్నది. ఫార్మస్యూటికల్ పరిశ్రమ బలోపేతానికి పాలసీలు ప్రవేశపెట్టడం చూసాం. ప్రపంచ ఫార్మా రంగానికి నాయకత్వం వహిస్తున్న భారతంలో ఔషధాల ఉత్పత్తి పెరగడం, నాణ్యతను కాపాడుకోవడం, కంపెనీల సుస్థిరాభివృద్ధి లాంటివి వేగంగా అమలు అవుతున్నాయి. ప్రభుత్వ చొరవతో బల్క్ డ్రగ్ పార్కులను గుజరాత్, ఆంధ్రప్రదేశ్, హిమాచల్ ప్పదేశ్ రాష్ట్రాలు ముందు వరుసలో ఉన్నాయి.
వ్యాక్సీన్/ఫార్మా క్యాపిటల్ ఆఫ్ వరల్డ్ Vaccine/Pharma Capital of the World
ప్రపంచానికి భారత్ ఫార్మా కేంద్రం అయితే ఇండియాలో తెలంగాణ ఫార్మా హబ్‌గా పేరుగాంచింది. హైదరాబాదు సమీపాన రానున్న అంతర్జాతీయ స్థాయి ‘ఫార్మా సిటీ హబ్’తో తెలంగాణ ఫార్మా పరిశ్రమలు, ఉత్పత్తి, సరఫరాల్లో ముందంజలా ఉన్నది. రానున్న రోజుల్లో ఫార్మా సిటీ హబ్‌లో ఉత్పత్తులతో తెలంగాణలో 50 బిలియన్ డాలర్ల నుంచి 100 బిలియన్ డాలర్లకు పెరగనుంది. చెన్నై, బెంగుళూరు, పూనే లాంటి నగరాలను దాటుతూ హైదరాబాదు మహానగరాన్ని ‘వ్యాక్సీన్ క్యాపిటల్ ఆఫ్ వరల్డ్, ఫార్మా క్యాపిటల్ ఆఫ్ ది వరల్డ్’గా పిలవడమే కాకుండా ‘ఏఐ (ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్) క్యాపిటల్ ఆఫ్ ఇండియా’గా పిలవడం జరుగుతున్నది. 2021 – 22లో ఫార్మా ఉద్యోగుల సంఖ్య దేశంలో 44 శాతం వరకు పెరగడం గమనిస్తున్నాం.
అంతర్జాతీయ స్థాయిలో ఫార్మా వాణిజ్యం Pharma trade at international level
కరోనా మహమ్మారి విజృంభణతో మరో మార్గం లేకపోవటంతో గత మూడు ఏళ్లుగా ప్రపంచ ఫార్మస్యూటికల్ పరిశ్రమ జోరు విపరీతంగా పెరిగింది. ఇదే రంగంలో భారత దేశం గణనీయ ప్రగతిని సాధించి నాణ్యమైన ఫార్మస్యూటికల్ ఉత్పత్తుల చిరునామాగా మారుతుండటం హర్షదాయకం. జనరిక్ ఔషధాల తయారీతో పాటు టీకా తయారీ ద్వారా 50 బిలియన్ డాలర్ల ఫార్మస్యూటికల్ వాణిజ్యంతో యూఎస్, యూకె, ఆఫ్రికా లాంటి అనేక దేశాలకు ఎగుమతులు కూడా జరుగుతున్నాయి. హెచ్ఐవి/ఏయిడ్స్ ఆంటీరిట్రోవైరస్ ఔషధాల తయారీ 80 శాతం వరకు భారత్‌లోనే నమోదు అవుతున్నది. ఈ స్థాయిలో ఫార్మా పరిశ్రమ భారతంలో విస్తరిస్తున్నప్పటికీ ప్రపంచవ్యాప్త 1.4 ట్రిలియన్ డాలర్ల వ్యాపారంలో 3 శాతం వరకు మాత్రమే ఇండియాలో జరుగుతున్నట్లు తేలింది. ఇండియాలోని ఢల్లీి ఫార్మస్యూటికల్ సైన్సెస్ అండ్ రీసెర్చ్, నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఫార్మస్యూటికల్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ సంస్థలను బలోపేతం చేయడానికి కేంద్ర ప్రభుత్వం పలు పథకాలను అమలు చేస్తున్నది.
భారత్‌లోని ఫార్మా విద్యారంగంతో పాటు ఫార్మా పరిశ్రమలు సమన్వయంతో ముందుకు సాగితే రానున్న రోజుల్లో ప్రపంచ దేశాలకు నాణ్యమైన ఫార్మాస్యూటికల్స్ తయారీలో ఇండియా కేంద్రంగా ఎదుగుతుందని అంచనా వేస్తున్నారు.
-డా.బిఎంఎస్ రెడ్డి, 9949700037