- చైనా, కొరియా సహా పలుదేశాల్లో కేసుల పెరుగుదలతో ఆందోళన
- అప్రమత్తంగా ఉండాలంటూ ప్రపంచ ఆరోగ్య సంస్థ హెచ్చరిక
న్యూ దిల్లీ, మార్చి 18 : ప్రపంచ వ్యాప్తంగా మళ్లీ కొరోనా విజృంభిస్తుంది. ముఖ్యంగా ఆసియాలోని వివిధ ప్రాంతాల్లో మహమ్మారి మళ్లీ ఊపిరిపోసుకుంటుంది. కొన్ని వారాల పాటు తగ్గినట్లు కనిపించినప్పటికీ.. కోవిడ్ ముగిసిపోలేదని ప్రపంచ ఆరోగ్య సంస్థ డైరెక్టర్ జనరల్ టెడ్రోస్ అథనామ్ గాబ్రియేసస్ హెచ్చరించారు. ప్రతి దేశం వేర్వేరు సవాళ్లతో విభిన్న పరిస్థితిని ఎదుర్కొంటున్నందున..కొరోనా ముగియలేదని గ్రహించాలని పేర్కొన్నారు. ‘కొన్ని దేశాల్లో పరీక్షలు తగ్గినప్పటికీ.. కేసులు పెరుగుతున్నాయి. అంటే మనం చూస్తున్న కేసులు మంచుకొండ కొన మాత్రమే’ అని తెలిపారు.
జర్మనీ, ఫ్రాన్స్, యుకె, దక్షిణకొరియాలో కేసులు పెరుగుతున్నాయి. దక్షిణ కొరియాలో గురువారం ఒక్క రోజులో 6.2 లక్షల కేసులు నమోదయ్యాయి. అమెరికా కన్నా రికార్డు స్థాయిలో తాజా కేసులు వెలుగు చూశాయి. అక్కడ కేవలం వారం రోజుల్లో 24 లక్షల కేసులు నమోదయ్యాయి. ఇక జర్మనీలో వారం రోజులో 15 లక్షలు, వియత్నాం 12 లక్షలు, ఫ్రాన్స్ 5.2 లక్షలు, యుకెలో 4.8 లక్షల కేసులు నమోదయ్యాయి. డబ్ల్యుహెచ్ఒ ప్రకారం…వారం రోజుల్లో కొత్తగా నమోదైన కేసులో దక్షిణ కొరియా ప్రపంచంలోనే అగ్రస్థానంలో ఉంది. ఇన్ని కేసులు నమోదవుతున్నా..కొరోనాను కట్టడి చేసేందుకు విధించిన ఆంక్షలను సడలించాలని దేశం నిర్ణయించింది.
చైనాలో మళ్లీ పెరుగుతున్న కొరోనా కేసులు
చైనాలో మరోమారు కొరోనా విజృంభిస్తున్నది. ఒమిక్రాన్ వ్యాప్తితో స్వల్ప వ్యవధిలోనే రోజువారీ కేసులు రెండింతలయ్యాయి. చైనాలో కూడా మునుపెన్నడూ లేని విధంగా కోవిడ్ కేసులు వెలుగుచూస్తున్నాయి. కొరోనా నుండి కోలుకున్న తర్వాత.. చేపట్టే క్వారంటైన్ వ్యవధిని చైనా తగ్గించింది. దేశంలో కేసులు పెరుగుతున్న నేపథ్యంలో.. ముందస్తు జాగ్రత్త చర్యల్లో భాగంగా వైద్య వనరులను ఆదా చేసేందుకు ఈ చర్యకు ఉపక్రమించింది. దేశంలో కొత్తగా 2388 కేసులు నమోదయ్యాయని అధికారిక గణాంకాలు వెల్లడించాయి. గురువారం 1742 కేసులు నమోదవగా, అంతకుముందురోజు 1206 కేసులు రికార్డయ్యాయి. 2020లో వుహాన్లో కరోనా కలకలం తర్వాత భారీ సంఖ్యలో కేసులు నమోదవడం ఇదే మొదటిసారి. షాంఘైలో 57 కొత్త కేసులు నమోదయ్యాయని, దేశీయంగా 203 కొరోనా లక్షణాలున్న వారిని గుర్తించామని అధికారులు వెల్లడించారు. కాగా, మార్చి 17 నాటికి చైనా ప్రధాన భూభాగంలో 1,26,234 కొరోనా కేసులు నమోదయ్యాయి. ఇందులో 4636 మంది మరణించారు. అయితే ప్రభుత్వం ఇప్పటివరకు అధికారికంగా కొరోనా కేసుల సంఖ్యను ప్రకటించలేదు.