సిద్ధిపేట, ప్రజాతంత్ర, అక్టోబర్ 7: ప్రయత్నానికి ఫలితం వస్తే వచ్చే ఆనందం గొప్పది అనుకున్నది సాధించి సార్థకత తెచ్చారు. ఆత్మవిశ్వాసంతో దించిన తల ఎత్తకుండా చదివితే ఉద్యోగం వస్తదని నిరూపించారని రాష్ట్ర ఆర్థిక, ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్ రావు అభినందించారు. జిల్లా కేంద్రమైన సిద్ధిపేట పోలీసు కన్వెన్షన్ హాల్ లో ఉచిత పోలీసు శిక్షణ ద్వారా ఎంపికైన ఎస్ఐ, కానిస్టేబుల్ లకు అభినందన సభ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి హాజరైన మంత్రి ఉచిత పోలీసు శిక్షణలో ఎంపికైన ఉద్యోగార్థులు, వారి తల్లిదండ్రుల అభిప్రాయం, భావోద్వేగాలతో వారి మాటల్లోనే తెలుసుకుని తువ్వాలలతో అభినందించి సన్మానించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ.. మీరంతా కష్టపడి చదివి ఉద్యోగాన్ని పొందారని, బయట ఎంతో దుష్ప్రచారం చేస్తున్నారని వాటిని నమ్మొద్దని హితవు పలికారు. మా శిక్షణ శిబిరం ద్వారా మీ తల్లిదండ్రులు తలెత్తుకునేలా, మరొకరికి స్ఫూర్తిగా ఉండేలా మీరు సాధించిన విజయానికి తృప్తిగా ఉన్నదని చెప్పుకొచ్చారు.