- ఎఐసిసి కార్యాలయంలో సోనియా, ప్రియాంక, కర్నాటక సంగనకల్లు క్యాంపులో రాహుల్ వోటు
- వోటింగ్‌లో పాల్గొన్న మన్మోహన్ సింగ్ సహా పలువురు సీనియర్ నేతలు
- గాంధీ భవన్లో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రంలో రాష్ట్ర నేతల వోటు
- జనగామ శ్రీనివాసరెడ్డి వోటు గల్లంతు…ఆగ్రహం వ్యక్తం చేసిన పొన్నాల లక్ష్మయ్య
- రేపు దిల్లీ ఏఐసిసి హెడ్ క్వార్టర్స్‌లో కౌంటింగ్..అదే రోజు ఫలితాలు
దేశ వ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. మొత్తంగా 96 శాతం వోటింగ్ నమోదయింది. వోటు హక్కు ఉన్న ప్రతినిధులు ఆయా రాష్ట్రాల కాంగ్రెస్ కార్యాలయాల్లో హక్కును వినియోగించుకున్నారు. దిల్లీలో ఏఐసీసీ కార్యాలయం సహా దేశవ్యాప్తంగా ఏర్పాటు చేసిన 65 పోలింగ్ కేంద్రాల్లో వోటు హక్కును వినియోగించుకున్నారు. దిల్లీలోని ఏఐసీసీ హెడ్ క్వార్టర్స్‌లో పార్టీ తాత్కాలిక అధ్యక్షురాలు సోనియా గాంధీ, ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ వాద్రా, పి చిదంబరం, జైరాం రమేష్ తదితరులు వోటు వేశారు. అధ్యక్ష ఎన్నికలో పార్టీకి చెందిన 9 వేల మంది పీసీసీ డెలిగేట్లు వోటు హక్కు కలిగి ఉన్నారు.
మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్‌తో పాటు సీడబ్ల్యూసీ సభ్యులు, సీనియర్ నేతలు కలిపి 75 మంది ఏఐసీసీ కార్యాలయంలో వోటేశారు. మరో 280 మంది పీసీసీ డెలిగేట్స్ దిల్లీ కాంగ్రెస్ ఆఫీసులో వోటు హక్కు వినియోగించుకున్నారు. ఇక తెలంగాణలో ఏఐసీసీ అధ్యక్ష ఎన్నికల పోలింగ్ కోసం గాంధీభవన్‌లో ఏర్పాట్లు చేశారు. పోలింగ్ ప్రారంభమైన వెంటనే పార్టీ సీనియర్ నేత షబ్బీర్ అలీ తొలి వోటు వేశారు. అనంతరం జానారెడ్డి, పొన్నాల లక్ష్మయ్య కూడా వోటు హక్కు వినియోగించుకున్నారు. భారత్ జోడో పాదయాత్రలో ఉన్న రాహుల్ గాంధీ కర్నాటక రాష్ట్రంలోని బళ్లారి జిల్లా సంగనకల్లు క్యాంపులో ఏర్పాటు చేసిన ప్రత్యేక పోలింగ్ బూత్‌లో వోటు వేశారు. అధ్యక్ష ఎన్కిల బరిలో ఉన్న మల్లిఖార్జున్ ఖర్గే గెంగళూరులోని కర్నాటక పిసిసి కార్యాలయములో తన వోటు హక్కును వినియోగించుకున్నారు. కాగా సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్ జరిగింది.
పోలింగ్ పూర్తయ్యాక బ్యాలెట్ బాక్సులకు సీల్ వేసి దిల్లీలోని ఏఐసీసీ హెడ్ క్వార్టర్స్‌కు తరలించారు. ఈ నెల 19 పోలైన వోట్ల లెక్కింపు చేపట్టి, ఫలితాలు ప్రకటిస్తారు. కాంగ్రెస్ అధ్యక్ష పదవికి శశిథరూర్, మల్లికార్జున ఖర్గే పోటీ చేస్తున్న విషయం వధితమే. అయితే పార్టీలో సీనియర్లు చాలా మంది ఖర్గేకే మద్దతు ఇస్తున్నారు. దీంతో ఆయన గెలుపు లాంఛనమేనంటున్నారు నేతలు. ఇద్దరిలో ఎవరు గెలిచినా కలిసి పనిచేస్తామన్నారు. తన భావాజాలంలో ఏమాత్రం తేడా లేదని, పనిచేసే విధానంలోనే తేడా ఉంటుందన్నారు స్పష్టం చేశారు. మల్లికార్జున ఖర్గే సీనియర్ నేత అని పేర్కొన్న ఆయన గెలిస్తే సహజంగానే తాను సహకరిస్తానని శశిథరూర్ పునరుద్ఘాటించారు. 137 ఏళ్ల కాంగ్రెస్ చరిత్రలో అధ్యక్ష ఎన్నికలకు పోలింగ్ జరగడం ఇది ఆరోసారి మాత్రమే. సోనియా, రాహుల్, ప్రియాంక బరిలో లేకపోవడంతో 24 ఏళ్ల తర్వాత గాంధీయేతర కుటుంబాలకు చెందిన వ్యక్తి కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు కానున్నారు.
జనగామ శ్రీనివాసరెడ్డి వోటు గల్లంతు…ఆగ్రహం వ్యక్తం చేసిన పొన్నాల లక్ష్మయ్య
కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష ఎన్నిక పోలింగ్ జగురుతున్న సందర్భంగా గాంధీభవన్ వద్ద మాజీ మంత్రి పొన్నాల లక్ష్మయ్య కొంత అసహనం వ్యక్తం చేశారు. జనగామ జిల్లాకు చెందిన శ్రీనివాస్ రెడ్డిని వోటు వేయకుండా పీఆర్వో అడ్డుకోవడంపై ఆగ్రహం వ్యక్తంచేశారు. 45 ఏండ్ల కాంగ్రెస్ మనిషికి అవమానం జరిగిందని విరుచుకుపడ్డారు. వోటరు లిస్టు నుంచి శ్రీనివాస్ రెడ్డి పేరును చివరి క్షణంలో ఎలా తొలగిస్తారని ఆయన ప్రశ్నించారు. అయితే పీఆర్వోతో వాగ్వాదానికి దిగిన పొన్నాలను సీనియర్ నేత జానారెడ్డి సముదాయించి అక్కడి నుంచి తీసుకెళ్లారు. అధ్యక్ష ఎన్నికల్లో వోటేసేందుకు ప్రతి నియోజకవర్గంనుంచి ఇద్దరికి అవకాశం కల్పించారు.
ఇందులో భాగంగా జనాగామ నుంచి పొన్నాల లక్ష్మయ్య, చెంచారపు శ్రీనివాస్ రెడ్డికి ఏఐసీసీ వోటింగ్ కార్డు జారీచేసింది. అయితే గత రాత్రి శ్రీనివాస్ రెడ్డి స్థానంలో కొమ్మూరు ప్రతాప్ రెడ్డి పేరును రాష్ట్ర నాయకత్వం చేర్చింది. దీంతో వోటు వేయడానికి గాంధీభవన్‌కు వొచ్చిన శ్రీనివాస్ రెడ్డిని పీఆర్వో సిబ్బంది అడ్డుకున్నారు. దీనిపై అక్కడే ఉన్న పొన్నాల..సిబ్బందిపై ఆగ్రహం వ్యక్తంచేశారు. రాత్రికిరాత్రే కొమ్మూరి పేరును ఎలా చేర్చుతారని ప్రశ్నించారు. శ్రీనివాస్ రెడ్డికి వోటువేసే అవకాశం కల్పించాలని డిమాండ్ చేశారు. కాగా, ప్రస్తుతం శ్రీనివాస్ రెడ్డి, కొమ్మూరి ప్రతాప్ రెడ్డి ఇద్దిరినీ వోటేయకుండా పీఆర్వో సిబ్బంది ఆపేశారు.