- అరెస్ట్టు చేయడానికి వొచ్చినప్పుడు బండి చేతిలోనే ఉంది
- ప్రధాని మోదీ సభను విజయవంతం చేయాలని చెప్పారు
- కేసులకు భయపడేది లేదని ధీమాగా ఉన్నారు
- బండిని కలిసిన భార్య అపర్ణ వెల్లడి
కరీంనగర్, ప్రజాతంత్ర, ఏప్రిల్ 6 : బండి సంజయ్ ఫోన్ ఎక్కడుందో పోలీసులకే తెలుసని ఆయన భార్య అపర్ణ వ్యాఖ్యానించారు. పోలీసులు వొచ్చే వరకు బండి ఫోన్ మాట్లాడుతున్నారని గుర్తు చేశారు. అరెస్టులకు భయపడేది లేదన్నారు బండి సంజయ్ భార్య అపర్ణ అన్నారు. పేపర్ లీక్ కేసులో కావాలనే సంజయ్‌ని అరెస్టు చేశారని అన్నారు. బీజేపీ పార్టీ అందరికీ అండగా ఉంటుందని..ఎవరూ ఆందోళన చెందవద్దని సంజయ్ చెప్పారని అపర్ణ తెలిపారు. కరీంనగర్ జిల్లా జైల్లో తన భర్త బండి సంజయ్‌ని కలిసి బయటికి వొచ్చిన తర్వాత అపర్ణ వి•డియాతో మాట్లాతూ…తనపై పెట్టిన తప్పుడు కేసుల విషయంలో ఆయన ఏమాత్రం భయపడడం లేదని.. కాకపోతే కొద్దిగా ఫిజికల్‌గా స్ట్రెయిన్ అయినట్లు కనిపించారని ఆమె తెలిపారు. రాష్ట్రంలో జరిగే మోదీ సభను విజయవంతం చేయాలని బండి సంజయ్ పిలుపు నిచ్చారన్నారు. కార్యకర్తలు ఎవరు అధైర్య పడకూడదని బండి సంజయ్ మాటగా తాను చెబుతున్నానని అపర్ణ వెల్లడించారు.
ఎలాంటి ఎమోషన్స్ కూడా లేని ఈ ప్రభుత్వానికి బలగం సినిమా చూపించాలన్నారు. టెన్త్ పేపర్ లీక్ కేసులో అరెస్ట్ అయ్యి..కరీంనగర్ జైలులో ఉన్న బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్‌ను అతని భార్య అపర్ణ, కుమారుడు, బావమరిది కలిశారు. గురువారం ఉదయం ములాఖత్ కింద భార్య అపర్ణ దరఖాస్తు చేసుకోగా.. అనుమతి ఇచ్చారు అధికారులు. ఈ క్రమంలోనే జైలులో ఉన్న భర్తను కలిసి క్షేమ సమాచారాన్ని అడిగి తెలుసుకున్నారు. అర్థరాత్రి ఇంటికొచ్చి బలవంతంగా తీసుకెళ్లిన సమయంలో..ఆమె అక్కడే ఉన్నారు. 24 గంటల తర్వాత భర్తను జైలులో కలవటంతో కన్నీళ్లు పెట్టుకున్నారు. సంజయ్‌కు కొన్ని అనారోగ్య సమస్యలు ఉన్నాయి. గతంలో ఆయనకు గుండెకు చికిత్స జరిగింది. ఈ క్రమంలోనే తీసుకుంటున్న ట్యాబ్లెట్లు, ఆహారంపై వాకబు చేశారు భార్య అపర్ణ. ఇక సంజయ్ సెల్ ఫోన్ ఎక్కడ ఉందో తమకు తెలియదన్నారు. అరెస్ట్ చేస్తున్న సమయంలో ఆయన ఫోన్ మాట్లాడుతూనే ఉన్నారని..తోపులాటలో సెల్ ఫోన్ పడిపోయిందేమోనని అపర్ణ అన్నారు. సెల్ ఫోన్ ఎవరి దగ్గర ఉందో పోలీసులకే తెలియాలన్నారు. పోలీసుల ఆరోపణలను ఖండిస్తున్నానన్నారు. ఆయన ఆరోగ్యం బాగానే ఉందని.. మెడిసిన్ వేసుకున్నారని అపర్ణ తెలిపారు.