బాసరలో కొనసాగుతున్న విద్యార్థుల ఆందోళన

  • కోదండరామ్‌ ‌సహా మద్దతు తెలపడానికి వొచ్చిన వారి అరెస్ట్
  • ‌మంచినీటి సరఫరా నిలిపివేసిన అధికారులు
  • సోషల్‌ ‌మీడియా వేదికగా విద్యార్థుల సందేశాలు
  • ప్రభుత్వ దిష్టిబొమ్మను దగ్ధం చేసిన బిజెవైఎం

నిర్మల్‌, ‌ప్రజాతంత్ర, జూన్‌ 15 : ‌బాసర ట్రిపుల్‌ ఐటిలో విద్యార్థుల ఆందోళన మూడోరోజు గురువారం కూడా కొనసాగింది. మెయిన్‌ ‌గేటు ఎదుట విద్యార్థులు నిరసన చేపట్టారు. దీంతో విద్యార్థులు గేటు వైపు దూసుకు రాకుండా పోలీసులు బారికేడ్లను ఏర్పాటు చేశారు. దీంతో ఆర్‌జీయూకేటీ రెండో గేటు ఎదుట విద్యార్థులు బైఠాయించారు. మద్దతుగా వచ్చిన విద్యార్థుల కుటుంబసభ్యులను పోలీసులు అరెస్ట్ ‌చేసి పోలీస్‌ ‌స్టేషన్‌కు తరలించారు. 12 డిమాండ్లతో విద్యార్థులు ఆందోళన చేస్తున్నారు. ఎనిమిది వేల మంది విద్యార్థులంతా తరగతులను బహిష్కరించి వర్సిటీలో నెలకొన్న సమస్యలపై గొంతెత్తారు. వర్సిటీ ప్రధాన గేటు వద్ద రోజంతా బైఠాయించి ఆందోళన నిర్వహించారు. వర్షంలో తడుస్తూనే కదలకుండా రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసన వ్యక్తంచేశారు. సీఎం కేసీఆర్‌ ‌వర్సిటీకి వచ్చి.. సమస్యలు పరిష్కరించేదాక ఆందోళన ఆపబోమని స్పష్టంచేశారు. సోషల్‌ మీడియా వేదికగానూ వేల మంది విద్యార్థులు తమ నిరసన తెలిపారు. సమస్యలు పరిష్కరిస్తామని మంత్రి కేటీఆర్‌ ‌హమీ ఇచ్చినా.. వైస్‌ ‌చాన్సలర్‌తో సమావేశం ఏర్పాటు చేసి సమస్యల పరిష్కారం కోసం చర్యలు తీసుకోనున్నట్లు విద్యాశాఖమంత్రి సబితా ఇంద్రారెడ్డి ప్రకటించినా విద్యార్థులు మాత్రం పట్టు వీడటం లేదు. మాటలు చెప్పొద్దని..తమ సమస్యలకు పరిష్కారం చూపాలని సోషల్‌ ‌మీడియా వేదికగా మంత్రులకు విద్యార్థులు ఘాటైన సమాధానాలిచ్చారు.

మూడోరోజూ ఆందోళనతో బాసర ట్రిపుల్‌ ఐటీ దగ్గర ఉద్రిక్తత కొనసాగుతోంది. ఖాళీ వాటర్‌ ‌బాటిల్స్‌తో విద్యార్థులు నిరసనకు దిగారు. అయితే మెయిన్‌ ‌గైట్‌ ‌వైపు విద్యార్థులు రాకుండా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. మరోవైపు విద్యార్ధులకు మద్దతుగా వొస్తున్న తల్లిదండ్రులు సహా నాయకులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఇంకోవైపు విద్యార్ధుల ధర్నాకు మద్దతు తెలిపేందుకు వొచ్చిన తెలంగాణ జనసమితి నేత చీఫ్‌ ‌కోదండరామ్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. తమ డిమాండ్లు నెరవేరుస్తామని ప్రభుత్వం నుంచి స్పష్టమైన హామీ వచ్చేవరకు నిరసనలు కొనసాగిస్తామని విద్యార్థులు తేల్చిచెప్పారు. విద్యార్ధులకు మద్దుతు తెలిపేందుకు వొస్తున్న నేతల్ని ఎక్కడిక్కడ అడ్డుకుంటున్నారు. దీంతో ట్రిపుల్‌ ఐటీ దగ్గర గందగోళ పరిస్థితి నెలకొంది. బాసర ట్రిపుల్‌ ఐటీ విద్యార్థుల ఆందోళనకు బీజేపీ పూర్తి మద్ధతు ఇస్తుందని ఎంపీ సోయం బాపురావు అన్నారు. బాసరలో అరకొర వసతులతో విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నట్లు తెలిపారు.

రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యంతో విద్యార్థుల సమస్యలు ఎదుర్కుంటున్నాని..సర్కార్‌ ‌వెంటనే సమస్యలను పరిష్కరించాలని డిమాండ్‌ ‌చేశారు. ఇదిలావుంటే బాసరలో ఆందోళన చేస్తున్న విద్యార్థులకు అధికారులు తాగునీటి సరఫరాను నిలిపివేశారు. దీంతో నీరు లేక విద్యార్థులు ఇబ్బందులకు లోనవుతున్నారు. ఈ విధంగా తమపై ఒత్తిడి తెస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. మా క్యాంపస్‌ ఎస్పీ కంట్రోల్‌లో ఉంది…తాగునీరు, విద్యుత్‌ ‌సౌకర్యం పునరుద్దరించాలని విద్యార్థులు ట్వీట్‌ ‌చేశారు. మరోవైపు బాసర విద్యార్థులు గేటు వైపు దూసుకురాకుండా పోలీసులు చర్యలు తీసుకున్నారు. బారికేడ్లను ఏర్పాటు చేశారు. 12 డిమాండ్లతో గత మూడు రోజులుగా విద్యార్థులు ఆందోళన చేస్తున్న విషయం తెలిసిందే.

మద్దతు తెలుపుతూ హైదరాబాద్‌లో ప్రభుత్వ దిష్టిబొమ్మను దగ్ధం చేసిన బిజెవైఎం
బాసర ట్రిపుల్‌ ఐటీ విద్యార్థుల సమస్యలను పరిష్కరించాలని డిమాండ్‌ ‌చేస్తూ బీజేపీ రాష్ట్ర కార్యాలయం ప్రధాన రహదారిపై యువ మోర్చా నాయకులు ప్రభుత్వ దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. ఈ సందర్భంగా బీజేవైఎం రాష్ట్ర అధ్యక్షుడు భాను ప్రకాష్‌ ‌మాట్లాడుతూ…బాసర ట్రిపుల్‌ ఐటీ విద్యార్థులు తమ సమస్యలను పరిష్కరించాలని పోరాటం చేస్తున్నారన్నారు. 6 వందల మంది విద్యార్థులు 12 డిమాండ్లతో పోరాటం చేస్తుంటే..విద్యాశాఖ మంత్రి సిల్లీ సమస్యలంటూ ఎగతాళి చేశారని మండిపడ్డారు. తక్షణమే విద్యాశాఖ మంత్రి క్షమాపణ చెప్పాలని డిమాండ్‌ ‌చేశారు. విద్యార్థులను చర్చల పేరుతో బెదిరింపులకు గురి చేసిన నిర్మల్‌ ‌జిల్లా కలెక్టర్‌ను తొలగించాలన్నారు. ప్రభుత్వం తక్షణమే సమస్యలను పరిష్కరించాలని అన్నారు. లేనిపక్షంలో రేపటి నుంచి బాసరకు వెళ్లి ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని భానుప్రకాష్‌ ‌స్పష్టం చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page