బిజెపి తీరుతో గల్ఫ్‌లో అవమానాలు

నేతలపై చర్యలు తీసుకోవాలని ఓవైసీ డిమాండ్‌

‌హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, జూన్‌ 6 :‌మహ్మద్‌ ‌ప్రవక్తపై అనుచిత వ్యాఖ్యలు చేసిన బీజేపీ మాజీ అధికార ప్రతినిధి నుపుర్‌ ‌శర్మను అరెస్ట్ ‌చేయాల్సిందేనని ఎంఐఎం చీఫ్‌ అసదుద్దీన్‌ ఒవైసీ డిమాండ్‌ ‌చేశారు. ఆమె చేసిన వ్యాఖ్యల వల్ల గల్ఫ్ ‌దేశాల్లో భారత్‌పై తీవ్ర ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్నాయని, అరబ్‌ ‌దేశాల్లో భారత్‌ ‌ముఖం చెల్లకుండా పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. భారత విదేశాంగ విధానం నాశనమై పోయిందన్నారు. నుపుర్‌ ‌శర్మను సస్పెండ్‌ ‌చేస్తే సరిపోదని, ఆమెను అరెస్ట్ ‌చేయాలని అన్నారు. భారత విదేశాంగ శాఖ బీజేపీలో భాగమా అని ప్రశ్నించిన ఒవైసీ..గల్ఫ్ ‌దేశాల్లోని భారతీయులపై హింస, జాత్యహంకార దాడులు జరిగితే విదేశాంగ శాఖ అప్పుడేం చేస్తుందని ప్రశ్నించారు.

ఇలాంటి అవమానకరమైన వ్యాఖ్యలు చేసేందుకు బీజేపీ తన అధికార ప్రతినిధులను ఉద్దేశపూర్వకంగానే చర్చలకు పంపుతుందని ఒవైసీ ఆరోపించారు. అంతర్జాతీయ వేదికపై నుంచి విమర్శలు రావడంతోనే నుపుర్‌ ‌శర్మపై బీజేపీ చర్యలు తీసుకుందని అన్నారు. మహ్మద్‌ ‌ప్రవక్తపై వ్యాఖ్యల ఫలితంగా ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడి గౌరవార్థం ఖతర్‌లో ఇవ్వాల్సిన విందు రద్దు అయిందని, రెండు గల్ఫ్ ‌దేశాలు భారత రాయబారులకు సమన్లు ఇచ్చాయని గుర్తు చేశారు. నుపుర్‌ ‌శర్మపై చర్యలు తీసుకోవాలని ప్రధానిని తానెప్పుడో కోరానని, కానీ ఆయన పెడచెవిన పెట్టారని విమర్శించారు. గల్ఫ్ ‌దేశాల నుంచి వ్యతిరేకత వ్యక్తమైన తర్వాత మాత్రమే చర్యలు తీసుకున్నారని, కానీ అదెప్పుడో చేసి ఉండాల్సిందని అన్నారు. తమ అధికార ప్రతినిధి ముస్లింల మనోభావాలు దెబ్బతినేలా వ్యాఖ్యలు చేసిన విషయాన్ని తెలుసుకునేందుకు బీజేపీకి పది రోజులు పట్టిందని ఒవైసీ తూర్పారబట్టారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page