బీహార్‌కు ప్రత్యేక హోదా ఏదీ లేదు

జేడీయూ ఎంపీ రామ్‌‌ప్రిత్‌ ‌మండల్‌ ‌ప్రశ్న
•అలాంటిదే లేదని కేంద్రం సమాధానం

న్యూదిల్లీ,జూలై22:  బిహార్‌కు ప్రత్యేక హోదా ఇచ్చే ప్రతిపాదన ఏదీ లేదని తాజాగా కేంద్రం వెల్లడించింది. కేంద్రంలో అధికారంలో ఉన్న ఎన్డీయే కూటమిలో భాగమైన జనతాదళ్‌-‌యునైటెడ్‌ (‌జేడీయూ).. బిహార్‌కు ప్రత్యేక హోదా లేదా ప్రత్యేక ఆర్థిక ప్యాకేజీ ప్రకటించాలని డిమాండ్‌ ‌చేసింది. ఈ క్రమంలోనే ప్రభుత్వం నుంచి స్పందన వచ్చింది. ఆర్థికవృద్ధి, పారిశ్రామికీకరణను ప్రోత్సహించేందుకు బిహార్‌తో పాటు వెనకబడిన రాష్ట్రాలకు ప్రత్యేక హోదా కల్పించే ప్రణాళిక ఏదైనా ఉందా..? అని జేడీయూ ఎంపీ రామ్‌‌ప్రిత్‌ ‌మండల్‌ ‌కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖను ప్రశ్నించారు. దీనికి ఆ శాఖ సహాయ మంత్రి పంకజ్‌ ‌చౌధరీ రాతపూర్వక సమాధానం ఇచ్చారు.

బిహార్‌కు ప్రత్యేక హోదా ఇచ్చే ప్రతిపాదన ఏదీ లేదని పార్లమెంట్‌ ‌వేదికగా వెల్లడించారు. సార్వత్రిక ఎన్నికల ఫలితాల తర్వాత ఎన్డీయే కూటమిలో జేడీయూ కీలకంగా మారింది. 12 మంది సభ్యుల బలంతో కూటమిలో మూడో అతిపెద్ద పార్టీగా ఉంది. దాంతో ఇటీవల ప్రత్యేక హోదా ప్రతిపాదనను తెర పైకి తెచ్చింది. అదే తమ పార్టీ ప్రథమ ప్రాధాన్యం అని జేడీయూ ఎంపీ సంజయ్‌ ‌కుమార్‌ ఇటీవల వెల్లడించారు.

దానిని ఇవ్వడంలో కేంద్రానికి ఏదైనా సమస్య ఉంటే.. తాము ప్రత్యేక ప్యాకేజీని కోరతామని తెలిపారు. ఇక కేంద్రం నుంచి వచ్చిన స్పందనపై విపక్ష పార్టీ ఆర్జేడీ విమర్శలు గుప్పించింది. ‘కేంద్రంలో అధికారంలో భాగస్వామి అయిన జేడీయూ ఆ ఫలితాలను అనుభవించాలి. ప్రత్యేక హోదాపై వారి నాటకాలను కొనసాగించాలి‘ అని ఎద్దేవా చేసింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page