సిఎంగా నితీశ్ కుమార్, డిప్యూటీగా తేజస్వీ యాదవ్
పాట్నా, ఆగస్ట్ 10 : బీహార్‌లో ‘మహా ఘట్బంధన్’ ప్రభుత్వం కొలువుతీరింది. మధ్యాహ్నం 2 గంటలకు రాజ్‌భవన్‌లో నిరాడంబరంగా జరిగిన కార్యక్రమంలో ముఖ్యమంత్రిగా నితీష్ కుమార్, ఉపముఖ్యమంత్రిగా తేజస్వి యాదవ్ ప్రమాణస్వీకారం చేశారు. గవర్నర్ ఫగు చౌహాన్ వీరిచేత ప్రమాణస్వీకారం చేయించారు. మంత్రులను తదుపరి క్రమంలో నితీష్ తన క్యాబినెట్లోకి తీసుకోనున్నారు. ప్రమాణస్వీకారం అనంతరం తేజస్వికి నితీష్ అభినందనలు చెప్పారు. నితీష్ పాదాలకు తేజస్వి నమస్కరించే ప్రయత్నం చేయడంతో ఆయన వారించి నవ్వుతూ కరచాలనం చేశారు.
ఈ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి బీహార్ మాజీ ముఖ్యమంత్రి రబ్రీదేవి, మహా కూటమి నేతలు హాజరయ్యారు. బీహార్ సీఎంగా నితీష్ పగ్గాలు చేపట్టడం ఇది ఎనిమిదో సారి. బిజెపితో తెగగదెంపులు చేసుకున్న నితీశ్ ఆర్జెడితో కలసి ప్రబుత్వం ఏర్పాఉట చేశారు. బీహార్ అసెంబ్లీలో 243 మంది సభ్యులుండగా, జేడీయూకు 43, ఆర్జేడీ 79, సీపీఐ (ఎంఎల్)కు 12, సీపీఐ, సీపీఎంలకు చెరో ఇద్దరు ఎమ్మెల్యేల బలం ఉంది. బీజేపీకి 77 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. బీజేపీ, జనతాదళ్ యునైటెడ్ (జేడీయూ) సంకీర్ణ ప్రభుత్వాన్ని రద్దు చేసి, ఆయన ముఖ్యమంత్రిగా రాజీనామా చేశారు.
ఆ తర్వాత ఆర్జేడీ, కాంగ్రెస్, వామపక్ష పార్టీలతో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని నిర్ణయించుకున్నారు. ఈ మేరకు బుధవారం ప్రమాణస్వీకారం చేశారు. 2020లో బిహార్ అసెంబ్లీ ఎన్నికలు జరిగాయి. ఎన్డీయే కూటమి గెలిచి ప్రభుత్వాన్ని ఏర్పాటుచేసింది. కాగా, బీజేపీ, జేడీయూ, వీఐపీ, హెచ్ఏఎల్తో కలిసి నితీశ్ నాయకత్వంలో ఎన్డీయే ప్రభుత్వం ఏర్పడింది. ఈ కూటమిలో ఈ ఏడాది ప్రారంభంలో చీలికలు ప్రారంభమయ్యాయి. చివరకు బీజేపీతో నితీశ్‌కుమార్ తెగతెంపులు చేసుకున్నారు.