పార్లమెంటరీ కమిటీకి కొత్త చట్టాలు
బ్రిటిష్ ఇండియా సర్కారు 163 ఏళ్ల క్రితం రూపొందించిన భారత శిక్షాస్మృతికి ఇక కాలం చెల్లిపోనుంది. ఇండియన్ పీనల్ కోడ్‌ను తొలగించి కేంద్ర సర్కారు దాని స్థానంలో కొత్త చట్టాన్ని తీసుకురాబోతున్నది. ఈ మేరకు ఓ బిల్లును రూపొందించి లోక్‌సభలో ప్రవేశపెట్టింది. అంతేగాక దానిపై సూక్ష్మ పరిశీలన కోసం బిల్లును పార్లమెంటరీ ప్యానెల్‌కు పంపనున్నట్లు కేంద్ర హోమంత్రి అమిత్ షా వెల్లడించారు. ఇండియన్ పీనల్ కోడ్‌తో పాటు బ్రిటిష్ హయాం నాటి క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ , ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్ లను కూడా కేంద్రం తొలగించనుంది. వాటి స్థానంలో కూడా కొత్త బిల్లులను రూపొందించి లోక్‌సభలో ప్రవేశపెట్టింది.
ఇండియన్ పీనల్ కోడ్ స్థానంలో చేయబోయే కొత్త చట్టం కోసం ’ది భారతీయ న్యాయ సంహిత – 2023’ బిల్లును తీసుకొచ్చింది. అదేవిధంగా క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ స్థానంలో కొత్త చట్టం కోసం ’ది భారతీయ నాగరిక్ సురక్షా సంహిత -2023’ బిల్లును, ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్ స్థానంలో కొత్త చట్టం కోసం ’ది భారతీయ సాక్ష్య బిల్లు-2023’ను రూపొందించింది. ఈ మూడు బిల్లులను హోంమంత్రి అమిత్‌షా శుక్రవారం లోక్‌సభలో ప్రవేశపెట్టారు. వీటన్నింటిని సూక్ష్మ పరిశీలనకై పార్లమెంటరీ ప్యానెల్‌కు పంపనున్నట్లు తెలిపారు. ఈ పాత కాలం నాటి చట్టాలు అప్పటి బ్రిటిష్ ప్రభుత్వాన్ని కాపాడేవిగా, బలోపేతం చేసేవిగా ఉన్నాయని, అంతేగాక ఆ చట్టాల తుది లక్ష్యం శిక్షించడమే తప్ప న్యాయం చేయడం కాదని హోంమంత్రి పేర్కొన్నారు. అందుకే ఆ కాలం చెల్లిన చట్టాల స్థానంలో కొత్త చట్టాలు చేస్తున్నామన్నారు. కొత్త చట్టాల ద్వారా భారత పౌరులకు న్యాయం జరుగుతుందని, వారి హక్కులకు రక్షణ ఉంటుందని తెలిపారు.