భదాద్రి వద్ద తగ్గుతున్న గోదావరి ఉధృతి

  • ఇంకా వరదముంపులోనే అనేక గ్రామాలు – పునరావాస కేంద్రాలు కొనసాగింపు
  • పునరావాస కేంద్రాల్లో భోజన సౌకర్యాలు సరిగా లేవంటూ రోడ్లపై ధర్నా
  • కరకట్ట ఎత్తు పెంచాలని భదాద్రివాసులు భారీ ధర్నా –
  • పునరావాస కేంద్రాల్లో ఉన్న ప్రజలను కలిసిన ప్రత్యేక అధికార బృందం
  • నేడు భదాద్రికి రాష్ట్ర గవర్నర్‌ ‌తమిళసై రాజన్‌ ‌రాక
  • ఏరియల్‌ ‌సర్వే చేయనున్న సిఎం కెసిఆర్‌

‌భద్రాచలం, ప్రజాతంత్ర, జూలై 16 : గత వారం రోజులుగా ప్రజలను భయభ్రాంతులకు గురిచేసిన గోదావరమ్మ కాస్త శాంతించింది. శనివారం ఉదయం 71.3 అడుగులు ఉన్న గోదావరి నీటిమట్టం క్రమంగా తగ్గుతూ సాయంత్రానికి 69 అడుగులు చేరుకుంది. దీనితో ప్రజలు ఊపిరిపీల్చుకున్నారు. కాగా వరద ముంపులోనే అనేక గ్రామాలు ఉన్నాయి. ఇంకా ఇంటికి వెళ్లలేని పరిస్థితి నెలకొంది. గోదావరి వరద చాలా మెల్లగా క్రిందిభాగానికి వెళ్ళటం వలన గోదావరి వరద తగ్గటం లేదు. పినపాక, మణుగూరు, అశ్వాపురం మండలాలు వరద ముంపులోనే ఉన్నాయి. వారం రోజులుగా వరదనీరు ఇండ్లలోకి చేరుకోవడంతో ఇండ్లు పాక్షికంగా దెబ్బతినే పరిస్థితి ఉంది. బూర్గంపాడు మండలం సారపాకలో ప్రజలు భారీగా నష్టపోయారు. లోతట్టు ప్రాంతాల్లో ఉన్న ఇళ్ళు నీటమునిగాయి.ఐటిసి పేపర్‌ ‌బోర్డులోకి వరదనీరు చేరుకుంది. బూర్గంపాడు ప్రాంతం భారీగా నష్టపోయింది. వరదముంపులో ఉన్న వందలాది మందిని బిపిఎల్‌ ‌స్కూలులో తలదాచుకుంటున్నారు. పునరావాస కేంద్రాల్లో ఉన్న బాధితులకు అరకొర వసతులు ఉన్నాయని ప్రజలు వాపోతున్నారు. భోజన సౌకర్యం సరిగ్గాలేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. భద్రాచలం పట్టణంలోని అయ్యప్పకాలనీ, కొత్తకాలనీ, ఏఎంసీ కాలనీ, సుబాష్‌ ‌నగర్‌ ‌కాలనీ, వరదముంచెత్తింది.

వరదముంపులో ఉన్న బాధితులను డిగ్రీ కాలేజ్‌, ‌జూనియర్‌ ‌కాలేజ్‌ ‌మరియు హాస్టల్స్ , ‌నన్నపనేని స్కూల్‌, ఆర్‌& ‌బి గెస్ట్ ‌హౌస్‌లో పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేసి వారికి ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఏర్పాట్లు చేస్తున్నారు. కూనవరం రోడ్డులో ఉన్న సరోజిని వృద్దాశ్రమం వరదనీటితో మునిగిపోయింది. హుటాహుటిన అధికారులు స్పందించి 97 మంది వృద్దులను బిఇడి కాలేజ్‌లో వసతీ ఏర్పాటు చేసారు.వారిని అధికారులు ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు. శనివారం నాడు వృద్దులకు కిమిస్ట్, ‌డ్రగ్గిస్ట్ ఆధ్వర్యంలో 97 మంది వృద్దులకు వివిధ పరీక్షలు నిర్వహించి మందులు పంపిణీ చేసారు. పునరావాస కేంద్రాల్లో ఉన్న ప్రజలకు భోజన సౌకర్యం కొంత ఆలస్యం అవుతుందని రోడ్లపై ధర్నా నిర్వహిస్తున్నారు. అధికారులు సర్ది చెప్పి, ధర్నా విరమింప చేసారు. వరద క్రమంగా తగ్గుముఖం పడుతునప్పటికి పునరావాస కేంద్రాల్లో ఉన్న వరద బాధితులు అప్పుడే ఇండ్లకు వెళ్ళొద్దని కలెక్టర్‌ అనుదీప్‌ ఆదేశాలు జారీ చేసారు. పూర్తి స్థాయిలో వరద ప్రభావం తగ్గిన తరువాత ఇండ్లకు వెళ్ళాలని ఆదేశించారు. వారం రోజులుగా ఇళ్ళు నీటిలో ఉండటం వలన ఏదైన ప్రమాదం ఉన్నదో లేదో చూసిన తరువాత ఇండ్లకు వెళ్లాలని కోరారు.

నేడు గవర్నర్‌ ‌తమిళసై రాజన్‌ ‌రాక
వరద ప్రభావంతో అతలాకుతలం అయిన ప్రజలు. ముంపు ప్రాంతాల నుండి పునరావాస కేంద్రాలకు వెళ్ళి తలదాచుకుంటున్న ప్రజలను రాష్ట్ర గవర్నర్‌ ‌తమిళసై రాజన్‌ ఆదివారం నాడు పరామర్శించేందుకు భద్రాచలం వస్తున్నారు. భద్రాచలం పట్టణం, బూర్గంపాడు మండలాల్లో ఆమె పర్యటించనున్నారు. పునరావాస కేంద్రాల్లో వారికి అందుతున్న సదుపాయాలను నేరుగా బాధితులను అడిగి తెలుసుకోనున్నారు.

చెరువులను తలపిస్తున్న పంట పొలాలు
గత వారం రోజులుగా ఎగువ ప్రాంతం నుండి రికార్డు స్థాయిలో వరద వచ్చింది. దీని కారణంగా ప్రధాన రహదారులు, లోతట్టు ప్రాంతాలతో పాటూ పంట పొలాలను కూడ ముంచి వేసింది. పంట పొలాలు చెరువులను తలపిస్తున్నాయి. ఇప్పుడిప్పుడే నాట్లు వేసుకుంటూ రైతులు గోదావరి వరద పొలాల్లోనే ఉండటం వలన నారు మొత్తం కుళ్లిపోవడంతో రైతులకు తీవ్ర నష్టం వాటిల్లింది.

భదాద్రికి ప్రత్యేక అధికార బృందం
భద్రాచలం పట్టణంతో పాటు సమీప మండలాలు వరద ముంపులో చిక్కుకుని ఇబ్బందులు పడుతున్న దృష్ట్యా ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని కోరుతూ ప్రభుత్వం ప్రత్యేక అధికార బృందాన్ని పంపించింది. పంచాయితీరాజ్‌ ‌ప్రిన్సిపల్‌ ‌సెక్రటరీ హనుమంతరావు, రజత్‌కుమార్‌ ‌శైనీ, భద్రాచలం చేరుకొని పునరావాస కేంద్రాలను పరిశీలించారు. అలాగే కరకట్ట ప్రాంతాన్ని రవాణా శాఖా మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్‌తో కలిసి పరిశీలించారు.

వరద సహాయక చర్యల్లో పాల్గొన్న మంత్రి పువ్వాడ.. మరో రెండు రోజులు ఉండాలని సూచనలు
భద్రాచలం సమీప ప్రాంతాల్లో వరద ముంపుకు గురైన ప్రాంతాల్లో శనివారం రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్‌ ‌కుమార్‌ ‌పర్యటించారు.కొనసాగుతున్న సహాయక చర్యల్లో పాల్గోని బాధితులకు ధైర్యం చెప్పి పునరావాస కేంద్రంలోకి వెళ్ళాలని కోరారు.మీకు ఎలాంటి ఇబ్బంది లేకుండా ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటుందని వివరించారు.భద్రాచలం ,చర్ల ప్రధాన రహదారిపై వరద నీరు చేరి పూర్తిగా రాకపోకలు స్థంభించిన ప్రాంతాన్ని మంత్రి పరిశీలించారు. అటుగా ఎవరు వెళ్లకుండా పోలీస్‌ ‌సిబ్బందిని ప్రత్యేకంగా కేటాయించాలని జిల్లా ఎస్పీ వినీత్‌ ‌కి అదేశించారు.దీనితో పాటు ఎటపాక వద్ద రక్షణ చర్యలకు సిద్దంగా ఉండాలని సైనిక అధికారులకు సూచనలు చేశారు. అనంతరం గోదావరి నది వరద బాధితుల కొరకు ప్రభుత్వం ఏర్పాటు చేసిన పునరావాస కేంద్రాలను మంత్రి పువ్వాడ సందర్శించారు. వారిని కలిసి మాట్లాడారు. అక్కడ అందుతున్న సౌకర్యాల వివరాలు అడిగి తెలుసుకున్నారు. మరో రెండు రోజుల పాటు ఇక్కడే ఉండాలని, ఎలాంటి ఇబ్బందీ ఉండదని భరోసానిచ్చారు.ఆహారం, మెడిసిన్‌, ‌త్రాగునీరు, విద్యుత్‌ ‌తదితర సౌకర్యాలపై అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page