మళ్ళీ పెరుగుతున్న వరద – 5అడుగులు పెరిగే అవకాశం
భద్రాచలం, ప్రజాతంత్ర, జూలై 18 : గతవారం రోజులుగా గోదావరి వరద భయభ్రాంతులకు గురి చేసింది. అనేక గ్రామాలను వరదతో ముంచెత్తింది. నేటివరకు ఇంకా వరదముంపులోనే గ్రామాలు ఉన్నాయి. పంటపొలాలు కూడ చెరువులను తలపిస్తున్నాయి. ఆదివారం నుండి భద్రాచలం వద్ద గోదావరి మెల్లగా తగ్గుముఖం పట్టింది. 71.3 అడుగులు ఉన్న గోదావరి నీటిమట్టం సోమవారం 11 గంటలకు 56.1 అడుగుకు తగ్గింది. అప్పటి నుండి సుమారు 7గంటల పాటు 56.1అడుగులు ఉంటూ నిలకడగా ఉంది. ఎగువ ప్రాంతంలో వరదనీరు ఉండటం వలన దిగువ భాగానికి నీటిని విడుదల చేస్తున్నారు. దీని కారణంగా ఏటూరునాగారం, పేరూరు వద్ద క్రమక్రమంగా వరద పెరుగుతుంది. ప్రాణహిత, బైన్సా వద్ద వరదనీరు చేరుకుంటుంది. దీనికారణంగా భద్రాచలం వద్ద వరద నిలకడగా ఉంది. ఏమాత్రం తగ్గటం లేదు. క్రమంగా 5 అడుగుల మేర పెరిగే అవకాశం ఉంది. అధికారులు ఇప్పటికే ప్రజలను అప్రమత్తం చేసారు.
56 అడుగులు నీటిమట్టం ఉండటంతో కొన్ని కాలనీలు, గ్రామాలు వరదనీరు తీసింది. ఆ ప్రాంతాలను పంచాయితీ అధికారులు పారిశుధ్య కార్యక్రమాన్ని చేపట్టారు. అయినప్పటికి ముంపు బాధితులు పునరావాస కేంద్రాల్లోనే తలదాచుకుంటున్నారు. ప్రత్యేక అధికారులు ఎప్పటికప్పుడు పునరావాస కేంద్రాలకు వెళ్ళి బాధితులను పరామర్శించటమే కాకుండా వారికి అందుతున్న సౌకర్యాలను అడిగి తెలుసుకుంటున్నారు. చర్ల, దుమ్ముగూడెం ప్రాంతాలకు రోడ్డు మార్గం లేకపోవడం వలన ప్రత్యేక హెలీక్యాఫ్టర్ ద్వారా నిత్యవసర వస్తువులను ఆ ప్రాంతానికి తరలిస్తున్నారు. పునరావాస కేంద్రాల్లో ఉన్న బాధితులకు భోజన సౌకర్యం కల్పిస్తున్నారు. వరద ప్రభావం ఎక్కువ ఉండటం వలన భద్రాచలం గోదావరి బ్రిడ్జిపై గురువారం సాయంత్రం రాకపోకలు నిలిపివేసారు. వరద ప్రభావం తగ్గుముఖం పట్టడంతో శనివారం సాయంత్రం నుండి వాహనాలను అనుమతించారు.
దీనితో ఆర్టిసి బస్సులు కూడ ప్రారంభమయ్యాయి. ముంపు ప్రాంతాల్లో 219 మంది గ్రామ పంచాయితీ సిబ్బందితో నిరంతరతం పారిశుధ్య కార్యక్రమాలు చేపడుతున్నారు. గోదావరి వరద ముంపు బాధితులు 12వేల 277 ఇళ్ళు ముంపుకు గురికాగా గోదావరి కాస్త తగ్గుముఖం పట్టడంతో 11,061 ఇళ్ళు బయటపడ్డాయి. ముంపుకు గురైన ఇండ్ల ప్రాంతాల్లో 2,330 మంది పారిశుధ్య పనులు నిర్వహిస్తున్నారు. సోమవారం కూడ 1216 గృహలు ముంపులోనే ఉన్నాయి. అధికారులు ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు. ఖమ్మం, భదాద్రి కొత్తగూడెం జిల్లాల కలెక్టర్లు విపి గౌతమ్, అనుదీప్ పర్యవేక్షణలో అధికారులు చురుగ్గా పనిచేస్తున్నారు.