భావ ప్రకటనా స్వేచ్ఛను హరించే కుట్ర

  • ఆందోళనలతో అడ్డుకుంటాం
  • కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు ఐజేయూ, టీయుడబ్ల్యుజె హెచ్చరిక

ముషీరాబాద్‌, ‌ప్రజాతంత్ర,మే 10 : దేశంలో మీడియా రంగాన్ని నిర్వీర్యం చేసి భావ ప్రకటన స్వేచ్ఛను కనుమరుగు చేసే పాలకుల కుట్రలను తమ ఆందోళనలతో అడ్డుకుంటామని ఇండియన్‌ ‌జర్నలిస్టస్‌ ‌యూనియన్‌(ఐజేయూ), తెలంగాణ రాష్ట్ర వర్కింగ్‌ ‌జర్నలిస్టుల సంఘం(టీయుడబ్ల్యుజె) సంఘాలు హెచ్చరించాయి. జర్నలిస్టుల సంక్షేమం పట్ల కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ధోరణిని నిరసిస్తూ ఐజేయూ  పిలుపు మేరకు జాతీయ స్థాయి ‘‘జర్నలిస్టస్‌ ‌డిమాండ్స్ ‌డే’’ కార్యక్రమంలో భాగంగా మంగళవారం నాడు విద్యానగర్‌ ‌లోని కేంద్ర కార్మిక శాఖ కార్యాలయం ముందు టీయుడబ్ల్యుజె ఆందోళన కార్యక్రమం చేపట్టింది. ఈ సందర్భంగా ఐజేయూ జాతీయ అధ్యక్షులు కే శ్రీనివాస్‌ ‌రెడ్డి మాట్లాడుతూ…కేంద్ర ప్రభుత్వం పథకం ప్రకారం మీడియా రంగాన్ని విస్మరిస్తుందని ఆందోళన వ్యక్తం చేశారు. దేశ వ్యాప్తంగా జర్నలిస్టులు అనేక సమస్యలను ఎదుర్కుంటున్నప్పటికీ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నిమ్మకు నీరెత్తినట్టుగా వ్యవహరించడం సహించారనిదన్నారు.

దేశ వ్యాప్తంగా మీడియా సంస్థలపై, జర్నలిస్టులపై దాడులు జరుగుతున్నా, జర్నలిస్టులు హత్యలకు గురవుతున్నా కేంద్ర ప్రభుత్వంలో ఏమాత్రం చలనం లేకపోవడం విచారకరమన్నారు. ఇందుకుగాను వెంటనే కేంద్ర, రాష్ట్ర స్థాయిలో మీడియా సంస్థల, జర్నలిస్టుల భద్రత కోసం ప్రత్యేక చట్టం తేవాలని ఆయన డిమాండ్‌ ‌చేశారు. ప్రెస్‌ ‌కౌన్సిల్‌ ఆఫ్‌ ఇం‌డియా స్థానంలో మీడియా కౌన్సిల్‌ ఆఫ్‌ ఇం‌డియాను వెంటనే ఏర్పాటు చేసి అందులో జాతీయ జర్నలిస్టు సంఘాలకు ప్రాతినిత్యం కల్పించాలని శ్రీనివాస్‌ ‌రెడ్డి కోరారు. సెంట్రల్‌ ‌మీడియా అక్రెడిటేషన్‌ ‌కమిటీలో జర్నలిస్టు సంఘాల ప్రాతినిధ్యాన్ని పునరుద్ధరించాలని ఆయన డిమాండ్‌ ‌చేశారు. ఐజేయూ కార్యదర్శి వై.నరేందర్‌ ‌రెడ్డి మాట్లాడుతూ..వర్కింగ్‌ ‌జర్నలిస్టస్ ‌యాక్టును పునరుద్ధరించాలని, పిబిఐ అక్రెడిటేషన్‌ ‌నిబంధనల్లో ఏకపక్ష మార్పులను ఉపసంహరించాలని, రైలు ప్రయాణ ఛార్జీలలో జర్నలిస్టుల రాయితీని యథావిధిగా కొనసాగించాలని ఆయన డిమాండ్‌ ‌చేశారు.

తెలంగాణ రాష్ట్ర వర్కింగ్‌ ‌జర్నలిస్టుల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కే విరాహత్‌ అలీ మాట్లాడుతూ..రాష్ట్రంలో జర్నలిస్టుల ఇళ్ల స్థలాల సమస్యను ప్రభుత్వం ఇంకెప్పుడు పరిష్కరిస్తుందని ప్రశ్నించారు. జర్నలిస్టులకు వెంటనే అక్రెడిటేషన్‌ ‌కార్డులు జారీ చేయాలని, దవాఖానల్లో హెల్త్ ‌కార్డులు చెల్లుబాటు అయ్యేలా చర్యలు చేపట్టాలని ఆయన డిమాండ్‌ ‌చేశారు. ఈ సందర్భంగా పలు డిమాండ్లతో కూడిన వినతిపత్రాన్ని కేంద్ర కార్మిక శాఖ డిప్యూటీ చీఫ్‌ ‌లేబర్‌ ‌కమిషనర్‌ ‌శ్రీనివాస్‌కు అందించారు. ఈ ఆందోళన కార్యక్రమంలో ఐజేయూ నాయకులు ఎం.ఏ.మజీద్‌, ‌కల్లూరి సత్యనారాయణ, టీయుడబ్ల్యుజె రాష్ట్ర ఉప ప్రధాన కార్యదర్శి విష్ణుదాస్‌ ‌శ్రీకాంత్‌, ‌రాష్ట్ర నాయకులు ఏ.రాజేష్‌, ‌మోతె వెంకట్‌ ‌రెడ్డి, ఎలక్ట్రానిక్‌ ‌మీడియా విభాగం నాయకుడు కల్కురి రాములు, తెలంగాణ రాష్ట్ర చిన్న, మధ్యతరగతి పత్రికలు, మేగజైన్స్ అసోసియేషన్‌ ‌రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు యూసుఫ్‌ ‌బాబు, బాలకృష్ణ, హెచ్‌యూజే కార్యదర్శి శిగ శంకర్‌ ‌గౌడ్‌, ‌నాయకులు ఆజం ఖాన్‌, ‌రాంచందర్‌, ‌శివప్రసాద్‌ ‌రెడ్డి, వెంకటచారీ, శ్రీనివాస్‌, ‌సాగర్‌, ‌జెపి చారీ, పి శ్రీనివాస్‌, ‌శ్రీధర్‌, ‌సుధాకర్‌, ఉపేందర్‌, ‌శిగ దయాకర్‌ ‌గౌడ్‌, ‌మేడిపల్లి ప్రెస్‌ ‌క్లబ్‌ అధ్యక్షుడు కల్కురి ఎల్లయ్యలతో పాటు పలువురు జర్నలిస్టులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page